36 కిలోల గంజాయి స్వాధీనం
రెండు బైక్‌లు స్వాధీనం
ఎక్సైజ్ అధికారులకు సమాచారమిచ్చిన అటవీ శాఖ
అడ్డతీగల : స్థానిక అటవీ రేంజి పరిధిలోని వై.రామవరం మండలం పనసలపాలెం వద్ద శుక్రవారం తెల్లవారు జామున కలప అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు పెట్రోలింగ్‌కి వెళ్లిన అటవీ సిబ్బందికి 36 కిలోల గంజాయి పట్టుబడింది. వై.రామవరం సెక‌్షన్ డిప్యూటీ రేంజి అధికారి ఈశ్వరరావు నేతృత్వంలోని అటవీ సిబ్బంది పనసలపాలెం వద్దకు వెళ్లగానే రెండు మోటార్ సైకిళ్లపై బ్యాగ్‌లు ఉంచుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం వచ్చి వారిని ఆపడంతో బ్యాగ్‌లు,మోటార్‌సైకిళ్లను వదిలి ఇద్దరు పారిపోయారు. తనిఖీ చేయగా రెండు కిలోల బరువైన గంజాయి ప్యాకెట్లు 18 ఉన్నట్టు గుర్తించారు. గంజాయి పట్టుబడిన విషయాన్ని రంపచోడవరం ఎక్సైజ్ సీఐకి సమాచారమిచ్చినట్టు డీఆర్వో ఈశ్వర్రావు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు వచ్చే వరకూ వాటిని అడ్డతీగల అటవీకార్యాలయంలో భద్రపరిచారు.