ఇది కిలో అని అమ్మిన కందిపప్పు మరో షాపులోకి తీసుకెళ్లి తూకం వేస్తే రెండు విధాలుగా బరువు ఇలా..
నగరంలోని ఓ కిరాణా దుకాణంలోని ఎలక్ట్రానిక్ కాంటాపై అర కిలో బరువు తూకం రాయి (బాట్) వేసి బరువు చూడగా 640 గ్రాములు డిస్‌ప్లే అయింది. కిలో బాట్ వేస్తే 1,180 గ్రాములు డిస్‌ప్లే అయింది. రెండు కిలోలకు 2,205 గ్రాములు డిస్‌ప్లే అయింది. చేపలు, మాంసం మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది.
ఓ షాపులో కిలో కంది పప్పు కొనుగోలు చేసి మరో షాపులోని డిజిటల్ త్రాసుపై తూకం వేస్తే 1100 గ్రాముల బరువు డిస్‌ప్లే అయింది. తిరిగి ఆప్షన్ సరి చేసి తూకం వేస్తే అసలు బరువు రూ.900 గ్రాములు డిస్‌ప్లే అయింది. దీనిని బట్టి చూస్తే ప్రతి షాపులో తూకంలో దోపిడే. ఒక షాపులో 100 గ్రాములు, మరో షాపులో 200 గ్రాములుంది.
తూనికల కొలతల శాఖచే స్టాంపింగ్ చేసిన తూకం రాళ్లతో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు. మార్కెట్‌లలో ‘సాక్షి’ పరిశీలనలో తూకం దోపిడీ బయటపడింది.
సాక్షి, హైదరాబాద్: తప్పుడు తూకంతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిలువు దోపిడీకి గురై జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీధిలోని చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే వస్తోంది. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఉండేది కిలో కాదు.. 900 నుంచి 950 గ్రాములే! లీటర్ నూనె గానీ, పాలు గానీ తీసుకుంటే వస్తున్నవి 850 నుంచి 950 మిల్లీలీటర్లే. ఇవే కాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతూనే ఉంది. ఇక నేరుగా లారీ లు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనైతే భారీగా మోసాలు జరుగుతుంటాయి. వ్యాపారులు సాధారణ త్రాసులతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేయడం షరామామూలుగా మారింది.
ఎలక్ట్రానిక్ కాంటాపై 1000, 2000 గ్రాముల తూకం రాళ్ల బరువు ఇలా.. 1,180, 2,205
ఎలక్ట్రానిక్‌లోనూ ట్యాంపరింగ్..
సాధారణ తూకం రాళ్ల త్రాసులతో మోసం జరుగుతుందని అందరూ భావిస్తారు.. అనుమానం వ్యక్తం చేస్తారు. అవసరమైతే వ్యాపారులను నిలదీస్తారు.. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసు, కాంటాల రీడింగ్ డిస్‌ప్లే అవుతుంది... అంతా కళ్ల ముందే కనిపిస్తుందని కాబట్టి మోసం జరగదన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసేది. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా డిస్‌ప్లేపై ఎక్కువ బరువు కనిపించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
చేతివాటం ఇలా..
వ్యాపారులు ఎలక్ట్రానిక్, డిజిటల్ లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేస్తారు. ఉదాహరణకు.. ఆప్షన్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషన్‌పై 850 నుంచి 900 గ్రామలు బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్‌ప్లే అవుతోంది. అదే మీషన్‌పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి1150 గ్రాములు డిస్‌ప్లే అవుతుంది. అంటే ప్రతి కిలోకు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చేతివాటమే. అయిదు కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెరే . మరో ఆప్షన్‌ను నొక్కి వేస్తే మాత్రం తూకం సక్రమంగా ఉంటుంది.
బ్రాండ్ల ప్యాకింగ్‌లో సైతం
మార్కెట్‌లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 మిల్లీలీటర్లు, 5 లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 మిల్లి లీటర్ల వరకు తక్కు వగా ఉండటం సర్వసాధారణం. పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తుంటారు. కొందరు వినియోగదారులు గుర్తించి ఫిర్యాదులు చేసినా... చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నగరంలోని సికింద్రాబాద్, రాంనగర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట తదితర మార్కెట్లలో తనిఖీ చేసేందుకు సిబ్బంది కొరత ఉంది.
సమస్య వేధిస్తోంది..
నగర పరిధిలో çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపార సముదాయాలపై దాడులు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే తూనికలు, కొలతల శాఖ సిబ్బంది సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. గ్రేటర్ పరిధిలో అధికారులు, సిబ్బంది 25 మందికి మించరు. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
కళ్లెదుటే మోసగిస్తారు..
మాదన్నపేట మార్కెట్‌లో కళ్లెదుటే తూకంలో దండి కొడతారు. అడిగితే గొడవకు దిగుతారు. కిలో కూరగాయలు కొంటే 800 గ్రాములే వస్తున్నాయి.
– దశరథ లక్ష్మి, మాదన్నపేట
ఫిర్యాదు నంబర్లను ప్రదర్శించాలి
తూకంలో తేడా వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌నంబర్లను మార్కెట్లలో ప్రదర్శించాలి.
– లలిత, కుర్మగూడ ఫిర్యాదు చేయొచ్చు ఇలా..
టోల్ ఫ్రీ నంబర్ : 180042500333
వాట్సాప్ నంబర్ : 73307 74444
ఈ మెయిల్ ఐడీ: clm&ts@nic.in
Comments
Please login to add a commentAdd a comment