వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్న వ్యాపారులు
నగరంలో ఏదికొన్నా తప్పుడు తూకమే..
కిలో అంటే ఎంత..?
850 నుంచి 950 గ్రాములు
లీటర్ అంటే..?
800 నుంచి 900 మిల్లీలీటర్లు.
మరి క్వింటాల్ అంటే.. ?
95–96 కిలోలు..
ఇదేంటి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు
అనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో అంతే!?
ఉప్పులు, పప్పులు, కాయగూరల నుంచి పాలు, నూనె వరకు ఏది కొన్నా మనకు వచ్చేది ఈ లెక్కనే! ఇంటి ముందు కిరాణా షాపు నుంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల దాకా.. సాధారణ త్రాసుల నుంచి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల దాకా దేనిపై తూచినా ఇంతే! కావాలంటే మీరే చూడండి. ఇది కిలో అని చెప్పి అమ్మిన కందిపప్పు.. కానీ ఉన్నది 855 గ్రాములే! నగరంలోని పలు ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో తూకం పేరిట జరుగుతున్న దోపిడీ బయటపడింది. ఇంత జరుగుతున్నా తూనికలు కొలతల శాఖ పట్టించుకోవడం లేదు. నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్ : ఓ కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లారు.. కిలో కందిపప్పు, అరకిలో చక్కెర కొనుక్కొచ్చారు.. ఎలక్ట్రానిక్ కాంటాపై తూచి ఇవ్వడంతో అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ ఆ కందిపప్పు ఉండేది కిలో కాదు.. 850 నుంచి 950 గ్రాములే! చక్కెర కూడా 400 నుంచి 450 గ్రాములే. ఇదే కాదు లీటర్ నూనెగానీ, పాలుగానీ తీసుకుంటే వస్తున్నది 850 నుంచి 950 మిల్లీలీటర్లే.. ఇవేకాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతోంది. వ్యాపారులు సాధారణ త్రాసులతోపాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క తూకంలోనే కాదు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లోనూ మోసం జరుగుతోంది.
తనిఖీ సిబ్బంది ఏరీ?
గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. దాడు లు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే అధికారమున్న తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఉన్నది 22 మందే. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్
సాధారణ త్రాసులతో మోసం చేస్తారని, ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం ఉండదని జనంలో అభిప్రాయముంది. కానీ వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపర్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు సాధారణ త్రాసుల కన్నా వీటితో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉండటమే దీనికి కారణం. ఎలక్ట్రానిక్ కాంటాలు ఖాళీగా ఉన్నప్పుడు డిస్‌ప్లేపై సున్నా (0) బరువును చూపిస్తుంది. తర్వాత సరుకులు/వస్తువులు పెట్టి బరువు లెక్కిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ కాంటాలపై ఉండే ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్‌ప్లేపై కనిపించేలా చేస్తున్నారు. ఉదాహరణకు కాంటాపై 20 కిలోల సరుకు పెడితే 21.2 కిలోలు ఉన్నట్లుగా చూపుతుంది. అదే ఆప్షన్‌ను మార్చితే సక్రమంగా 20 కిలోల బరువు చూపుతుంది.
జాగ్రత్తగా ఉండాలి..
తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు చైతన్యం అవసరం. కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలి. మోసాలను అరికట్టేందుకు వారంలో రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. సీజన్ వారీగా కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. తూకం మోసాలపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం..
– వి.శ్రీనివాస్, రీజినల్ డిప్యూటీ కంట్రోలర్,
తూనికలు కొలతల శాఖ, రంగారెడ్డి
తూకాల్లో మోసమే
గుడిమల్కాపూర్ మార్కెట్‌లో కిలో కూరగాయలు కొం టే 800 గ్రాములే వస్తున్నాయి. త్రాసుతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలతోనూ మోసం చేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ పట్టించుకోని కారణంగానే ఈ దోపిడీ కొనసాగుతోంది..
– శ్రీనివాస్‌యాదవ్, ప్రైవేటు ఉద్యోగి,
ఆసిఫ్‌నగర్, హైదరాబాద్
ఏది కొన్నా తక్కువ తూకమే..
► మార్కెట్‌లో కిలో పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్, చేపలు వంటివి ఏవి కొన్నా 800–900 గ్రాములే ఉంటున్నాయి. కొందరు వినియోగదారులు అది గుర్తించి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. సికింద్రాబాద్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట మార్కెట్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి.
► ఇక మార్కెట్‌లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 గ్రాములు, ఐదు లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 గ్రాముల వరకు త క్కు వగా ఉంటున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఇలాంటి వాటిని గుర్తించారు కూడా.
► పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేస్తున్న ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌లలో 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది.
► రేషన్ దుకాణాల డీలర్ల చేతివాటమైతే మరీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని బాలనగర్‌లో ఉన్న రేషన్ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు చేసిన దాడిలో విస్తుపోయే విషయం వెల్లడైంది. అందులోని ఎలక్ట్రానిక్ కాంటాను ట్యాంపర్ చేయడంతో.. 20 కిలోల బరువును పెడితే, 21.2 కిలోల బరువు చూపుతున్నట్లు గుర్తించారు.
► నేరుగా లారీలు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనూ భారీగా మోసాలు జరుగుతున్నాయి. వ్యాపారులు వేబ్రిడ్జిల నిర్వాహకులతో కుమ్మక్కై తక్కువ తూకం వేస్తున్నారు.
మోసం జరుగుతోందిలా..
► సాధారణంగా ఎలక్ట్రానిక్ కాంటాలను సమతలంలో ఏర్పాటు చేయాలి. సమతలంగా లేకున్నా, ఓ వైపు ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉన్నా.. తప్పుడు తూకం చూపిస్తుంది. ఇది తెలియక కొందరు, మోసం చేసే ఉద్దేశంతో మరికొందరు వ్యాపారులు కాంటాలను తప్పుగా అమర్చుతున్నారు.
► ఎలక్ట్రానిక్ కాంటాలపై నేరుగా తూచలేని సరుకులు, వస్తువుల కోసం కాంటాపై ఏదైనా బుట్ట, పళ్లెం వంటిది పెట్టి దానిలో తూకం వేస్తారు. అలాంటప్పుడు కాంటాలో బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చుతారు. దీంతో ఆ బుట్ట, పళ్లెం బరువు కూడా కలసిపోయి సున్నాగా చూపిస్తుంది. అయితే తర్వాత ఇతర వస్తువులను తూచేప్పుడు ఆ బుట్ట/పళ్లెం తీసేసినా.. తిరిగి బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చడం లేదు.
► ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనిని వ్యాపారులు దుర్వినియోగం చేసి.. తప్పుడు తూకానికి పాల్పడుతున్నారు.
► ఇక సాధారణ టేబుల్ త్రాసులో తూకం రాళ్లు (బాట్లు), సరుకులు పెట్టే ప్లేట్ల కింద ఉండే సెట్టింగ్‌ను అటూ ఇటూ జరపడం ద్వారా తక్కువ తూకం వచ్చేలా చేస్తున్నారు.
► ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment