దొంగలించిన కారును తిరుపతిలో విక్రయించేందుకు వెళుతూ నాటకీయంగా ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో వారు నేరాల చిట్టా విప్పారు. వైఎస్సార్ జిల్లాలో కూడా వీరు వాహనాలను చోరీ చేశారు.
పీలేరు (చిత్తూరు): ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు కార్లు, మూడు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పీలేరు–తిరుపతి మార్గంలోని కోటపల్లె క్రాస్ వద్ద సీఐ ఏసీ పెద్దన్న ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న మారుతి సుజుకి 800 కారు పోలీసులను చూసి వెనుదిరిగి వేగంగా పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు అనుమానించి వాహనాన్ని వెంబడించారు. అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ కారును నాలుగు రోజుల క్రితం కలికిరి మండలం ఎర్రబల్లిలో చోరీ చేసినట్లు నిందితులు వెల్లడించారు.
అంతేకాక వారు నేరాల చిట్టా విప్పడంతో వీరు పాత నేరస్తులని, వీరిలో ఒకడు కలికిరిలోని కొలిమి వీధికి చెంది షేక్ అల్లాబక్ (19), మరొకడు అనంతరపురం జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవల్లీ కాలనీ వాసి సయ్యద్ మౌలాలి (35)అని తేలింది. కలికిరి మండలం బండకాడపల్లెలో ఒక పల్సర్ బైక్, స్థానిక ఇందిరానగర్‌లో హీరోహోండా బైక్, చెన్నారెడ్డి వీధిలో ఒక ఆటోను దొంగలించి పీలేరు–మదనపల్లె మార్గంలోని ఒక పాడుబడ్డ గోడౌన్‌లో దాచి ఉంచినట్లు దొంగలు పేర్కొన్నారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తిరుపతి రోడ్‌లోని పెయింటింగ్ షెడ్‌లో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మారుతి స్విఫ్ట్ డిజైర్‌ను దొంగలించినట్లు తేలింది. ఆ కారును విక్రయించేందుకు గతనెల 15న చెన్నైకి వెళుతుండగా తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో అక్కడే వదలి పారిపోయినట్లు దొంగలు తెలిపారు.
బెయిల్‌పై వచ్చి చోరీలు..!
అల్లాబక్ పై జిల్లాలోని రాయచోటి, చిన్నచౌక్, కడప వన్‌టౌన్‌లో చిత్తూరు జిల్లా సోమల, చంద్రగిరి, పూతలపట్టు, రొంపిచెర్ల, రేణిగుంట, తిరుపతి ఈస్ట్, తిరుపతి వెస్ట్, తిరుపతి క్రైమ్, మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో 22 కేసులు నమోదై ఉన్నాయి. వీటికి సంబంధించి 24 ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో గత ఏడాది ఫిబ్రవరిలో సోమల పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన నిందితులు అనంతపురం జిల్లా కదిరి టౌన్‌కు చెందిన సయ్యద్ మౌలాలితో కలిసి మళ్లీ మోటర్ సైకిళ్లు, కార్ల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. చోరీ చేసిన వాహనాలను దాచి ఉంచిన పాత గోడౌన్‌లో ఒక షిఫ్ట్ కారు, మారుతీ సుజుకి కారు, ఆటో, పల్సర్, ప్యాషన్‌ప్రో బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.95 లక్షలుగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో పీలేరు అర్బన్ సీఐ ఏసీ పెద్దన్న, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment