weighing machine
-
ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు!
నగరంలోని ఓ కిరాణా దుకాణంలోని ఎలక్ట్రానిక్ కాంటాపై అర కిలో బరువు తూకం రాయి (బాట్) వేసి బరువు చూడగా 640 గ్రాములు డిస్ప్లే అయింది. కిలో బాట్ వేస్తే 1,180 గ్రాములు డిస్ప్లే అయింది. రెండు కిలోలకు 2,205 గ్రాములు డిస్ప్లే అయింది. చేపలు, మాంసం మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. ఓ షాపులో కిలో కంది పప్పు కొనుగోలు చేసి మరో షాపులోని డిజిటల్ త్రాసుపై తూకం వేస్తే 1100 గ్రాముల బరువు డిస్ప్లే అయింది. తిరిగి ఆప్షన్ సరి చేసి తూకం వేస్తే అసలు బరువు రూ.900 గ్రాములు డిస్ప్లే అయింది. దీనిని బట్టి చూస్తే ప్రతి షాపులో తూకంలో దోపిడే. ఒక షాపులో 100 గ్రాములు, మరో షాపులో 200 గ్రాములుంది. తూనికల కొలతల శాఖచే స్టాంపింగ్ చేసిన తూకం రాళ్లతో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు. మార్కెట్లలో ‘సాక్షి’ పరిశీలనలో తూకం దోపిడీ బయటపడింది. సాక్షి, హైదరాబాద్: తప్పుడు తూకంతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిలువు దోపిడీకి గురై జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీధిలోని చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే వస్తోంది. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఉండేది కిలో కాదు.. 900 నుంచి 950 గ్రాములే! లీటర్ నూనె గానీ, పాలు గానీ తీసుకుంటే వస్తున్నవి 850 నుంచి 950 మిల్లీలీటర్లే. ఇవే కాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతూనే ఉంది. ఇక నేరుగా లారీ లు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనైతే భారీగా మోసాలు జరుగుతుంటాయి. వ్యాపారులు సాధారణ త్రాసులతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేయడం షరామామూలుగా మారింది. ఎలక్ట్రానిక్ కాంటాపై 1000, 2000 గ్రాముల తూకం రాళ్ల బరువు ఇలా.. 1,180, 2,205 ఎలక్ట్రానిక్లోనూ ట్యాంపరింగ్.. సాధారణ తూకం రాళ్ల త్రాసులతో మోసం జరుగుతుందని అందరూ భావిస్తారు.. అనుమానం వ్యక్తం చేస్తారు. అవసరమైతే వ్యాపారులను నిలదీస్తారు.. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసు, కాంటాల రీడింగ్ డిస్ప్లే అవుతుంది... అంతా కళ్ల ముందే కనిపిస్తుందని కాబట్టి మోసం జరగదన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసేది. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా డిస్ప్లేపై ఎక్కువ బరువు కనిపించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చేతివాటం ఇలా.. వ్యాపారులు ఎలక్ట్రానిక్, డిజిటల్ లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేస్తారు. ఉదాహరణకు.. ఆప్షన్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషన్‌పై 850 నుంచి 900 గ్రామలు బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్ప్లే అవుతోంది. అదే మీషన్‌పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి1150 గ్రాములు డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి కిలోకు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చేతివాటమే. అయిదు కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెరే . మరో ఆప్షన్‌ను నొక్కి వేస్తే మాత్రం తూకం సక్రమంగా ఉంటుంది. బ్రాండ్ల ప్యాకింగ్‌లో సైతం మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 మిల్లీలీటర్లు, 5 లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 మిల్లి లీటర్ల వరకు తక్కు వగా ఉండటం సర్వసాధారణం. పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తుంటారు. కొందరు వినియోగదారులు గుర్తించి ఫిర్యాదులు చేసినా... చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నగరంలోని సికింద్రాబాద్, రాంనగర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట తదితర మార్కెట్లలో తనిఖీ చేసేందుకు సిబ్బంది కొరత ఉంది. సమస్య వేధిస్తోంది.. నగర పరిధిలో çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపార సముదాయాలపై దాడులు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే తూనికలు, కొలతల శాఖ సిబ్బంది సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. గ్రేటర్ పరిధిలో అధికారులు, సిబ్బంది 25 మందికి మించరు. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కళ్లెదుటే మోసగిస్తారు.. మాదన్నపేట మార్కెట్లో కళ్లెదుటే తూకంలో దండి కొడతారు. అడిగితే గొడవకు దిగుతారు. కిలో కూరగాయలు కొంటే 800 గ్రాములే వస్తున్నాయి. – దశరథ లక్ష్మి, మాదన్నపేట ఫిర్యాదు నంబర్లను ప్రదర్శించాలి తూకంలో తేడా వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌నంబర్లను మార్కెట్లలో ప్రదర్శించాలి. – లలిత, కుర్మగూడ ఫిర్యాదు చేయొచ్చు ఇలా.. టోల్ ఫ్రీ నంబర్ : 180042500333 వాట్సాప్ నంబర్ : 73307 74444 ఈ మెయిల్ ఐడీ: clm&ts@nic.in -
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది. తప్పుడు తూకాలకు చెక్ చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి. వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
ధాన్యం కొనుగోళ్లలో ఘరానా మోసం
-
బరువు చెప్పని యంత్రాలు..!
అంగన్వాడీల సేవల్లో బరువు తూసే యంత్రాలే కీలకం. పిల్లలు, గర్భిణుల బరువును నెలనెలా రికార్డుల్లో నమోదు చేస్తారు. దాని ఆధారంగా పోషకాహారం అందజేస్తారు. బరువు పెరగకపోతే అదనపు పోషకాహారం ఇస్తారు. ఇది నిత్యప్రక్రియ. వీటికి బరువుతూసే యంత్రమే ఆధారం. గత టీడీపీ ప్రభుత్వం ఏడాది కిందట ఇచ్చిన వేయింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. బరువు సరిగా తెలియక అయోమయానికి గురవుతున్నారు. సాక్షి, విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు టీడీపీ ప్రభుత్వం సరఫరా చేసిన వేయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. వీటితో అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. తరచూ మరమ్మతులకు గురికావడం, బరువులో కచ్చితత్వం లేక పోవడంతో అంగన్వాడీలు పాత వేయింగ్ మిషన్ (బరువుతూసే పరికరం) వాడాల్సిన పరిస్థితి. తూకం సరిగా రాక... జిల్లాలోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 2,987 అంగన్వాడీ, 742 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 7 నెలలు నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,024 మంది, 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 41,714 మంది, గర్భిణులు 16,124 మంది, బాలింతలు 15,418 మంది ఉన్నారు. మొత్తం 1,37,280 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఏడాది కిందట వేయింగ్ మిషన్లు సరఫరా.. అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది కిందట గత టీడీపీ ప్రభుత్వం వేయింగ్ మిషన్లు పంపిణీ చేసింది. జిల్లాలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2,987, మినీ అంగన్వాడీ కేంద్రాలు 742కు సోలార్ వేయింగ్ మిషన్లు సరఫరా చేశారు. ఇవి సక్రమంగా పనిచేయడం లేదు. కొన్ని వేయింగ్ మిషన్లు ఆన్కావడం లేదు. కొన్ని మిషన్లు బరువులో తేడాలు చూపుతున్నాయి. దీంతో పిల్లలు, గర్భిణుల బరువును ఎలా పరిగణలోకి తీసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. కొత్త వేయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో కొన్నిచోట్ల పాత వేయింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. గర్భిణుల బరువు తూయడం కోసం... అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణుల బరువు తూయడం కోసం వేయింగ్ మిషన్లను సరఫరా చేశారు. ప్రతీనెలా గర్భిణుల బరువు తూసి వాటి వివరాలు అంగన్వాడీలు రికార్డుల్లో నమోదు చేస్తారు. బరువులో పెరగకపోతే వారికి అదనపు పౌష్టికాహారం ఇస్తారు. అయితే వేయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడం అంగన్వాడీలు అయోమయానికి గురవుతున్నారు. బాగుచేయించి ఇస్తున్నాం.. అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది కిందట సోలార్ వేయింగ్ మిషన్లు సరఫరా చేశాం. మరమ్మతులకు గురైన వాటిని జిల్లా కేంద్రానికి తీసుకొస్తే బాగు చేయించి ఇస్తున్నాం. పనిచేయని మిషన్లను తమదృష్టికి తీసుకుని వస్తే బాగు చేయించి ఇస్తాం. – శాంతకుమారి, ఏపీడీ, ఐసీడీఎస్ -
చొక్కా గొంతుకు బిగుసుకుని బాలుడు మృతి
టెక్కలి రూరల్ : ఆ తల్లికి తెలీదు... ఉపాధినిచ్చిన వస్తువే కొడుకు ఊపిరి తీస్తుందని.. ఆ అమ్మకు తెలీదు ఇంటి గడప తన కన్నపేగు చివరి మజిలీ అవుతుందని.. అప్పటి వరకు అమ్మా అని పిలిచిన కొడుకు, మురిపెంగా మాట్లాడిన బిడ్డ నిస్సహాయుడిగా కొక్కేనికి వేలాడుతూ ఉంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. మాటలకు అందని విషాదం ఆమె కళ్ల వెంట కన్నీరై ప్రవహించింది. టెక్కలి మండలం బన్నువాడ పంచాయతీ నంబాళ్లపేటలో రామ్‌లోహిత్(8) అనే చిన్నారి మరణం స్థానికులను శోకంలో ముంచెత్తింది. నంబాళ్లపేట గ్రామానికి చెందిన నంబాళ్ల నారాయణరావు, పద్మావతి దంపతుల పెద్దకుమారుడు రామ్‌లోహిత్(8) ఇంటి గడపలో ఉన్న కాటా వేసే కొక్కానికి పొరపాటున చొక్కా తగిలి మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్‌లోహిత్ తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. సరుకులు తూకం వేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన కాటాను గడప వద్దే ఏర్పాటు చేశారు. ఆ కాటా కింద బియ్యం బస్తాలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో చిన్నారి బస్తాలపై ఆడుకుంటూ ఉండగా కాటా కొక్కెంనకు చొక్కా తగిలి ఉండిపోయింది. బాలుడి కాళ్లు కిందకు అందకపోవడంతో చొక్కా ఉరితాడుగా మారి చిన్నారి ప్రాణం తీసింది. తల్లి లేచి చూసే సరికి కొడుకు నిర్జీవంగా గాల్లో వేలాడుతూ కనిపించాడు. గుండెలు పగిలేలా ఏడుస్తూ టెక్కలి ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశారు. అయితే బాలుడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అక్కడున్న వారి రోదనలు మిన్నంటాయి. ఘటనపై టెక్కలి ఎస్ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేశారు. -
తూనిక యంత్రం... తూతూ మంత్రం...
మనిషి వయసుకు తగ్గ ఎత్తు... అందుకు తగ్గ బరువు ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. దీనికోసం శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశాక ఏ వయసువారు ఎంత ఎత్తు ఉండాలి... ఎంత బరువు ఉండాలనేది నిర్థారించారు. పుట్టబోయే బిడ్డలనుంచి... పుట్టిన తరువాత పూర్తిస్థాయిలో ఎదుగుదల వచ్చేంతవరకూ ఆ లెక్కల ప్రకారమే ఉండాలంటే ఏమేరకు పౌష్టికాహారం అందివ్వాలో కూడా నిర్ణయించారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాలను వేదికగా చేశారు. అక్కడ చిన్నారులు, గర్భిణులు, బాలింతల బరువు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పౌష్టికాహారం ఇవ్వాలని నిర్దేశించారు.కానీ వారి బరువు తెలుసుకునే తూనిక యంత్రాలు మాత్రం నాణ్యమైనవి కాకపోవడంతో అవన్నీ అటకెక్కాయి. పార్వతీపురం : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్వాడీ కేంద్రాలను కీలకంగా నిర్ణయించారు. అందులోని నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు నిర్దేశిత బరువు కలిగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు రెండు రకాల తూనికల యంత్రాలను సరఫరా చేశారు. వీటిని జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద కొనుగోలు చేసి ఈ కేం«ద్రాలకు సరఫరా చేశారు. వీటిని ఉపయోగించి బరువు నమోదు చేసి రికార్డుల్లో పొందుపరుస్తూ అందుకు అనుగుణంగా వారికి పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించారు. చిన్నపిల్లలను ఒక ఓ బ్యాగ్‌లో వేసి తూసే త్రాసును సాల్టర్ స్కేల్ అని, నిల్చుని తూసే యంత్రాన్ని అడల్ట్ స్కేల్ అని పిలుస్తారు. వీటి ద్వారా బరువు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వారికి పౌష్టికాహారం సరఫరా చేయాలి. నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన ఈ యంత్రాలను వినియోగించి ప్రతీ నెలా తూనికలు కొలిచి ఆ వివరాలను రికార్డుల్లో పొందుపరచాలి. కానీ చాలా కేంద్రాల్లో తూనికల యంత్రాలు పూర్తిగా పనిచేయడంలేదు. కొన్ని చోట్ల యంత్రాలు తప్పుడు రిపోర్టులు చూపిస్తున్నాయి. మెషీన్లో ఏది చూపెడితే ఆ సంఖ్యనే రికార్డుల్లో నమోదు చేసి అంగన్వాడీ కార్యకర్తలు చేతులు దులుపుకోవడం తప్ప అవి వాస్తవాలా కావా అని ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. అన్నీ కాకమ్మ లెక్కలే... అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ నెలా చిన్నపిల్లలను, గర్భిణులను తూకం వేసి న్యూట్రీషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం ద్వారా వివరాలను కార్యకర్త నమోదు చేయాలి. కాని చాలా కేంద్రాల్లో ఈ తూనికల యంత్రాలు లేవు. కొన్ని చోట్ల పనిచేయడంలేదు. దీనివల్ల గత నెలలో వచ్చిన గణాంకాలకు కాస్త అటు ఇటుగా కలిపేసి రికార్డుల్లో చూపిస్తూ నివేదికలు పంపించేస్తున్నారు. ఒక వేళ ఎత్తుకు తగ్గ బరువుని పిల్లలున్నా ఆ వివరాలను రికార్డుల్లో చూపించడంలేదు. బరువు తక్కువగా ఉన్నట్టయితే ఆ పిల్లలను జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్సీకి తల్లి, బిడ్డను పంపించాలి. వారిని ఆ కేంద్రానికి పంపించేందుకు వారిని ఒప్పించడం చాలా కష్టం. అందుకని తక్కువ బరువు ఉన్నప్పటికీ అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నమోదు చేసేసి తప్పించుకుంటున్నారు. లెక్కింపు ఇలా... తక్కువ బరువున్నవారిని వేర్వేరు నివేదికల్లో పొందుపరచాలి. శాం(సివియర్ ఎక్యూర్ మాల్ నిరస్ట్), మేమ్లో(మోడరేట్ ఎక్యూర్ మాల్ నరిస్ట్) చూపిస్తారు. శాం అంటే అతి తక్కువ బరువు ఉన్నపిల్లలు, మేమ్ అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు. శాంలో ఉన్న పిల్లలను ఎన్ఆర్సీకి పంపించాల్సి ఉంటుందని తెలిసి వారిని మేమ్లో చూపించి అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంచి వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంతేగాకుండా తూనిక యంత్రాలు పనిచేయని కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో లోపభూయిష్టంగా గణాంకాలు నమోదౌతున్నాయి. ఐటీడీఏ సబ్ ప్లాన్మండలాల్లో గల కురుపాం ప్రాజెక్టు పరిధిలో 316 తూనిక యంత్రాలు అవసరం కాగా కేవలం 72 ఉన్నాయి. భద్రగిరి ప్రాజెక్టు పరిధిలో 186 అవసరం కాగా చిన్న పిల్లల బరువును నమోదు చేసే స్ప్రింగు తూనిక పరికరాలు 22 మాత్రమే పనిచేస్తున్నాయి. పార్వతీపురంలో 317 పరికరాలు అవసరం ఉన్నా 185 మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాచిపెంటలో 235కు 80 పరికరాలు, సాలూరు ప్రాజెక్టులో 237కు 78 పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో శిశువుల ఆరోగ్యం, ఎదుగుదల అంశాలపై తిరుపతికి చెందిన పద్మావతి విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానం విభాగం చేత ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు తదితర కొన్ని జిల్లాల్లో సర్వే చేయించారు. ఈ సర్వేలో ఐసీడీఎస్ ప్రతీ నెలా అందిస్తు న్న గణాంకాలకు ,క్షేత్ర స్థాయిలో వారు చేసిన పరిశీలనలో తెలుసుకున్న గణాం కాలకుచాల వ్యత్యాసాలు ఉన్నట్టు రూఢి అయ్యింది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్న కోణంలో పరశీలన జరపగా తూనిక యం త్రాల పనితీరు విష యం వెలుగులోకి వచ్చిం ది. దీనిని దృష్టిలో పెట్టుకుని మన జిల్లాలో ఉన్న పరిస్థితులు, మూలకు చేరిన తూనిక యంత్రాల బూజు దులిపే పనిలో ఆ శాఖాధికారులు తలమునకలయ్యారు. అసలు జిల్లాల్లో ఎన్ని తూనిక యంత్రాలున్నాయి. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి. ఎన్ని పనిచేయలేదు. అనే విషయాలపై పీడీ రాబర్ట్స్ ఆరా తీస్తున్నారు. పనిచేయని చోట అంగన్ వాడీ కార్యకర్తలు నివేదికలు ఎలా పంపిస్తున్నారు. అనే వాస్తవాలను ఐసీడీఎస్ సీడీపీఓల ద్వారా తెపించుకుంటున్నారు. గిరిజన ప్రాంతంలో సమగ్ర సర్వేపై పీఓ దృష్టి ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పౌష్టికాహార లోపంతో కూడిన శిశువులు నమోదౌతుంటారు. ఇలాంటి చోట్ల తూనిక యంత్రాలు సక్రమంగా పనిచేయకపోతే మాతా, శిశువుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న తూనిక యంత్రాల వివరాల సేకరణపై పీఓ డాక్టర్ జి.లక్ష్మిశ దృష్టిసారించారు. అవసరమైతే ఐటీడీఏ నిధులతో కొత్తవాటిని కొనుగోలు చేయడం, పాత వాటిని వీలైనంత వరకు మరమ్మతు చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి పీఓ ముందుకు వచ్చారు. పనిచేయని వాటిని మరమ్మతు చేయిస్తున్నాం... అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని చోట్ల తూనిక యంత్రాలు పనిచేయడంలేదు. అలాంటి చోట్ల పక్క కేంద్రాలనుంచి తూనిక యంత్రాలను తెప్పించుకుని పిల్లల బరువులను తూయిస్తున్నాం. నెలలో ఒకసారి తూయాలి కాబట్టి పొరుగు కేం«ద్రాలనుంచి యంత్రాలను తెప్పించి రిపోర్టు చేస్తున్నారు. త్వరలో అన్ని మెషిన్లు రిపేరు చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. ఐటీడీఏ సహకారంతో గిరిజన ప్రాంతంలో అన్ని కేంద్రాల్లో తూనిక యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపడుతున్నాం. – విజయగౌరి, సీడీపీఓ, పార్వతీపురం -
తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా?
వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్న వ్యాపారులు నగరంలో ఏదికొన్నా తప్పుడు తూకమే.. కిలో అంటే ఎంత..? 850 నుంచి 950 గ్రాములు లీటర్ అంటే..? 800 నుంచి 900 మిల్లీలీటర్లు. మరి క్వింటాల్ అంటే.. ? 95–96 కిలోలు.. ఇదేంటి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు అనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో అంతే!? ఉప్పులు, పప్పులు, కాయగూరల నుంచి పాలు, నూనె వరకు ఏది కొన్నా మనకు వచ్చేది ఈ లెక్కనే! ఇంటి ముందు కిరాణా షాపు నుంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల దాకా.. సాధారణ త్రాసుల నుంచి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల దాకా దేనిపై తూచినా ఇంతే! కావాలంటే మీరే చూడండి. ఇది కిలో అని చెప్పి అమ్మిన కందిపప్పు.. కానీ ఉన్నది 855 గ్రాములే! నగరంలోని పలు ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో తూకం పేరిట జరుగుతున్న దోపిడీ బయటపడింది. ఇంత జరుగుతున్నా తూనికలు కొలతల శాఖ పట్టించుకోవడం లేదు. నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్ : ఓ కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లారు.. కిలో కందిపప్పు, అరకిలో చక్కెర కొనుక్కొచ్చారు.. ఎలక్ట్రానిక్ కాంటాపై తూచి ఇవ్వడంతో అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ ఆ కందిపప్పు ఉండేది కిలో కాదు.. 850 నుంచి 950 గ్రాములే! చక్కెర కూడా 400 నుంచి 450 గ్రాములే. ఇదే కాదు లీటర్ నూనెగానీ, పాలుగానీ తీసుకుంటే వస్తున్నది 850 నుంచి 950 మిల్లీలీటర్లే.. ఇవేకాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతోంది. వ్యాపారులు సాధారణ త్రాసులతోపాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క తూకంలోనే కాదు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లోనూ మోసం జరుగుతోంది. తనిఖీ సిబ్బంది ఏరీ? గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. దాడు లు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే అధికారమున్న తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఉన్నది 22 మందే. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్ సాధారణ త్రాసులతో మోసం చేస్తారని, ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం ఉండదని జనంలో అభిప్రాయముంది. కానీ వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపర్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు సాధారణ త్రాసుల కన్నా వీటితో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉండటమే దీనికి కారణం. ఎలక్ట్రానిక్ కాంటాలు ఖాళీగా ఉన్నప్పుడు డిస్ప్లేపై సున్నా (0) బరువును చూపిస్తుంది. తర్వాత సరుకులు/వస్తువులు పెట్టి బరువు లెక్కిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ కాంటాలపై ఉండే ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్ప్లేపై కనిపించేలా చేస్తున్నారు. ఉదాహరణకు కాంటాపై 20 కిలోల సరుకు పెడితే 21.2 కిలోలు ఉన్నట్లుగా చూపుతుంది. అదే ఆప్షన్‌ను మార్చితే సక్రమంగా 20 కిలోల బరువు చూపుతుంది. జాగ్రత్తగా ఉండాలి.. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు చైతన్యం అవసరం. కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలి. మోసాలను అరికట్టేందుకు వారంలో రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. సీజన్ వారీగా కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. తూకం మోసాలపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.. – వి.శ్రీనివాస్, రీజినల్ డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ, రంగారెడ్డి తూకాల్లో మోసమే గుడిమల్కాపూర్ మార్కెట్లో కిలో కూరగాయలు కొం టే 800 గ్రాములే వస్తున్నాయి. త్రాసుతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలతోనూ మోసం చేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ పట్టించుకోని కారణంగానే ఈ దోపిడీ కొనసాగుతోంది.. – శ్రీనివాస్‌యాదవ్, ప్రైవేటు ఉద్యోగి, ఆసిఫ్‌నగర్, హైదరాబాద్ ఏది కొన్నా తక్కువ తూకమే.. ► మార్కెట్లో కిలో పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్, చేపలు వంటివి ఏవి కొన్నా 800–900 గ్రాములే ఉంటున్నాయి. కొందరు వినియోగదారులు అది గుర్తించి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. సికింద్రాబాద్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట మార్కెట్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ► ఇక మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 గ్రాములు, ఐదు లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 గ్రాముల వరకు త క్కు వగా ఉంటున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఇలాంటి వాటిని గుర్తించారు కూడా. ► పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేస్తున్న ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌లలో 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. ► రేషన్ దుకాణాల డీలర్ల చేతివాటమైతే మరీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని బాలనగర్లో ఉన్న రేషన్ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు చేసిన దాడిలో విస్తుపోయే విషయం వెల్లడైంది. అందులోని ఎలక్ట్రానిక్ కాంటాను ట్యాంపర్ చేయడంతో.. 20 కిలోల బరువును పెడితే, 21.2 కిలోల బరువు చూపుతున్నట్లు గుర్తించారు. ► నేరుగా లారీలు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనూ భారీగా మోసాలు జరుగుతున్నాయి. వ్యాపారులు వేబ్రిడ్జిల నిర్వాహకులతో కుమ్మక్కై తక్కువ తూకం వేస్తున్నారు. మోసం జరుగుతోందిలా.. ► సాధారణంగా ఎలక్ట్రానిక్ కాంటాలను సమతలంలో ఏర్పాటు చేయాలి. సమతలంగా లేకున్నా, ఓ వైపు ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉన్నా.. తప్పుడు తూకం చూపిస్తుంది. ఇది తెలియక కొందరు, మోసం చేసే ఉద్దేశంతో మరికొందరు వ్యాపారులు కాంటాలను తప్పుగా అమర్చుతున్నారు. ► ఎలక్ట్రానిక్ కాంటాలపై నేరుగా తూచలేని సరుకులు, వస్తువుల కోసం కాంటాపై ఏదైనా బుట్ట, పళ్లెం వంటిది పెట్టి దానిలో తూకం వేస్తారు. అలాంటప్పుడు కాంటాలో బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చుతారు. దీంతో ఆ బుట్ట, పళ్లెం బరువు కూడా కలసిపోయి సున్నాగా చూపిస్తుంది. అయితే తర్వాత ఇతర వస్తువులను తూచేప్పుడు ఆ బుట్ట/పళ్లెం తీసేసినా.. తిరిగి బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చడం లేదు. ► ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనిని వ్యాపారులు దుర్వినియోగం చేసి.. తప్పుడు తూకానికి పాల్పడుతున్నారు. ► ఇక సాధారణ టేబుల్ త్రాసులో తూకం రాళ్లు (బాట్లు), సరుకులు పెట్టే ప్లేట్ల కింద ఉండే సెట్టింగ్‌ను అటూ ఇటూ జరపడం ద్వారా తక్కువ తూకం వచ్చేలా చేస్తున్నారు. ► ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తున్నారు. -
అ‘కాట’కట
* రేషన్ డీలర్ల కాటాల ధ్రువీకరణకు నగదు వసూలు చేస్తున్న అధికారులు * ఆవేదన వ్యక్తం చేస్తున్న డీలర్లు తాడేపల్లి రూరల్: రేషన్ షాపు యజమానుల జేబులు ఖాళీ చేసేందుకు అధికారులు, రాజకీయ నాయకులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.16 లక్షలు తమ జేబుల్లో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏటా రేషన్‌షాపు యజమానులు ప్రభుత్వం కాటాలను తనిఖీలు చేసి ముద్రలు వేస్తారు. దీని నిమిత్తం ప్రభుత్వం కూడా లీగల్ మెట్రాలజీ డిపార్టుమెంటు నుంచి జీవో నంబర్ 767 విడుదల చేసి, ఒక్కో రేషన్ డీలర్ నుంచి రూ. 300 లు వసూలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. గుంటూరు జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా ఒక్కో రేషన్ డీలర్ వద్ద రూ. 900 వసూలు చేస్తున్నారు. ఎవరైనా జీవో గురించి ప్రశ్నిస్టే కాటాలు పరిశీలించినట్టు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక రేషన్ డీలర్లు అధికారులు అడిగిన సొమ్ము చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. దీనిపై ముద్ర వేసేందుకు వచ్చి మెట్రాలజీ అధికారులను ప్రశ్నిస్తే, మాకు తెలియదు జిల్లా కేంద్రంలో వసూలు చేయమన్నారని చెబుతున్నారు. రేషన్ డీలర్లు మాత్రం రూ. 300 మెట్రాలజీ డిపార్టుమెంటుకు, మరో రూ. 300 ముద్రలు వేసిన సిబ్బందికి వెళుతుందని, మిగిలిన రూ. 300 ఎవరు తీసుకుంటున్నారో తెలియదని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తే రేషన్ డీలర్లు తమపై దౌర్జన్యం చేస్తూ షాపులు మూయిస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే ఎంఎల్సీ పాయిట్ల నుంచి వచ్చే సరుకు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా ఈ దోపిడీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ–పాస్ యంత్రాలకు ప్రభుత్వమిచ్చిన యంత్రాలు పని చేయకపోవడంతో, తమ సొంత సిమ్‌లు వేస్తున్నామని, దీంతో రెండు వందల బిల్లు అవుతుందని వాపోతున్నారు.