weightage
-
కాంట్రాక్టు ఏఎన్ఎంలకు 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఎంపికైన ఏఎన్ఎం–2 (సెకండ్ ఏఎన్ఎం)లకు తాజాగా తలపెట్టిన నియామకాల ప్రక్రియలో 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మరో 10 శాతం మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. శనివారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన ఏఎన్ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో ప్రభుత్వం 5,198 మందిని రెండో ఏఎన్ఎంగా నియమించిందన్నారు. వీరి సర్వీసును క్రమబద్దికరించేందుకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నారు. దీంతో క్రమబద్దికరణ అసాధ్యమని ప్రభుత్వం తేల్చిందని, ఈ క్రమంలో పోస్టుల లభ్యత ఆధారంగా నియామకాలు చేపడుతున్నప్పటికీ సర్వీసు ఆధారంగా గరిష్టంగా 30 శాతం మార్కులు వెయిటేజీ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్ఎం ఖాళీల భర్తీకి తొలుత మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత మరిన్ని పోస్టులు మంజూరు కావడంతో 411 పోస్టులను అదనంగా కలిపామని, దీంతో పోస్టుల సంఖ్య 1,931కి పెరిగిందని చెప్పారు. తుది నియామకం జరిగే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అయితే వాటిని కూడా కలిపి నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్దికరించడం సాధ్యం కాదని, అందుకే అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ రెండో వారంలో ఏఎన్ఎం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి ఆర్నెళ్లకు రెండు పాయింట్లు.. రాష్ట్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా 2008 నుంచి నియమితులైన వారున్నారని, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరునెలలకు 2 పాయింట్లు ఇస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండున్నర పాయింట్లు ఇస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారికి 30 శాతం వెయిటేజీ వస్తుందని, ఈ క్రమంలో తాజా నియామకాల ప్రక్రియలో వంద శాతం అవకాశాలు వీరికే వస్తాయని వెల్లడించారు. తాజాగా నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 53 సంవత్సరాలుగా ఖరారు చేశామని తెలిపారు. ఎన్హెచ్ఎం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు నెలవారీగా రూ.27,300 వేతనంగా ఇస్తున్నామన్నారు. ఏఎన్ఎంలు మొండిగా సమ్మె కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
అదానీ గ్రూపు షేర్లకు ఎంఎస్సీఐ షాక్, కానీ..!
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ కార్పొరేట్ మోసాల ఆరోపణల తరువాత అదానీ గ్రూపు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్కెట్ క్యాప్‌లో 100 బిలియన్ డాలర్ల కోల్పోయింది. తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ట్రాకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించింది. దీంతో శుక్రవారం కూడా మార్కెట్లో అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. ఇండెక్స్ ప్రొవైడర్ఎంఎస్సీఐ) నాలుగు అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ డిగ్జినేషన్లను ఫ్రీఫ్లోట్‌ను తగ్గించింది. అయితే దాని గ్లోబల్ ఇండెక్స్‌ల నుండి ఏ స్టాక్లను తొలగించలేదని తెలిపింది. జనవరి 30 నాటికి ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ ఏసీసీ ఫ్రీ ఫ్లోట్లను తగ్గించింది. నువామా ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, ఈ చర్య తీసుకున్నది. మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచిత ఫ్లోట్లు అలాగే ఉంటాయని తెలిపింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల నుండి మొత్తం 428 మిలియన్ డాలర్ల ఔట్ ఫ్లో ఉంటుందని ఎంఎస్సీఐ అంచనా వేసింది. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ 161 మిలియన్ డాలర్ల, అదానీ ట్రాన్స్మిషన్ 145 మిలియన్ డాలర్ల , అదానీ టోటల్ గ్యాస్ 110 మిలియన్ డాలర్లు, ఏసీసీ 12 మిలిన్ డాలర్లు ఉంటాయని తెలిపింది. అలాగే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, సీసీ పవర్ & ఇండస్ట్రియల్లను జోడించగా బయోకాన్‌ను తొలగించింది. తాజా మార్పులు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. షేర్ల పతనం ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 8శాతం, అదానీ టోటల్ గ్యాస్ 6.4 శాతం అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం అదానీ విల్మార్ 3 శాతం క్షీణించాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్ లాభాల్లు ఉన్నాయి. -
ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు!
నగరంలోని ఓ కిరాణా దుకాణంలోని ఎలక్ట్రానిక్ కాంటాపై అర కిలో బరువు తూకం రాయి (బాట్) వేసి బరువు చూడగా 640 గ్రాములు డిస్ప్లే అయింది. కిలో బాట్ వేస్తే 1,180 గ్రాములు డిస్ప్లే అయింది. రెండు కిలోలకు 2,205 గ్రాములు డిస్ప్లే అయింది. చేపలు, మాంసం మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. ఓ షాపులో కిలో కంది పప్పు కొనుగోలు చేసి మరో షాపులోని డిజిటల్ త్రాసుపై తూకం వేస్తే 1100 గ్రాముల బరువు డిస్ప్లే అయింది. తిరిగి ఆప్షన్ సరి చేసి తూకం వేస్తే అసలు బరువు రూ.900 గ్రాములు డిస్ప్లే అయింది. దీనిని బట్టి చూస్తే ప్రతి షాపులో తూకంలో దోపిడే. ఒక షాపులో 100 గ్రాములు, మరో షాపులో 200 గ్రాములుంది. తూనికల కొలతల శాఖచే స్టాంపింగ్ చేసిన తూకం రాళ్లతో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు. మార్కెట్లలో ‘సాక్షి’ పరిశీలనలో తూకం దోపిడీ బయటపడింది. సాక్షి, హైదరాబాద్: తప్పుడు తూకంతో వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. నిలువు దోపిడీకి గురై జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీధిలోని చిన్న కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లి ఏది కొన్నా.. తక్కువ తూకమే వస్తోంది. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసుపై తూకం వేసి ఇవ్వడంతో అంతా సవ్యంగానే ఉందనుకుంటాం. కానీ ఉండేది కిలో కాదు.. 900 నుంచి 950 గ్రాములే! లీటర్ నూనె గానీ, పాలు గానీ తీసుకుంటే వస్తున్నవి 850 నుంచి 950 మిల్లీలీటర్లే. ఇవే కాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతూనే ఉంది. ఇక నేరుగా లారీ లు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనైతే భారీగా మోసాలు జరుగుతుంటాయి. వ్యాపారులు సాధారణ త్రాసులతో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేయడం షరామామూలుగా మారింది. ఎలక్ట్రానిక్ కాంటాపై 1000, 2000 గ్రాముల తూకం రాళ్ల బరువు ఇలా.. 1,180, 2,205 ఎలక్ట్రానిక్లోనూ ట్యాంపరింగ్.. సాధారణ తూకం రాళ్ల త్రాసులతో మోసం జరుగుతుందని అందరూ భావిస్తారు.. అనుమానం వ్యక్తం చేస్తారు. అవసరమైతే వ్యాపారులను నిలదీస్తారు.. ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసు, కాంటాల రీడింగ్ డిస్ప్లే అవుతుంది... అంతా కళ్ల ముందే కనిపిస్తుందని కాబట్టి మోసం జరగదన్న నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసేది. అసలు సాధారణ త్రాసుల కన్నా ఎలక్ట్రానిక్, డిజిటల్ త్రాసులతో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా డిస్ప్లేపై ఎక్కువ బరువు కనిపించేలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చేతివాటం ఇలా.. వ్యాపారులు ఎలక్ట్రానిక్, డిజిటల్ లో ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒకదానిలో కిలోకు 100 నుంచి 150 గ్రాములు తక్కువగా సెట్టింగ్ చేస్తారు. ఉదాహరణకు.. ఆప్షన్ నొక్కి ఎలక్ట్రానిక్ మిషన్‌పై 850 నుంచి 900 గ్రామలు బరువు పెడితే 1000 గ్రాములు (కిలో) తూకం డిస్ప్లే అవుతోంది. అదే మీషన్‌పై వాస్తవంగా కిలో బరువు పెడితే 1100 నుంచి1150 గ్రాములు డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి కిలోకు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చేతివాటమే. అయిదు కిలోలు తీసుకుంటే 500 నుంచి 750 గ్రాముల వరకు కత్తెరే . మరో ఆప్షన్‌ను నొక్కి వేస్తే మాత్రం తూకం సక్రమంగా ఉంటుంది. బ్రాండ్ల ప్యాకింగ్‌లో సైతం మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 మిల్లీలీటర్లు, 5 లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 మిల్లి లీటర్ల వరకు తక్కు వగా ఉండటం సర్వసాధారణం. పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తుంటారు. కొందరు వినియోగదారులు గుర్తించి ఫిర్యాదులు చేసినా... చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నగరంలోని సికింద్రాబాద్, రాంనగర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట తదితర మార్కెట్లలో తనిఖీ చేసేందుకు సిబ్బంది కొరత ఉంది. సమస్య వేధిస్తోంది.. నగర పరిధిలో çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపార సముదాయాలపై దాడులు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే తూనికలు, కొలతల శాఖ సిబ్బంది సంఖ్య వేళ్లపై లెక్కించవచ్చు. గ్రేటర్ పరిధిలో అధికారులు, సిబ్బంది 25 మందికి మించరు. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కళ్లెదుటే మోసగిస్తారు.. మాదన్నపేట మార్కెట్లో కళ్లెదుటే తూకంలో దండి కొడతారు. అడిగితే గొడవకు దిగుతారు. కిలో కూరగాయలు కొంటే 800 గ్రాములే వస్తున్నాయి. – దశరథ లక్ష్మి, మాదన్నపేట ఫిర్యాదు నంబర్లను ప్రదర్శించాలి తూకంలో తేడా వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌నంబర్లను మార్కెట్లలో ప్రదర్శించాలి. – లలిత, కుర్మగూడ ఫిర్యాదు చేయొచ్చు ఇలా.. టోల్ ఫ్రీ నంబర్ : 180042500333 వాట్సాప్ నంబర్ : 73307 74444 ఈ మెయిల్ ఐడీ: clm&ts@nic.in -
'వైద్యశాఖ పోస్టులు త్వరలో భర్తీ'
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు రాజాం: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సుమారు 350 వైద్య పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ కేర్ ఆస్పత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యులకు పోస్టుల భర్తీలో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఎన్ఆర్హెచ్ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, త్వరలో న్యాయం చేస్తామని కామినేని తెలిపారు. ఏరియా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పనకు నిధుల సమస్య వెంటాడుతోందన్నారు. రాజాంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై పరిశీలన కోసం వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రి నెలక్పొడం గర్వకారణమని, అయితే ఈ ఆస్పత్రిలో 135 పడకలు ఉన్నాయని, 300 పడకలకు పెంచితే దరఖాస్తు పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో ఇంతవరకూ స్వైన్‌ఫ్లూతో ఐదుగురు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ దామెర రాజేంద్ర తదితరులు ఈ పరిశీలన ప్రక్రియలో భాగంగా మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు వచ్చారు.