గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి, మృతి చెందిన బాలుడు రామ్‌లోహిత్
టెక్కలి రూరల్ : ఆ తల్లికి తెలీదు... ఉపాధినిచ్చిన వస్తువే కొడుకు ఊపిరి తీస్తుందని.. ఆ అమ్మకు తెలీదు ఇంటి గడప తన కన్నపేగు చివరి మజిలీ అవుతుందని.. అప్పటి వరకు అమ్మా అని పిలిచిన కొడుకు, మురిపెంగా మాట్లాడిన బిడ్డ నిస్సహాయుడిగా కొక్కేనికి వేలాడుతూ ఉంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది.
మాటలకు అందని విషాదం ఆమె కళ్ల వెంట కన్నీరై ప్రవహించింది. టెక్కలి మండలం బన్నువాడ పంచాయతీ నంబాళ్లపేటలో రామ్‌లోహిత్(8) అనే చిన్నారి మరణం స్థానికులను శోకంలో ముంచెత్తింది.
నంబాళ్లపేట గ్రామానికి చెందిన నంబాళ్ల నారాయణరావు, పద్మావతి దంపతుల పెద్దకుమారుడు రామ్‌లోహిత్(8) ఇంటి గడపలో ఉన్న కాటా వేసే కొక్కానికి పొరపాటున చొక్కా తగిలి మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్‌లోహిత్ తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. సరుకులు తూకం వేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన కాటాను గడప వద్దే ఏర్పాటు చేశారు. ఆ కాటా కింద బియ్యం బస్తాలు ఉన్నాయి.
మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో చిన్నారి బస్తాలపై ఆడుకుంటూ ఉండగా కాటా కొక్కెంనకు చొక్కా తగిలి ఉండిపోయింది. బాలుడి కాళ్లు కిందకు అందకపోవడంతో చొక్కా ఉరితాడుగా మారి చిన్నారి ప్రాణం తీసింది. తల్లి లేచి చూసే సరికి కొడుకు నిర్జీవంగా గాల్లో వేలాడుతూ కనిపించాడు.
గుండెలు పగిలేలా ఏడుస్తూ టెక్కలి ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశారు. అయితే బాలుడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అక్కడున్న వారి రోదనలు మిన్నంటాయి. ఘటనపై టెక్కలి ఎస్‌ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment