kilos
-
తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా?
వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్న వ్యాపారులు నగరంలో ఏదికొన్నా తప్పుడు తూకమే.. కిలో అంటే ఎంత..? 850 నుంచి 950 గ్రాములు లీటర్ అంటే..? 800 నుంచి 900 మిల్లీలీటర్లు. మరి క్వింటాల్ అంటే.. ? 95–96 కిలోలు.. ఇదేంటి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు అనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో అంతే!? ఉప్పులు, పప్పులు, కాయగూరల నుంచి పాలు, నూనె వరకు ఏది కొన్నా మనకు వచ్చేది ఈ లెక్కనే! ఇంటి ముందు కిరాణా షాపు నుంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల దాకా.. సాధారణ త్రాసుల నుంచి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల దాకా దేనిపై తూచినా ఇంతే! కావాలంటే మీరే చూడండి. ఇది కిలో అని చెప్పి అమ్మిన కందిపప్పు.. కానీ ఉన్నది 855 గ్రాములే! నగరంలోని పలు ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో తూకం పేరిట జరుగుతున్న దోపిడీ బయటపడింది. ఇంత జరుగుతున్నా తూనికలు కొలతల శాఖ పట్టించుకోవడం లేదు. నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్ : ఓ కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లారు.. కిలో కందిపప్పు, అరకిలో చక్కెర కొనుక్కొచ్చారు.. ఎలక్ట్రానిక్ కాంటాపై తూచి ఇవ్వడంతో అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ ఆ కందిపప్పు ఉండేది కిలో కాదు.. 850 నుంచి 950 గ్రాములే! చక్కెర కూడా 400 నుంచి 450 గ్రాములే. ఇదే కాదు లీటర్ నూనెగానీ, పాలుగానీ తీసుకుంటే వస్తున్నది 850 నుంచి 950 మిల్లీలీటర్లే.. ఇవేకాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతోంది. వ్యాపారులు సాధారణ త్రాసులతోపాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క తూకంలోనే కాదు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లోనూ మోసం జరుగుతోంది. తనిఖీ సిబ్బంది ఏరీ? గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. దాడు లు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే అధికారమున్న తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఉన్నది 22 మందే. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్ సాధారణ త్రాసులతో మోసం చేస్తారని, ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం ఉండదని జనంలో అభిప్రాయముంది. కానీ వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపర్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు సాధారణ త్రాసుల కన్నా వీటితో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉండటమే దీనికి కారణం. ఎలక్ట్రానిక్ కాంటాలు ఖాళీగా ఉన్నప్పుడు డిస్ప్లేపై సున్నా (0) బరువును చూపిస్తుంది. తర్వాత సరుకులు/వస్తువులు పెట్టి బరువు లెక్కిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ కాంటాలపై ఉండే ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్ప్లేపై కనిపించేలా చేస్తున్నారు. ఉదాహరణకు కాంటాపై 20 కిలోల సరుకు పెడితే 21.2 కిలోలు ఉన్నట్లుగా చూపుతుంది. అదే ఆప్షన్‌ను మార్చితే సక్రమంగా 20 కిలోల బరువు చూపుతుంది. జాగ్రత్తగా ఉండాలి.. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు చైతన్యం అవసరం. కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలి. మోసాలను అరికట్టేందుకు వారంలో రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. సీజన్ వారీగా కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. తూకం మోసాలపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.. – వి.శ్రీనివాస్, రీజినల్ డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ, రంగారెడ్డి తూకాల్లో మోసమే గుడిమల్కాపూర్ మార్కెట్లో కిలో కూరగాయలు కొం టే 800 గ్రాములే వస్తున్నాయి. త్రాసుతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలతోనూ మోసం చేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ పట్టించుకోని కారణంగానే ఈ దోపిడీ కొనసాగుతోంది.. – శ్రీనివాస్‌యాదవ్, ప్రైవేటు ఉద్యోగి, ఆసిఫ్‌నగర్, హైదరాబాద్ ఏది కొన్నా తక్కువ తూకమే.. ► మార్కెట్లో కిలో పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్, చేపలు వంటివి ఏవి కొన్నా 800–900 గ్రాములే ఉంటున్నాయి. కొందరు వినియోగదారులు అది గుర్తించి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. సికింద్రాబాద్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట మార్కెట్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ► ఇక మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 గ్రాములు, ఐదు లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 గ్రాముల వరకు త క్కు వగా ఉంటున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఇలాంటి వాటిని గుర్తించారు కూడా. ► పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేస్తున్న ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌లలో 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. ► రేషన్ దుకాణాల డీలర్ల చేతివాటమైతే మరీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని బాలనగర్లో ఉన్న రేషన్ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు చేసిన దాడిలో విస్తుపోయే విషయం వెల్లడైంది. అందులోని ఎలక్ట్రానిక్ కాంటాను ట్యాంపర్ చేయడంతో.. 20 కిలోల బరువును పెడితే, 21.2 కిలోల బరువు చూపుతున్నట్లు గుర్తించారు. ► నేరుగా లారీలు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనూ భారీగా మోసాలు జరుగుతున్నాయి. వ్యాపారులు వేబ్రిడ్జిల నిర్వాహకులతో కుమ్మక్కై తక్కువ తూకం వేస్తున్నారు. మోసం జరుగుతోందిలా.. ► సాధారణంగా ఎలక్ట్రానిక్ కాంటాలను సమతలంలో ఏర్పాటు చేయాలి. సమతలంగా లేకున్నా, ఓ వైపు ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉన్నా.. తప్పుడు తూకం చూపిస్తుంది. ఇది తెలియక కొందరు, మోసం చేసే ఉద్దేశంతో మరికొందరు వ్యాపారులు కాంటాలను తప్పుగా అమర్చుతున్నారు. ► ఎలక్ట్రానిక్ కాంటాలపై నేరుగా తూచలేని సరుకులు, వస్తువుల కోసం కాంటాపై ఏదైనా బుట్ట, పళ్లెం వంటిది పెట్టి దానిలో తూకం వేస్తారు. అలాంటప్పుడు కాంటాలో బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చుతారు. దీంతో ఆ బుట్ట, పళ్లెం బరువు కూడా కలసిపోయి సున్నాగా చూపిస్తుంది. అయితే తర్వాత ఇతర వస్తువులను తూచేప్పుడు ఆ బుట్ట/పళ్లెం తీసేసినా.. తిరిగి బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చడం లేదు. ► ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనిని వ్యాపారులు దుర్వినియోగం చేసి.. తప్పుడు తూకానికి పాల్పడుతున్నారు. ► ఇక సాధారణ టేబుల్ త్రాసులో తూకం రాళ్లు (బాట్లు), సరుకులు పెట్టే ప్లేట్ల కింద ఉండే సెట్టింగ్‌ను అటూ ఇటూ జరపడం ద్వారా తక్కువ తూకం వచ్చేలా చేస్తున్నారు. ► ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తున్నారు. -
36 కిలోల గంజాయి స్వాధీనం
రెండు బైక్‌లు స్వాధీనం ఎక్సైజ్ అధికారులకు సమాచారమిచ్చిన అటవీ శాఖ అడ్డతీగల : స్థానిక అటవీ రేంజి పరిధిలోని వై.రామవరం మండలం పనసలపాలెం వద్ద శుక్రవారం తెల్లవారు జామున కలప అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు పెట్రోలింగ్‌కి వెళ్లిన అటవీ సిబ్బందికి 36 కిలోల గంజాయి పట్టుబడింది. వై.రామవరం సెక్షన్ డిప్యూటీ రేంజి అధికారి ఈశ్వరరావు నేతృత్వంలోని అటవీ సిబ్బంది పనసలపాలెం వద్దకు వెళ్లగానే రెండు మోటార్ సైకిళ్లపై బ్యాగ్‌లు ఉంచుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం వచ్చి వారిని ఆపడంతో బ్యాగ్‌లు,మోటార్‌సైకిళ్లను వదిలి ఇద్దరు పారిపోయారు. తనిఖీ చేయగా రెండు కిలోల బరువైన గంజాయి ప్యాకెట్లు 18 ఉన్నట్టు గుర్తించారు. గంజాయి పట్టుబడిన విషయాన్ని రంపచోడవరం ఎక్సైజ్ సీఐకి సమాచారమిచ్చినట్టు డీఆర్వో ఈశ్వర్రావు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు వచ్చే వరకూ వాటిని అడ్డతీగల అటవీకార్యాలయంలో భద్రపరిచారు. -
1,258 కిలోల గంజాయి స్వాధీనం
కంటైనర్‌లో తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు రాజానగరం : జాతీయ రహదారిపై భారీస్థాయిలో తరలిస్తున్న గంజాయిని రాజానగరం సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలో లభ్యమైన గంజాయి కంటే రెట్టింపు పరిమాణంలో కంటైనర్ ద్వారా రవాణా జరగడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. అందరూ శివరాత్రి సంబరాల్లో ఉండగా గంజాయి రవాణాదారులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ జిల్లా పోలీసులు రాజానగరం పోలీసుల సహకారంతో మాటువేసి సూర్యారావుపేట వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కంటైనర్‌లో వెళ్తున్న వ్యాన్‌లో ఉన్న 1,258 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.63 లక్షలు ఉంటుందని అంచనా. ఈ వాహనంలో 74 గన్నీ బ్యాగుల్లో నింపిన గంజాయితోపాటు ఇద్దరు నిందితుల నుంచి రూ.69,800 నగుదు, బుల్లెట్ వాహనం, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో.. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..నిందితులు అరెస్టు..ఇలా ప్రతికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంజాయి రవాణా మాత్రం కొంచెం కూడా ఆగడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం ఏరియా నుంచి భారీగా తరలిపోతున్న గంజాయి అప్పుడప్పుడు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఏరియాలోనే పట్టుబడుతుండడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికంటే జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ గంజాయి రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే విషయాన్ని సంబంధిత అధికారులు ఆరా తీయాల్సి ఉంది. గతంలో మాటెలావున్నా కొత్త సంవత్సరం (2017) ప్రారంభమై ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈ ప్రాంతం మీదుగా రవాణా అవుతున్న సుమారు రూ.36 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారంటే రవాణా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రవాణాలో సరికొత్త పద్ధతులు గంజాయిని రవాణా చేయడంలో నిందితులు ఏమాత్రం భయపడడం లేదనేది వాస్తవం. గతంలో కారు డిక్కీల్లోను, పాత టైర్లలోను ఎవరికీ కనిపించకుండా తరలించేందుకు ప్రయత్నించేవారు. ఇటీవల సాధారణ సరుకులు మాదిరిగానే వ్యాన్, లారీలలో ధాన్యం బస్తాల వేసుకున్నట్టుగా గంజాయిని తీసుకు పోతున్నారు. ఇప్పుడు ఏకంగా కంటైనర్లను కూడా వారు వినియోగించే వరకు వెళ్లారు. గంజాయి రవాణా జరిగే సమయంలో ముందు కొంతమంది వ్యక్తులు ఫైలెట్లుగా బైకులు, చిన్నకారుల్లో ప్రయాణించడం, వెనుక గంజాయితో కూడిన వాహనాలు వెళ్లడం.. సినీ ఫక్కీలో గంజాయి రవాణా జరుగుతోంది. చెక్ పోస్టులను కూడా దాటుకుని రవాణా అవుతుందంటే చిన్న విషయం కాదు. ఈ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో గాని, రవాణాకు సిద్ధమవుతున్న వ్యక్తుల్లోగానీ ఏమాత్రం భయం కనిపించకపోవడం విచిత్రం. ఇందుకుగల కారణాలేమిటి. వారి వెనుక ఉన్న బలం ఎవరనే విషయమై పోలీసులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
440 కిలోల గంజాయి స్వాధీనం
9 మంది అరెస్టు ∙ నాలుగు వాహనాలు, రూ. 52620 నగదు స్వాధీనం రాజానగరం : జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్లతో పాటు సుమారు రూ. 22 లక్షల విలువ చేసే 440 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి విజయవాడ, హైదరాబాద్‌లకు గంజాయిని యథేచ్ఛగా రవాణా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సూచనల మేరకు స్పెష ల్ బ్రాంచ్ డీఎస్పీ–2 రామకృష్ణ పర్యవేక్షణలో రాజానగరం సీఐ కె.వరప్రసాద్ తన సిబ్బం దితో కలసి ఈ గంజాయిని, నిందితుల సహా పట్టుకున్నారు. ఆ వివరాలను తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు గురువారం సాయంత్రం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. గైట్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేస్తున్న సమయం లో ఇది పట్టుబడిందని ఆయన వివరించారు. రవాణా తీరు – పట్టుబడిన విధానం ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి ఒక వ్యాన్‌లో 22 »బస్తాల్లో 220 ప్యాకెట్ల గంజాయిని వేసుకుని సాధారణ వాహనాల మాదిరిగా ప్రయాణమయ్యారు. వీరికి ముందుగా ఒక మారుతీ కారు, వ్యాన్‌లో కొంతమంది ఫైలట్లుగా వెళ్తూ తనిఖీలు ఉన్నదీ లేనిదీ తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తుంటారు. ముందుగా వచ్చిన కారు, వ్యాన్లను పట్టుకుని, అందులో ఉన్న వ్యక్తుల నుంచి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెనుకనే గంజాయితో వచ్చిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. నిందితులు వైద్య శివకుమార్‌రాజు (రాజమహేంద్రవరం), వాసిరెడ్డి వెంకటేశ్వర్రావు (రావులపాలెం), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ఇర్షాద్హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ ఖాళీతో, ఒడిశాకు చెందిన అమితాబ్ బిస్వ్సా, శంకర్ మజిందర్ , కిషోర్ బల్లాబ్, బజాన్ బల్లాలను అరెస్టు చేశారు. వీటికి సూత్రధారిగా ఉన్న ఒడిశాకు చెందిన నవరత్న బల్లా పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులు ప్రయాణించిన వాహనాలతోపాటు వారి నుంచి 14 సెల్ఫోన్లు, రూ.52,620 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాంతాన్ని బట్టి రేటు గంజాయి విలువ ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ఒడిశా, ఇతర ఏజెన్సీల నుంచి రవాణా అవుతున్న గంజాయిని ఎక్కువగా రాజానగరం నుంచి రాజమహేంద్రవరం మధ్యలోనే పట్టుకుంటున్నారని, ఈ ప్రాంతం దాటితో కిలో గంజాయి రూ. 15 వేలు ఉంటుందన్నారు. అదే రాజానగరంలోపు కిలో రూ. రెండు నుంచి మూడు వేలు ఉంటుందని నిందితులు తమ బాధలను పోలీసుల వద్ద వ్యక్తం చేశారు. ఇదే గంజాయి హైదరాబాద్‌కి చేరుకుంటే కిలో రూ. 50 వేలు పలుకుతుంది, విదేశాలకు వెళ్తే ఆ రేటు లక్షల్లోనే ఉంటుందన్నారు. తెలిస్తే సమాచారం ఇవ్వండి గంజాయి రవాణాను అరికట్టడంలో ప్రజలు తమకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. గంజాయి రవాణా జరిగితే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ వరప్రసాద్, ఎస్సై జగన్ మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
530 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు మోతుగూడెం: విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.26 లక్షల విలువైన 530 కిలోల గంజాయిని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మోతుగూడెం ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్ విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోతుగూడెం సమీప అటవీ ప్రాంతం మీదుగా గంజాయి తరలిస్తున్నారనే ముందుస్తు సమాచారంతో పెద్దవాగు బ్రిడ్జి వద్ద సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. విశాఖ జిల్లా దారకొండ నుంచి వస్తున్న ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. గోనె సంచుల్లో ఉన్న 530 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందన్నారు. లారీని, గంజాయిని చింతూరు తహసీల్దార్ జగన్ మోహన్‌రావు, వీఆర్వో సత్యనారాయణ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ గూడుబండి కొండలరావు, క్లీనర్ లాలం రమేశ్‌బాబును అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా దార కొండకు చెందిన లారీ ఓనర్ వెర్రి దారబాబు పరారీలో ఉన్నాడు. నిందితులను రంపచోడవరం కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు దుర్గారావు, అచ్చిబాబు, కానిస్టేబుళ్లు అప్పలరాజు, క్రిష్, కిషోర్, రమణ పాల్గొన్నారు.