స్మగ్లర్ల టెర్రర్‌ | ganjay | Sakshi
Sakshi News home page

స్మగ్లర్ల టెర్రర్‌

Published Wed, Sep 14 2016 11:11 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

స్మగ్లర్ల టెర్రర్‌ - Sakshi

స్మగ్లర్ల టెర్రర్‌

  • తప్పించుకునేందుకు స్టీరింగ్‌ విదిలించిన నిందితుడు
  • కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కానిస్టేబుల్‌ మృతి
  • ఎస్సై, కానిస్టేబుల్, నిందితుడికి తీవ్ర గాయాలు
  • పోలీసులపై దాడి చేసి.. పరారైన నిందితులు
  • అన్వేషించి అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
  • ప్రత్తిపాడు :
    జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద బుధవారం గంజాయి, నిందితులతో వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం పాలవ్వగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సంఘటన అనంతరం నిందితుడు దాడి చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సైను గాయపరచి, పరారు కావడం, అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
    గంజాయి రవాణాపై ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు అందిన సమాచారం మేరకు కాకినాడ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై తెలగడ నిరంజన్‌ తన సిబ్బందితో కిర్లంపూడి మం డలం కృష్ణవరం టోల్‌గేట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారులో గంజాయి రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. కారును సోదా చేయగా, డిక్కీలో 2 కిలోల వంతున 87 ప్యాకెట్లలో సుమారు రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. కారును ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బెడ్రాక్‌ తహసేన జిల్లా చంపాలి గ్రామానికి చెందిన డ్రైవర్‌ రాజేష్‌ కుమార్‌ ఆరెల, గంజాయి స్మగ్లర్‌ తమిళనాడు రాష్ట్రం మధులై జిల్లాకు చెందిన సుంగుట్టవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసుల వాహనాన్ని టోల్‌గేట్‌ వద్ద వదిలిపెట్టారు. గంజాయితో పట్టుబడిన కారును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న డ్రైవర్‌ పంపన శ్రీను నడుపుతుండగా, ముందు సీటులో కానిస్టేబుల్‌ ఎం.నాగేశ్వరరావు(45), నిందితుడు రాజేష్‌కుమార్, వెనుక సీటులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై నిరంజన్, కానిస్టేబుల్‌ కె.మురళీకృష్ణ, మధ్యలో స్మగ్లర్‌ను తీసుకుని స్థానిక ఎక్సైజ్‌ సర్కిల్‌ స్టేషన్‌కు బయలుదేరారు. గ్రామ సమీపాన వచ్చేసరికి ముందు సీటులో ఉన్న నిందితుడు రాజేష్‌కుమార్‌ స్టీరింగ్‌ను ఇష్టానుసారం తిప్పడంతో, కారు అదుపుతప్పి పెట్రోల్‌ బంక్‌ సమీపాన ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో ముందు సీటులో ఉన్న కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీటులో మురళీకృష్ణ, ఎస్సై నిరంజన్, స్మగ్లర్‌ సుంగుట్టవన్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సైపై నిందితుడి దాడి
    సంఘటన జరిగిన వెంటనే నింది తుడు రాజేష్‌కుమార్, గాయపడిన స్మగ్లర్‌ కారు నుంచి దూకి పరారయ్యేం దుకు ప్రయత్నించగా, ఎస్సై అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి, నిం దితులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో నిందితులు నగ్నంగా ఉండడం పలువురి కంటపడింది. ప్రత్తిపాడు ఆస్పత్రిలో శవపంచాయితీ నిర్వహిస్తున్న పోలీసులకు.. నింది తులు పరారయ్యారనే సమాచారం అందడంతో వెంటనే వారు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలం సమీపంలోనే పొలాల్లో గాయాలతో ఉన్న సెంగుట్టవన్‌ను అదుపులోకి తీసుకుని, స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. మరికొద్దిసేపటికి మరో నిందితుడు రాజేష్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని, తాళ్లతో బంధించి ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.
     
    కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు
    ఎస్సై నిరంజన్, కానిస్టేబుల్‌ మురళీకృష్ణ, గంజాయి స్మగ్లర్‌ సెంగుట్టవన్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం 108లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.నాగదుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     
    కారులో మరో నంబర్‌ ప్లేట్‌ 
    ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులకు గంజాయితో పట్టుబడిన వాహనం ఆంధ్రరాష్ట్ర రిజిస్టేçÙన్‌ నంబర్‌ (ఏపీ16 సీఎల్‌ 4849)తో ఉంది. కారు అద్దంపై అడ్వకేట్‌ సింబల్‌ ఉంది. కారు లోపల తమిళనాడు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ (టీఎన్‌ 69 ఏడీ 5848) ప్లేటు ఉంది. రాష్ట్రం దాటగానే నంబర్‌ ప్లేట్లు మార్చేందుకు స్మగ్లర్లు ఈ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కారు డ్రైవర్‌ రాజేష్‌ కుమార్‌కు ఇంగ్లిష్‌ కానీ, తెలుగు కానీ రాకపోవడంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు మౌనం వహించినట్టు తెలిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement