అరాచక శక్తులపై ఉక్కుపాదం
సాక్షి, ఏలూరు : అరాచక శక్తుల రూపుమాపేందుకు చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ తెలిపారు. సోమవారం డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలోని పశ్చిమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీల నుంచి మూడు జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తాని చెప్పారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మావోల కదలికలపై సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏలూరు రేంజ్ పరిధిలోకి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా వచ్చిన 7 మండలాల్లో పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తామని వివరించారు. పోలీస్ సిబ్బంది ఎటువంటి సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, ఆ సమస్యనను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుం టామని డీఐజీ హామీ ఇచ్చారు. డీఐజీని మూడు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను, కేసుల పురోగతిని వివరించారు.
డీఎస్పీ నుంచి డీఐజీగా..
హరికుమార్ ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినవారు. ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన ఆయన 1984లో గ్రూప్-1కు ఎంపికై డీఎస్పీ హోదాలో పోలీస్ శాఖలో ప్రవేశించారు. గ్రేహౌండ్స్ కమాండర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట, వరంగల్ జిల్లా నర్సంపేట, అనంతపురం జిల్లా ధర్మవరంలలో డీఎస్పీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఆయనకు ఐపీఎస్ హోదా లభిం చింది. ఆ తరువాత అనంతపురం, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా పనిచేశారు. కొంతకాలం తిరుపతిలో విద్యుత్ శాఖలో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితి ద్వారా రష్యా వెళ్లి రెండేళ్లపాటు అక్కడ పనిచేశారు. అక్కడి నుంచి వచ్చాక సీబీసీఐడీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, టీటీడీ విజిలెన్స్ విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీపై వెళ్లారు. 2010లో కృష్ణాజిల్లా, 2011లో ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేశారు. 2012లో ఇంటిలిజెన్స్ డీఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్‌లో పనిచేశారు. అక్కడి నుంచి ఏలూరు రేంజ్ డీఐజీగా బదిలీపై వచ్చారు.
నిజాయితీగల అధికారిగా గుర్తింపు
హరికుమార్ నిజాయితీ గల అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన పనిచేసిన ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థలో మార్పులు చేశారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా పరిష్కరించగల పోలీస్ అధికారిగా పేరుగాంచారు. పోలీసు సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేవారని, ఆయా ప్రాంతాలలో పనిచేసి ఏలూరు రేంజ్ పదిధిలోకి వచ్చిన పోలీసు అధికారులు చెబుతున్నారు.