గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
Published Fri, Dec 9 2016 11:58 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
ఒడిషా, తెలంగాణ సహకారం తీసుకుంటాం ∙
ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ
రాజమహేంద్రవరం క్రైం : ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సమన్వయంతో గంజాయిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం కేంద్రంగా గంజాయి రవాణా జరుగుతోందన్నారు. గంజాయి సాగు ఎక్కువగా విశాఖ జిల్లాలోని మన్యంలోను, ఒడిషా అటవీ ప్రాంతంలోను సాగవుతోందన్నారు. గంజాయి తరలింపును ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సహకారంతో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లోనూ, వ్యాపార కూడళ్లలో, షాపింగ్ మాల్స్, పెద్ద ఆపార్ట్‌మెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్ట వచ్చునని తెలిపారు. కేసులు సత్వర దర్యాప్తునకు చర్యలు చేపడతామన్నారు.
ఎస్పీ పనితీరు భేష్
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పని తీరు బాగుందని డీఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. మహిళలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్ ఏర్పాటు చేశారని, అలాగే నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిందితులకు పదేళ్ల జైలు
ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా
రాజమహేంద్రవరం క్రైం : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ప్రాషిక్యూషన్ కథనం ప్రకారం నక్కపల్లి మండలానికి చెందిన పసగుడుగుల వెంకట రమణ, చింతపల్లి మండలానికి చెందిన వందలం కృష్ణ 2013 అక్టోబర్ 6 వ తేదీన నర్సీపట్నం వైపు నుంచి కె.ఇ. చిన్నాయి పాలెం వైపు 250 కేజీల గంజాయిని మహింద్ర వ్యాన్‌లో తలిస్తుండగా కోటనందూరు పోలీసులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. జడ్జి ఎ. రవీంద్రబాబు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒకొక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్షల రూపాయలు జరిమానా విధిస్తు కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది.
Advertisement