ganjay
-
36 కిలోల గంజాయి స్వాధీనం
రెండు బైక్‌లు స్వాధీనం ఎక్సైజ్ అధికారులకు సమాచారమిచ్చిన అటవీ శాఖ అడ్డతీగల : స్థానిక అటవీ రేంజి పరిధిలోని వై.రామవరం మండలం పనసలపాలెం వద్ద శుక్రవారం తెల్లవారు జామున కలప అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు పెట్రోలింగ్‌కి వెళ్లిన అటవీ సిబ్బందికి 36 కిలోల గంజాయి పట్టుబడింది. వై.రామవరం సెక్షన్ డిప్యూటీ రేంజి అధికారి ఈశ్వరరావు నేతృత్వంలోని అటవీ సిబ్బంది పనసలపాలెం వద్దకు వెళ్లగానే రెండు మోటార్ సైకిళ్లపై బ్యాగ్‌లు ఉంచుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం వచ్చి వారిని ఆపడంతో బ్యాగ్‌లు,మోటార్‌సైకిళ్లను వదిలి ఇద్దరు పారిపోయారు. తనిఖీ చేయగా రెండు కిలోల బరువైన గంజాయి ప్యాకెట్లు 18 ఉన్నట్టు గుర్తించారు. గంజాయి పట్టుబడిన విషయాన్ని రంపచోడవరం ఎక్సైజ్ సీఐకి సమాచారమిచ్చినట్టు డీఆర్వో ఈశ్వర్రావు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు వచ్చే వరకూ వాటిని అడ్డతీగల అటవీకార్యాలయంలో భద్రపరిచారు. -
గంజాయితో చిక్కిన ఎనిమిది మంది విద్యార్థులు
నిందితుల్లో ఒకరు నైజీరియా విద్యార్థి రాత్రి 2.30 అదుపులోకి తీసుకుని ఉదయం 7.30కి వదిలేసిన పోలీసులు కాకినాడ రూరల్: గంజాయితో చిక్కిన ఎనిమిది మంది విద్యార్థులను పోలీసులు వదిలేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్టీవో కార్యాలయం రహదారిలో కృష్ణానగర్ ఒకటో రోడ్డు బ్యాంకు కాలనీలోని జవహర్ ఎన్‌క్లేవ్‌లో అన్ని వసతులతో కూడిన ఏసీ భవనం మిర్రర్ టుడే జర్నల్ మేనేజింగ్ ఎడిటర్ జోత్స ్నకు ఉంది. ఆ ప్లాట్‌ను అద్దెకిచ్చేందుకు ఆమె ఓఎస్ఎల్లో ప్రకటన ఇచ్చారు. కాకినాడలో ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న నైజీరియా విద్యార్థి ఏప్రిల్ 12వ తేదీన రెండు నెలలకు అడ్వాన్సు ఇచ్చి, 28వ తేదీన ప్లాట్‌లో చేరాడు. మే 3వ తేదీన నైజీరియా విద్యార్థితోపాటు కొంత మంది తెలుగు విద్యార్థులు ఇక్కడకు వచ్చి అల్లరి చేస్తున్నారని తెలియడంతో ఆ ప్లాట్‌ను ఖాళీ చేయమని ఓనర్ జోత్స ్న కోరారు. ప్లాట్ ఖాళీ చేసేస్తానని నైజీరియన్ విద్యార్థి చెప్పాడు. అయితే మే 16వ తేదీ రాత్రి 12 గంటలకు ఆ ప్లాట్‌పై సర్పవరం పోలీసులు దాడి చేశారు. లోపలికి ఇద్దరు పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. అప్పుడు ఇద్దరు విద్యార్థులు పోలీసులను నెట్టుకుని పరారయ్యారు. 12 గంటలకు లోపలకి వెళ్లిన పోలీసులు రాత్రి 2 గంటల వరకూ సోదాలు చేసి ఒక నైజీరియన్ విద్యార్థి, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్‌లో ఉన్న సుమారు 15 సంచుల గంజాయితో పాటు మూడు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సంచిలో సుమారు 200 గ్రాముల గంజాయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయితో పట్టుబడిన విద్యార్థులను ప్రశ్నించకుండా మర్నాడు ఉదయం 7.30 గంటలకు పోలీసులు వదిలిపెట్టేశారు. పట్టుబడిన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలకు చెందినవారు కావడంతో ఆ కాలేజీ నిర్వాహకులు పోలీసులతో మాట్లాడి ఎటువంటి కేసు లేకుండా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పట్టుబడిన విద్యార్థుల్లో ఓ మెడికల్ విద్యార్థి, ఇద్దరు జేఎన్టీయూకే విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. దీనిపై సర్పవరం ఎస్సై తమ్మినాయుడిని వివరణ కోరగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా న్యూసెన్సు చేస్తున్నారనే సమాచారంతో తాము దాడి చేశామన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపివేశామన్నారు. సంఘటన స్థలంలో ఎటువంటి గంజాయి స్వాధీనం చేసుకోలేదని ఆయన తెలిపారు. తన ప్లాట్‌లో ఎనిమిది మంది విద్యార్థులతో పాటు సుమారు 15 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని ఇంటి ఓనర్ జ్యోత్స ్న తెలిపారు. ఈ విషయమై 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చామన్నారు. -
పది కిలోల గంజాయి స్వాధీనం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బస్టాండులో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందినవారుగా తేలింది. ప్రసన్న జుత్తురాయ్, కమలేష్ బొల్లార్లు బస్టాండులో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము ఒడిశా నుంచి భద్రాచలం, అక్కడినుంచి గోదావరిఖని వచ్చామని అన్నారు. ఇక్కడినుంచి కరీంనగర్ వెళ్లడానికి వేచి ఉన్నట్లు చెప్పారు. వారినుంచి రూ.1.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని వన్‌టౌన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
84 కేజీల గంజాయి స్వాధీనం
తమిళనాడుకు చెందిన ఐదుగురి అరెస్టు రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు బ్యాగుల్లోని సుమారు 84 కేజీల గంజాయిని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ టీఎస్ఆర్ కృష్ణ నేతృత్వంలో స్వాధీనం చేసుకున్నారు. దీనిని రైల్వే పోలీ సులకు అప్పగించారు. గురువారం ప్రధాన రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ పొందిన తమిళనాడుకు చెందిన పూజ, జ్యోతి, మురుగేష్, శేఖర్, సందీప్‌లు మొదటి ప్లాట్‌ఫాంకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ తనిఖీలు చేస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌లను పరిశీలించారు. గంజాయి ఉన్నట్టు అనుమానించడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా గంజాయిని తునిలో కొను గోలు చేసి ఢిల్లీ తీసుకు వెళుతున్నట్టు చెప్పారు. నిందితులను, గంజాయిని రైల్వే పోలీసులకు అప్పగించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆర్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ 84 కేజీల గంజాయి స్వాధీన పరుచుకున్నామని, దీని విలువ రూ.లక్ష ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
1,258 కిలోల గంజాయి స్వాధీనం
కంటైనర్‌లో తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు రాజానగరం : జాతీయ రహదారిపై భారీస్థాయిలో తరలిస్తున్న గంజాయిని రాజానగరం సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలో లభ్యమైన గంజాయి కంటే రెట్టింపు పరిమాణంలో కంటైనర్ ద్వారా రవాణా జరగడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. అందరూ శివరాత్రి సంబరాల్లో ఉండగా గంజాయి రవాణాదారులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ జిల్లా పోలీసులు రాజానగరం పోలీసుల సహకారంతో మాటువేసి సూర్యారావుపేట వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కంటైనర్‌లో వెళ్తున్న వ్యాన్‌లో ఉన్న 1,258 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.63 లక్షలు ఉంటుందని అంచనా. ఈ వాహనంలో 74 గన్నీ బ్యాగుల్లో నింపిన గంజాయితోపాటు ఇద్దరు నిందితుల నుంచి రూ.69,800 నగుదు, బుల్లెట్ వాహనం, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో.. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..నిందితులు అరెస్టు..ఇలా ప్రతికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంజాయి రవాణా మాత్రం కొంచెం కూడా ఆగడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం ఏరియా నుంచి భారీగా తరలిపోతున్న గంజాయి అప్పుడప్పుడు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఏరియాలోనే పట్టుబడుతుండడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికంటే జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ గంజాయి రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే విషయాన్ని సంబంధిత అధికారులు ఆరా తీయాల్సి ఉంది. గతంలో మాటెలావున్నా కొత్త సంవత్సరం (2017) ప్రారంభమై ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈ ప్రాంతం మీదుగా రవాణా అవుతున్న సుమారు రూ.36 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారంటే రవాణా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రవాణాలో సరికొత్త పద్ధతులు గంజాయిని రవాణా చేయడంలో నిందితులు ఏమాత్రం భయపడడం లేదనేది వాస్తవం. గతంలో కారు డిక్కీల్లోను, పాత టైర్లలోను ఎవరికీ కనిపించకుండా తరలించేందుకు ప్రయత్నించేవారు. ఇటీవల సాధారణ సరుకులు మాదిరిగానే వ్యాన్, లారీలలో ధాన్యం బస్తాల వేసుకున్నట్టుగా గంజాయిని తీసుకు పోతున్నారు. ఇప్పుడు ఏకంగా కంటైనర్లను కూడా వారు వినియోగించే వరకు వెళ్లారు. గంజాయి రవాణా జరిగే సమయంలో ముందు కొంతమంది వ్యక్తులు ఫైలెట్లుగా బైకులు, చిన్నకారుల్లో ప్రయాణించడం, వెనుక గంజాయితో కూడిన వాహనాలు వెళ్లడం.. సినీ ఫక్కీలో గంజాయి రవాణా జరుగుతోంది. చెక్ పోస్టులను కూడా దాటుకుని రవాణా అవుతుందంటే చిన్న విషయం కాదు. ఈ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో గాని, రవాణాకు సిద్ధమవుతున్న వ్యక్తుల్లోగానీ ఏమాత్రం భయం కనిపించకపోవడం విచిత్రం. ఇందుకుగల కారణాలేమిటి. వారి వెనుక ఉన్న బలం ఎవరనే విషయమై పోలీసులు నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
20 కిలోల గంజాయి స్వాధీనం
అన్నవరం : రత్నగిరిపైకి వెళుతున్న ఆటోను తనిఖీ చేస్తున్న క్రమంలో 20 కిలోల గంజాయిని టోల్గేట్ వద్ద సిబ్బంది పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ సహా వాహనంలోని నలుగురు వ్యక్తులు పరారయ్యారు. దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ ఎస్ఐ నాగరాజు శనివారం రాత్రి అన్నవరం వచ్చి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లాకు చెందిన ఆటోలో కొందరు వ్యక్తులు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రత్నగిరి టోల్గేట్ వద్దకు వచ్చారు. కొండపైకి వెళ్లడానికి టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగారు. డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఆటో వెనుక సీటులో రెండు పెద్ద బ్యాగ్‌లు ఉండడంతో అనుమానం వచ్చిన హోంగార్డు శివ వాటిని తనిఖీ చేశారు. వెంటనే ఆటోలోని వారంతా పరారయ్యారు. ఒక్కొక్క బ్యాగ్‌లో రెండు కిలోల బరువు గల ఐదు ప్యాకెట్ల వంతున పది గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి గంజాయి ప్యాకెట్లను పరిశీలించి ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగరాజు సిబ్బందితో వచ్చి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆటోలో లభించిన డ్రైవింగ్ లైసె¯Œ్స ఆధారంగా విశాఖ జిల్లా తంజంగి సమీపంలోని చింతపల్లికి చెందిన జి. చిన్నబ్బాయి ఆటోగా పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఆటోను పట్టుకున్న హోంగార్డు శివను ఈఓ , పోలీసులు అభినందించారు. -
440 కిలోల గంజాయి స్వాధీనం
9 మంది అరెస్టు ∙ నాలుగు వాహనాలు, రూ. 52620 నగదు స్వాధీనం రాజానగరం : జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్లతో పాటు సుమారు రూ. 22 లక్షల విలువ చేసే 440 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి విజయవాడ, హైదరాబాద్‌లకు గంజాయిని యథేచ్ఛగా రవాణా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సూచనల మేరకు స్పెష ల్ బ్రాంచ్ డీఎస్పీ–2 రామకృష్ణ పర్యవేక్షణలో రాజానగరం సీఐ కె.వరప్రసాద్ తన సిబ్బం దితో కలసి ఈ గంజాయిని, నిందితుల సహా పట్టుకున్నారు. ఆ వివరాలను తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు గురువారం సాయంత్రం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. గైట్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేస్తున్న సమయం లో ఇది పట్టుబడిందని ఆయన వివరించారు. రవాణా తీరు – పట్టుబడిన విధానం ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి ఒక వ్యాన్‌లో 22 »బస్తాల్లో 220 ప్యాకెట్ల గంజాయిని వేసుకుని సాధారణ వాహనాల మాదిరిగా ప్రయాణమయ్యారు. వీరికి ముందుగా ఒక మారుతీ కారు, వ్యాన్‌లో కొంతమంది ఫైలట్లుగా వెళ్తూ తనిఖీలు ఉన్నదీ లేనిదీ తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తుంటారు. ముందుగా వచ్చిన కారు, వ్యాన్లను పట్టుకుని, అందులో ఉన్న వ్యక్తుల నుంచి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెనుకనే గంజాయితో వచ్చిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. నిందితులు వైద్య శివకుమార్‌రాజు (రాజమహేంద్రవరం), వాసిరెడ్డి వెంకటేశ్వర్రావు (రావులపాలెం), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ఇర్షాద్హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ ఖాళీతో, ఒడిశాకు చెందిన అమితాబ్ బిస్వ్సా, శంకర్ మజిందర్ , కిషోర్ బల్లాబ్, బజాన్ బల్లాలను అరెస్టు చేశారు. వీటికి సూత్రధారిగా ఉన్న ఒడిశాకు చెందిన నవరత్న బల్లా పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులు ప్రయాణించిన వాహనాలతోపాటు వారి నుంచి 14 సెల్ఫోన్లు, రూ.52,620 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాంతాన్ని బట్టి రేటు గంజాయి విలువ ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ఒడిశా, ఇతర ఏజెన్సీల నుంచి రవాణా అవుతున్న గంజాయిని ఎక్కువగా రాజానగరం నుంచి రాజమహేంద్రవరం మధ్యలోనే పట్టుకుంటున్నారని, ఈ ప్రాంతం దాటితో కిలో గంజాయి రూ. 15 వేలు ఉంటుందన్నారు. అదే రాజానగరంలోపు కిలో రూ. రెండు నుంచి మూడు వేలు ఉంటుందని నిందితులు తమ బాధలను పోలీసుల వద్ద వ్యక్తం చేశారు. ఇదే గంజాయి హైదరాబాద్‌కి చేరుకుంటే కిలో రూ. 50 వేలు పలుకుతుంది, విదేశాలకు వెళ్తే ఆ రేటు లక్షల్లోనే ఉంటుందన్నారు. తెలిస్తే సమాచారం ఇవ్వండి గంజాయి రవాణాను అరికట్టడంలో ప్రజలు తమకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. గంజాయి రవాణా జరిగితే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ వరప్రసాద్, ఎస్సై జగన్ మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
530 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు మోతుగూడెం: విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.26 లక్షల విలువైన 530 కిలోల గంజాయిని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మోతుగూడెం ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్ విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోతుగూడెం సమీప అటవీ ప్రాంతం మీదుగా గంజాయి తరలిస్తున్నారనే ముందుస్తు సమాచారంతో పెద్దవాగు బ్రిడ్జి వద్ద సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. విశాఖ జిల్లా దారకొండ నుంచి వస్తున్న ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. గోనె సంచుల్లో ఉన్న 530 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందన్నారు. లారీని, గంజాయిని చింతూరు తహసీల్దార్ జగన్ మోహన్‌రావు, వీఆర్వో సత్యనారాయణ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ గూడుబండి కొండలరావు, క్లీనర్ లాలం రమేశ్‌బాబును అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా దార కొండకు చెందిన లారీ ఓనర్ వెర్రి దారబాబు పరారీలో ఉన్నాడు. నిందితులను రంపచోడవరం కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు దుర్గారావు, అచ్చిబాబు, కానిస్టేబుళ్లు అప్పలరాజు, క్రిష్, కిషోర్, రమణ పాల్గొన్నారు. -
గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
ఒడిషా, తెలంగాణ సహకారం తీసుకుంటాం ∙ ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ రాజమహేంద్రవరం క్రైం : ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సమన్వయంతో గంజాయిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం కేంద్రంగా గంజాయి రవాణా జరుగుతోందన్నారు. గంజాయి సాగు ఎక్కువగా విశాఖ జిల్లాలోని మన్యంలోను, ఒడిషా అటవీ ప్రాంతంలోను సాగవుతోందన్నారు. గంజాయి తరలింపును ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సహకారంతో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లోనూ, వ్యాపార కూడళ్లలో, షాపింగ్ మాల్స్, పెద్ద ఆపార్ట్మెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్ట వచ్చునని తెలిపారు. కేసులు సత్వర దర్యాప్తునకు చర్యలు చేపడతామన్నారు. ఎస్పీ పనితీరు భేష్ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పని తీరు బాగుందని డీఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. మహిళలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్ ఏర్పాటు చేశారని, అలాగే నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులకు పదేళ్ల జైలు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా రాజమహేంద్రవరం క్రైం : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ప్రాషిక్యూషన్ కథనం ప్రకారం నక్కపల్లి మండలానికి చెందిన పసగుడుగుల వెంకట రమణ, చింతపల్లి మండలానికి చెందిన వందలం కృష్ణ 2013 అక్టోబర్ 6 వ తేదీన నర్సీపట్నం వైపు నుంచి కె.ఇ. చిన్నాయి పాలెం వైపు 250 కేజీల గంజాయిని మహింద్ర వ్యాన్‌లో తలిస్తుండగా కోటనందూరు పోలీసులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. జడ్జి ఎ. రవీంద్రబాబు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒకొక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్షల రూపాయలు జరిమానా విధిస్తు కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. -
గంజాయి కేరాఫ్ ఏవోబీ
సరిహద్దుల్లో ఏటా రెండు పంటలు సాగు నుంచి రవాణా వరకూ గిరిజనులే రూ. కోట్లు గడిస్తున్న స్మగ్లర్లు చింతూరు: గంజాయి సాగు, రవాణాకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు చిరునామాగా మారాయి. ఆంధ్రా సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో గంజాయిని విరివిగా పండిస్తున్నారు. అమాయక ఆదివాసీలను బుట్టలో వేసుకుంటున్న స్మగ్లర్లు వారిచేత అక్రమ పంట పండిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. గంజాయిని ప్రధాన మార్గాలకు తరలించే వరకు ఆదివాసీలను వినియోగించుకుంటున్నారు. ఆ క్రమంలో పోలీసులు దాడులు నిర్వహిస్తే ఆదివాసీలే సమిధలవుతున్నారు. ప్రధాన స్మగ్లర్లు దర్జాగా తప్పించుకుంటున్నారు.కొద్దిపాటి పైకానికి ఆశపడి ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న ఆదివాసీలు పోలీసులకు పట్టుబడ్డాక జైళ్ల నుంచి బయట పడలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి సాగు ఇలా.. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలో గంజాయి విరివిగా పండిస్తున్నారు.ఇక్కడి కుర్మనూరు, నిమ్మనూరు, రాశిబేడ, గిల్లమడుగు, సన్యాసిగూడ, అల్లూరుకోట, గుర్రలూరు, దంతుగూడ, పప్పులూరు ప్రాంతాల్లో ఏటా రెండు విడతలుగా గంజాయి పండిస్తున్నారు. జూన్ నుంచి అక్టోబరు వరకు మొదటి పంట, డిసెంబరు నుంచి మే వరకు రెండో పంట పండిస్తారు. ఆంధ్రాతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఈ ప్రాంత గిరిజనులకు ప్రలోభపెట్టి, ముందుగా పెట్టుబడులు పెట్టి గంజాయి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పడు శీలావతి రకం మాత్రమే.. గతంలో ఈ ప్రాంతంలో శీలావతి, కాడ, కల్లి అనే మూడు రకాల గంజాయిని పండించేవారు. కాలక్రమంలో కాడ, కల్లి రకాలకు ధర లేకపోవడంతో ప్రస్తుతం శీలావతి రకం గంజాయిని మాత్రమే పండిస్తున్నారు. పండిన గంజాయిని మిషన్ల ద్వారా 2, 5,10 కేజీల చొప్పున ప్యాకెట్లు, బస్తాలలో నింపి ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న సీలేరు నది మధ్యలో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ వద్దకు చేరుస్తారు. అక్కడి నుంచి ఆర్డర్‌పై విశాఖ జిల్లా సీలేరు, తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిల మధ్య గల రోడ్డు వద్దకు తరలిస్తారు. అక్కడి నుంచి గంజాయిని గిరిజనుల సహాయంతో కావళ్ల ద్వారా కాలినడకన చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి, లక్కవరం జంక్షన్ల వద్దకు తరలిస్తారు. అనంతరం గంజాయిని వాహనాల ద్వారా చింతూరు, భద్రాచలం మీదుగా విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తరలిస్తుంటారు. క్షేత్రస్థాయిలో కిలో గంజాయిని రూ. 200 నుంచి రూ. 500 వరకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు దానిని స్మగ్లింగ్ మార్కెట్‌ను తరలించే సరికి కిలో రూ 5 వేల నుంచి రూ.10 వేల రేటుకు విక్రయిస్తారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉండగా ఏజెన్సీలో ఎక్కడా ఆశాఖ అధికారులు గంజాయిని పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో గంజాయిని పట్టుకోవడంలో పోలీసు శాఖ ప్రధానపాత్ర పోషిస్తోంది. గంజాయి రవాణాపై గట్టినిఘా పెట్టిన పోలీసులు తమ కొరియర్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ గుట్టు లాగి నిందితులను పట్టుకుంటున్నారు. చిక్కని స్మగ్లర్లు గంజాయిని పండిస్తున్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధి అంతా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం. దీంతో ఆ ప్రాంతంలో పోలీసుల, అధికారుల నిఘా తక్కువగా ఉండడంతో గంజాయి సాగు విరివిగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న స్మగ్లర్లు ఈప్రాంత గిరిజనులకు డబ్బు ఆశచూపి గంజాయి సాగు చేయిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లు రవాణా నిమిత్తం వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. వాహనాల్లో పలు మార్పులు చేసి పట్టుబడకుండా తప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తవుడు, ధాన్యం, కలప అడుగున గంజాయి ప్యాకెట్లు అమర్చి రవాణాకు పాల్పడడం పాత పద్ధతి. వాహనాల అడుగు భాగంలో అరలుగా తయారుచేసి అందులో గంజాయిని అమర్చడం, చిన్నపాటి వాహనాల్లో సీలింగ్‌కు అటుకులా తయారు చేసి దానిలో గంజాయి పేర్చి రవాణా చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. మరోవైపు ఇటీవల చిన్నపాటి స్మగ్లర్లు గంజాయిని చిన్న, చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి తమ నడుముకు కట్టుకుని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం
మొక్కజొన్న పొత్తుల ముసుగులో రవాణా ముందస్తు సమాచారంతో పట్టుకున్న రావులపాలెం పోలీసులు l23 గంజాయి బస్తాలు గుర్తింపు? రావులపాలెం: మొక్కజొన్న పొత్తుల ముసుగులో గంజాయిని తరలిస్తున్న ఉధంతమిది. వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రావులపాలెం మీదుగా ఒక వ్యాన్‌లో భారీగా గంజాయి తరలిపోతున్నట్టు బుధవారం తెల్లవారు జామున రావులపాలెం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి జాతీయ రహదారిపై కాపు కాశారు. రావులపాడు శివారు మల్లాయిదొడ్డి సమీపంలో మొక్కజొన్న పొత్తులతో వెళ్తున్న ఒక మినీ వ్యాన్‌ను ఆపి తనిఖీ నిర్వహించారు. మొక్కజొన్న పొత్తుల అడుగున గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండగా పోలీసుల ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వ్యాన్‌ను పోలీసులు సమీపంలో ఒక పెట్రోల్ బంకు వద్ద సీఐ పీవీ రమణ, తహసీల్దారు సీహెచ్ ఉదయభాస్కర్, ఎస్సై పీవీ త్రినాథ్ సమక్షంలో మొక్క జొన్న పొత్తులను తీసి చూడగా ఆ వ్యాన్‌లో 23 బస్తాల గంజాయిని గుర్తించారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని తెలిసింది. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు, నిందితుల వివరాలు త్వరలో తెలుపుతామని సీఐ రమణ తెలిపారు. -
స్మగ్లర్ల టెర్రర్
తప్పించుకునేందుకు స్టీరింగ్ విదిలించిన నిందితుడు కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్ మృతి ఎస్సై, కానిస్టేబుల్, నిందితుడికి తీవ్ర గాయాలు పోలీసులపై దాడి చేసి.. పరారైన నిందితులు అన్వేషించి అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ప్రత్తిపాడు : జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద బుధవారం గంజాయి, నిందితులతో వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్ దుర్మరణం పాలవ్వగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సంఘటన అనంతరం నిందితుడు దాడి చేసి ఎన్ఫోర్స్మెంట్ ఎస్సైను గాయపరచి, పరారు కావడం, అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణాపై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌కు అందిన సమాచారం మేరకు కాకినాడ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై తెలగడ నిరంజన్ తన సిబ్బందితో కిర్లంపూడి మం డలం కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారులో గంజాయి రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. కారును సోదా చేయగా, డిక్కీలో 2 కిలోల వంతున 87 ప్యాకెట్లలో సుమారు రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. కారును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెడ్‌రాక్ తహసేన జిల్లా చంపాలి గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్ కుమార్ ఆరెల, గంజాయి స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రం మధులై జిల్లాకు చెందిన సుంగుట్టవన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ పోలీసుల వాహనాన్ని టోల్గేట్ వద్ద వదిలిపెట్టారు. గంజాయితో పట్టుబడిన కారును ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న డ్రైవర్ పంపన శ్రీను నడుపుతుండగా, ముందు సీటులో కానిస్టేబుల్ ఎం.నాగేశ్వరరావు(45), నిందితుడు రాజేష్‌కుమార్, వెనుక సీటులో ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై నిరంజన్, కానిస్టేబుల్ కె.మురళీకృష్ణ, మధ్యలో స్మగ్లర్‌ను తీసుకుని స్థానిక ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్‌కు బయలుదేరారు. గ్రామ సమీపాన వచ్చేసరికి ముందు సీటులో ఉన్న నిందితుడు రాజేష్‌కుమార్ స్టీరింగ్‌ను ఇష్టానుసారం తిప్పడంతో, కారు అదుపుతప్పి పెట్రోల్ బంక్ సమీపాన ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో ముందు సీటులో ఉన్న కానిస్టేబుల్ నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీటులో మురళీకృష్ణ, ఎస్సై నిరంజన్, స్మగ్లర్ సుంగుట్టవన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్సైపై నిందితుడి దాడి సంఘటన జరిగిన వెంటనే నింది తుడు రాజేష్‌కుమార్, గాయపడిన స్మగ్లర్ కారు నుంచి దూకి పరారయ్యేం దుకు ప్రయత్నించగా, ఎస్సై అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి, నిం దితులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో నిందితులు నగ్నంగా ఉండడం పలువురి కంటపడింది. ప్రత్తిపాడు ఆస్పత్రిలో శవపంచాయితీ నిర్వహిస్తున్న పోలీసులకు.. నింది తులు పరారయ్యారనే సమాచారం అందడంతో వెంటనే వారు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలం సమీపంలోనే పొలాల్లో గాయాలతో ఉన్న సెంగుట్టవన్ను అదుపులోకి తీసుకుని, స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. మరికొద్దిసేపటికి మరో నిందితుడు రాజేష్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని, తాళ్లతో బంధించి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు ఎస్సై నిరంజన్, కానిస్టేబుల్ మురళీకృష్ణ, గంజాయి స్మగ్లర్ సెంగుట్టవన్ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారులో మరో నంబర్ ప్లేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు గంజాయితో పట్టుబడిన వాహనం ఆంధ్రరాష్ట్ర రిజిస్టేçÙన్ నంబర్ (ఏపీ16 సీఎల్ 4849)తో ఉంది. కారు అద్దంపై అడ్వకేట్ సింబల్ ఉంది. కారు లోపల తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ (టీఎన్ 69 ఏడీ 5848) ప్లేటు ఉంది. రాష్ట్రం దాటగానే నంబర్ ప్లేట్లు మార్చేందుకు స్మగ్లర్లు ఈ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కారు డ్రైవర్ రాజేష్ కుమార్‌కు ఇంగ్లిష్ కానీ, తెలుగు కానీ రాకపోవడంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు మౌనం వహించినట్టు తెలిసింది.