రాసనపల్లెలో ఉన్న నాటుసారా బట్టీ
చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై చేయి వేయాలంటేనే ఎవరైనా ఆలోచిస్తారు. అలాంటిది ఓ సీఐపై సారా కాస్తున్న వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారంటే వారి వెనుక బలమైన రాజకీయ నేతలు ఉండాలి. అవును.. సారా కాస్తున్న వారికి, సారాను అమ్మే వారికి, సారా రవాణా చేసే వారికి అధికార పార్టీ నాయకులు అండగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కొందరు టీడీపీ నేతలు వాళ్ల ఉనికిని చాటుకోవడానికి నిరక్ష్యరాస్యుల్ని పావులుగా చేసుకుని సారా సామ్రాజ్యానికి అధిపతులుగా రాణిస్తున్నారు.
హడలెత్తిస్తున్న రాసనపల్లె
చిత్తూరు తమిళనాడుకు సరిహద్దు కావడంతో గుడిపాల, పాలసముద్రం, ఎస్‌ఆర్.పురం, గంగాధరనెల్లూరు, పిచ్చాటూరు, సత్యవేడు, నగరి ప్రాంతాల్లో నాటుసారాను తయారు చేయడమే వృత్తిగా కొందరు ఎంచుకున్నారు. అన్నింటికంటే గుడిపాల మండలంలోని రాసపల్లె పేరు చెబితే పోలీసులు సైతం భయపడి వెనకడుకు వేసే పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలకు వెళుతున్న వారితో పాటు నాటుసారా తయారీని ప్రవృత్తిగా ఎంచుకున్న వారు సైతం ఉన్నారు. పక్కనే ఉన్న అటవీశాఖ భూముల్లో ఇష్టానుసారం సారా తయారు చేసి తమిళనాడు, కర్ణాటకతో పాటు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాసనపల్లెలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులను ఏ మాత్రం లెక్కచేయకుండా సారాజులు దాడులకు దిగడం పరిపాటిగా మారింది.
ఇలాంటివెన్నో..
సారా వ్యాపారుల దాడులతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఫలితంగా చిత్తూరు లాంటి ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు. గతేడాది అక్టోబర్‌లో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులపై సారా వ్యాపారులు దాడి చేశారు. 2016 ఏప్రిల్ 30న చిత్తూరు ఎక్సైజ్ అర్బన్ సీఐ గోపీకృష్ణపై దాడి చేసి సుమో అద్దాలను ధ్వంసం చేసి తమ ప్రాంతంకు రావొద్దంటూ హెచ్చరించారు. 2015 డిసెంబరులో చిత్తూరు నగరంలోని మూడో గేటు వద్ద సైతం గోపీకృష్ణపై సారా వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. తాజాగా దాడి చేసి చితకబాదారు.
అధికారుల మౌనం..
సారా వ్యాపారులు ఎక్సైజ్ పోలీసులపై దాడి చేస్తున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. ఓ వ్యక్తి తరచూ నేరాలకు పాల్పడుతుంటే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పెట్టొచ్చు. అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతున్న ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు పీడీ యాక్టుపై వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో 38 మంది సారా వ్యాపారులపై పీడీ యాక్టు పెట్టాలనే ప్రతిపాదన మూడేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. సంబంధిత ఫైలు కలెక్టర్ వద్దకు వెళ్లకుండా చిత్తూరుకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. దీంతో దాడులు పునరావృతమయ్యాయి.
‘ఈయన పేరు గోపీకృష్ణ. చిత్తూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అర్బన్ సీఐ. సారా ఊటల్ని ధ్వంసం చేయడానికి వెళ్లిన ఈయనపై రాళ్లతో దాడి చేశారు. ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని రక్తగాయాలతో సిబ్బందితో కలిసి పారిపోయి ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడ్డ వారిలో ఓ మహిళా కానిస్టేబుల్‌కు పక్కటెముకలు విరిగిగాయి. ఇదెక్కడో మారుమూల ప్రాతంలో జరిగింది కాదు. చిత్తూరు నుంచి పది కి.మీ దూరంలో ఉన్న రాసనపల్లెలో బుధవారం జరిగిన ఘటన.’
Comments
Please login to add a commentAdd a comment