530 కిలోల గంజాయి స్వాధీనం
530 కిలోల గంజాయి స్వాధీనం
Published Tue, Feb 7 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
ఇద్దరి అరెస్టు
మోతుగూడెం: విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.26 లక్షల విలువైన 530 కిలోల గంజాయిని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మోతుగూడెం ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్ విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోతుగూడెం సమీప అటవీ ప్రాంతం మీదుగా గంజాయి తరలిస్తున్నారనే ముందుస్తు సమాచారంతో పెద్దవాగు బ్రిడ్జి వద్ద సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. విశాఖ జిల్లా దారకొండ నుంచి వస్తున్న ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. గోనె సంచుల్లో ఉన్న 530 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.26 లక్షలు ఉంటుందన్నారు. లారీని, గంజాయిని చింతూరు తహసీల్దార్ జగన్ మోహన్‌రావు, వీఆర్వో సత్యనారాయణ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ గూడుబండి కొండలరావు, క్లీనర్ లాలం రమేశ్‌బాబును అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా దార కొండకు చెందిన లారీ ఓనర్ వెర్రి దారబాబు పరారీలో ఉన్నాడు. నిందితులను రంపచోడవరం కోర్టుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు దుర్గారావు, అచ్చిబాబు, కానిస్టేబుళ్లు అప్పలరాజు, క్రిష్, కిషోర్, రమణ పాల్గొన్నారు.
Advertisement