
మద్యంమత్తు.. భర్త చేతిలో భార్యను తీవ్రగాయాలు పాలుజేస్తే, ఆవేశం.. తమ్ముడి చేతిలో అన్న జీవితాన్నే బలితీసుకుంది. జిల్లాలో ఒకేరోజు జరిగిన ఈ సంఘటనలు దిజారుతున్న మానవ సంబంధాలను మరోమారు గుర్తు చేశాయి.
ఆలిని నరికేశాడు..
∙భార్యపై కత్తితో దాడి
∙పరిస్థితి తీవ్ర విషమం
∙పరారీలో నిందితుడు
బైరెడ్డిపల్లె: మద్యం మహమ్మారి ఆ కుటుంబాన్ని దెబ్బతీసింది. తాగిన మైకంలో భర్త.. తాను మనిషినన్న విచక్షణ కోల్పో యాడు. మృగాడిగా మారి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కత్తితో కర్కశంగా నరికేశాడు. ఆ అభాగ్యురాలి ఆక్రందనలను పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఆ వివాహిత కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని కుప్పనపల్లెలో మంగళవారం భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు వి.కోట మండల ముమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నవనీత (26)తో కుప్పనపల్లె గ్రామానికి చెందిన జగదీశ్వరాచారి(35)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్ని రోజుల పాటు సజావుగా కొనసాగింది. అనంతరం భర్త జగదీశ్వరాచారి తాగుడుకు బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తల, నోటిపై నరకడంతో నవనీత అపస్మారక స్థితిలోకి చేరుకుంది. 108 సిబ్బంది కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవనీతం పరిస్థితి పూర్తి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలం పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. కాగా జగదీశ్వరాచారి పరారీలో ఉన్నాడు.
అన్నను హతమార్చాడు..
∙కర్రతో కొట్టిచంపిన వైనం
సత్యవేడు: తమ్ముడు కర్రతో కొట్టిన ఘటనలో సత్యవేడు మండలం పెద్ద ఈటిపాకం దళితవాడకు చెందిన రాబర్ట్(50) మృతి చెందాడు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు.. సోమవారం రాత్రి పెద్ద ఈటిపాకం దళితవాడలో బంధువుల ఇంటికి జైపాల్ భోజనం కోసం వెళ్లాడు. భోజనం లేదని బంధువుల చెప్పారు. దీంతో వారితో గొడవకు దిగాడు. ఇంటికి వచ్చి బంధువులు భోజనం పెట్టలేదని తన అన్నకు చెప్పాడు. తరచూ అయినవారిపై గొడవకు వెళుతుంటే ఎవరూ నీకు భోజనం పెట్టరని.. రాబర్ట్ తమ్ముడు జైపాల్‌ను మందలించాడు. అనంతరం తమ్ముడితో మాట్లాడుతూ సమీపంలోని రోడ్డు వద్దకు వచ్చాడు. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన జైపాల్ సమీపంలో దొరికిన కర్రతో కొట్టాడు. కింద పడి పోయిన అన్నను రోడ్డుకు సమీపంలోని శ్మశానం వరకు లాక్కెళ్లాడు. రాబర్ట్ తమ్ముడితో వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన భార్య వెతుకులాట ప్రారంభించింది. భర్త గాయాలతో పడి ఉండడాన్ని గమనించి వెంటనే సత్యవేడు వైద్యశాలకు తరలించింది. వైద్యులు పరీక్షించి అప్పటికే రాబర్ట్ మరణించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment