మట్టుబెట్టి మంటబెట్టి..! | Unknown Person Murder In Guntur | Sakshi
Sakshi News home page

మట్టుబెట్టి మంటబెట్టి..!

Published Fri, Aug 17 2018 1:54 PM | Last Updated on Fri, Aug 17 2018 1:54 PM

Unknown Person Murder In Guntur - Sakshi

ఎప్పుడు చంపారో తెలియదు.. ఎక్కడ చంపారో తెలియదు.. ఎవరు మట్టుబెట్టారో తెలియదు.. పక్కాగా హతమార్చారు. మృతి చెందాక కల్వర్టు అడుగు భాగంలోని తూములో మూటకట్టి పడేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం – కట్టుబడివారిపాలెం గ్రామాల మధ్య గురువారం ఓ యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్య స్థానికుల్లో కలకలం రేపింది.

చిలకలూరిపేటరూరల్‌: మండలంలోని కమ్మవారిపాలెం నుంచి కట్టుబడివారిపాలెం గ్రామానికి వెళ్లే ఆర్‌ అండ్‌ బీ మార్గ మధ్యలో కల్వర్టు ఉంది. వర్షపు నీరు ప్రవహించేందుకు కల్వర్టు అడుగు భాగంలో సిమెంట్‌ పైపు ఏర్పాటు చేశారు. ఈ పైపులో యువకుడి మృతదేహం ఉన్నట్లు గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ యూ శోభన్‌బాబు, ఎస్‌ఐ పీ ఉదయ్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. ఇతర ప్రాంతంలో హత్య చేసి ప్లాస్టిక్‌ గోతంలో మూట కట్టి ఇక్కడకు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కల్వర్టు కింది భాగంలో ఉన్న పైపులో పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులుచెబుతున్నారు. మృతుడి ప్యాంట్‌పై ఈగ డ్రసెస్‌ అని ముద్రించి ఉంది. గోవిందపురం వీఆర్వో రియాజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాలు, మిస్సింగ్‌ కేసులు ఉన్న వారు వెంటనే రూరల్‌ పోలీసులను సంప్రదించాలని సీఐ శోభన్‌బాబు తెలిపారు..

గతంలోనూ ...
చిలకలూరిపేట ప్రాంతంలో ఇదే తరహాలో హత్యలు జరగడం విశేషం. మండలంలో మూడు ప్రదేశాల్లో నాలుగు కేసులు ఇలాంటివే ఉండడంతో.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు చెందిన ఒక వివాహిత భర్తకు మాయమాటలు చెప్పి నాదెండ్ల మండలం గణవవరం డొంకలోకి తీసుకువెళ్లి ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. చిలకలూరిపేటకు చెందిన వివాహిత, సోదరుడితో కలిసి భర్తను కొట్టి చంపి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. నరసరావుపేటకు చెందిన రౌడీషీటర్‌.. ఒక మహిళను హత్య చేసి గోతంలో మూటకట్టి మండలంలోని పోతవరం గ్రామంలో పడవేసి వెళ్లాడు. ఈ కేసులను శోధించిన పోలీసులు నిందితులను గుర్తించారు. అదే తరహాలో మరో హత్య జరగడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement