440 కిలోల గంజాయి స్వాధీనం
440 కిలోల గంజాయి స్వాధీనం
Published Thu, Feb 16 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
9 మంది అరెస్టు ∙
నాలుగు వాహనాలు, రూ. 52620 నగదు స్వాధీనం
రాజానగరం : జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్లతో పాటు సుమారు రూ. 22 లక్షల విలువ చేసే 440 కిలోల గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి విజయవాడ, హైదరాబాద్‌లకు గంజాయిని యథేచ్ఛగా రవాణా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సూచనల మేరకు స్పెష ల్ బ్రాంచ్ డీఎస్పీ–2 రామకృష్ణ పర్యవేక్షణలో రాజానగరం సీఐ కె.వరప్రసాద్ తన సిబ్బం దితో కలసి ఈ గంజాయిని, నిందితుల సహా పట్టుకున్నారు. ఆ వివరాలను తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు గురువారం సాయంత్రం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. గైట్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేస్తున్న సమయం లో ఇది పట్టుబడిందని ఆయన వివరించారు.
రవాణా తీరు – పట్టుబడిన విధానం
ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి ఒక వ్యాన్‌లో 22 »బస్తాల్లో 220 ప్యాకెట్ల గంజాయిని వేసుకుని సాధారణ వాహనాల మాదిరిగా ప్రయాణమయ్యారు. వీరికి ముందుగా ఒక మారుతీ కారు, వ్యాన్‌లో కొంతమంది ఫైలట్లుగా వెళ్తూ తనిఖీలు ఉన్నదీ లేనిదీ తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తుంటారు. ముందుగా వచ్చిన కారు, వ్యాన్‌లను పట్టుకుని, అందులో ఉన్న వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెనుకనే గంజాయితో వచ్చిన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. నిందితులు వైద్య శివకుమార్‌రాజు (రాజమహేంద్రవరం), వాసిరెడ్డి వెంకటేశ్వర్రావు (రావులపాలెం), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ఇర్‌షాద్‌హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ ఖాళీతో, ఒడిశాకు చెందిన అమితాబ్ బిస్‌వ్సా, శంకర్ మజిందర్ , కిషోర్ బల్లాబ్, బజాన్ బల్లాలను అరెస్టు చేశారు. వీటికి సూత్రధారిగా ఉన్న ఒడిశాకు చెందిన నవరత్న బల్లా పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులు ప్రయాణించిన వాహనాలతోపాటు వారి నుంచి 14 సెల్‌ఫోన్లు, రూ.52,620 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రాంతాన్ని బట్టి రేటు
గంజాయి విలువ ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ఒడిశా, ఇతర ఏజెన్సీల నుంచి రవాణా అవుతున్న గంజాయిని ఎక్కువగా రాజానగరం నుంచి రాజమహేంద్రవరం మధ్యలోనే పట్టుకుంటున్నారని, ఈ ప్రాంతం దాటితో కిలో గంజాయి రూ. 15 వేలు ఉంటుందన్నారు. అదే రాజానగరంలోపు కిలో రూ. రెండు నుంచి మూడు వేలు ఉంటుందని నిందితులు తమ బాధలను పోలీసుల వద్ద వ్యక్తం చేశారు. ఇదే గంజాయి హైదరాబాద్‌కి చేరుకుంటే కిలో రూ. 50 వేలు పలుకుతుంది, విదేశాలకు వెళ్తే ఆ రేటు లక్షల్లోనే ఉంటుందన్నారు.
తెలిస్తే సమాచారం ఇవ్వండి
గంజాయి రవాణాను అరికట్టడంలో ప్రజలు తమకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. గంజాయి రవాణా జరిగితే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ వరప్రసాద్, ఎస్సై జగన్ మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement