![Two Sisters Suspicious Death In Rajahmundry - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/27/girls.jpg.webp?itok=FNbh3tE1)
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేనమామ వేధింపులే దీనికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం మల్లికార్జుననగర్‌లో నివసించే నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనంతలక్ష్మి(25)కి కొత్తపేట మండలం కళ్లావారిపాలేనికి చెందిన తేజతో వివాహమైంది. రెండో కుమార్తె దేవీ అరుణకుమారి(22) తండ్రిదగ్గరే ఉంటోంది. నాగేశ్వరరావు ఐస్ బండి నడుపుతూ జీవిస్తున్నాడు.
ఐదు రోజుల క్రితం పెద్ద కుమార్తె అనంతలక్ష్మి పుట్టింటికి వచ్చింది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు తలుపు కొట్టగా.. కుమార్తెలు తలుపు తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా అక్కాచెల్లెళ్లిద్దరూ కిటికీలకు చీరతో ఉరివేసుకొని ఉన్నారు. ఈ యువతుల మేనమామ చప్పిడి ఉమామహేశ్వరరావు కొంత కాలం క్రితం సింగపూర్ వెళ్లి పది రోజుల కిందటే రాజమహేంద్రవరం వచ్చాడు. సింగపూర్ వెళ్లక ముందు ఉమామహేశ్వరరావు అనంతలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అనంత లక్ష్మి తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఉమామహేశ్వరరావు అనంతలక్ష్మిపై ఒత్తిడి తెస్తూ ప్రతి రోజూ ఘర్షణకు దిగేవాడు. దీంతో మనస్తాపానికి గురైన అక్కాచెల్లెళ్లు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎలా చనిపోవాలనే విషయమై అక్కాచెల్లెళ్లు మూడు చీటీలు రాశారు...అందులో ఉరి వేసుకొని...విషం తీసుకొని...గోదావరిలో పడి అని రాసి ఉంది. అందులో ఒక చీటీ తీసి ఉరినే మరణానికి ఎంచుకున్నట్లుగా మృత దేహాల పక్కన ఉన్న చీటీల ప్రకారం తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment