గంజాయితో చిక్కిన ఎనిమిది మంది విద్యార్థులు
Published Thu, May 18 2017 11:31 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
నిందితుల్లో ఒకరు నైజీరియా విద్యార్థి
రాత్రి 2.30 అదుపులోకి తీసుకుని ఉదయం 7.30కి వదిలేసిన పోలీసులు
కాకినాడ రూరల్: గంజాయితో చిక్కిన ఎనిమిది మంది విద్యార్థులను పోలీసులు వదిలేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్టీవో కార్యాలయం రహదారిలో కృష్ణానగర్ ఒకటో రోడ్డు బ్యాంకు కాలనీలోని జవహర్ ఎన్‌క్లేవ్‌లో అన్ని వసతులతో కూడిన ఏసీ భవనం మిర్రర్ టుడే జర్నల్ మేనేజింగ్ ఎడిటర్ జోత్స ్నకు ఉంది. ఆ ప్లాట్‌ను అద్దెకిచ్చేందుకు ఆమె ఓఎస్‌ఎల్‌లో ప్రకటన ఇచ్చారు. కాకినాడలో ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న నైజీరియా విద్యార్థి ఏప్రిల్ 12వ తేదీన రెండు నెలలకు అడ్వాన్సు ఇచ్చి, 28వ తేదీన ప్లాట్‌లో చేరాడు. మే 3వ తేదీన నైజీరియా విద్యార్థితోపాటు కొంత మంది తెలుగు విద్యార్థులు ఇక్కడకు వచ్చి అల్లరి చేస్తున్నారని తెలియడంతో ఆ ప్లాట్‌ను ఖాళీ చేయమని ఓనర్ జోత్స ్న కోరారు. ప్లాట్ ఖాళీ చేసేస్తానని నైజీరియన్ విద్యార్థి చెప్పాడు. అయితే మే 16వ తేదీ రాత్రి 12 గంటలకు ఆ ప్లాట్‌పై సర్పవరం పోలీసులు దాడి చేశారు. లోపలికి ఇద్దరు పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. అప్పుడు ఇద్దరు విద్యార్థులు పోలీసులను నెట్టుకుని పరారయ్యారు. 12 గంటలకు లోపలకి వెళ్లిన పోలీసులు రాత్రి 2 గంటల వరకూ సోదాలు చేసి ఒక నైజీరియన్ విద్యార్థి, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్‌లో ఉన్న సుమారు 15 సంచుల గంజాయితో పాటు మూడు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సంచిలో సుమారు 200 గ్రాముల గంజాయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయితో పట్టుబడిన విద్యార్థులను ప్రశ్నించకుండా మర్నాడు ఉదయం 7.30 గంటలకు పోలీసులు వదిలిపెట్టేశారు. పట్టుబడిన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలకు చెందినవారు కావడంతో ఆ కాలేజీ నిర్వాహకులు పోలీసులతో మాట్లాడి ఎటువంటి కేసు లేకుండా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పట్టుబడిన విద్యార్థుల్లో ఓ మెడికల్ విద్యార్థి, ఇద్దరు జేఎన్‌టీయూకే విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. దీనిపై సర్పవరం ఎస్సై తమ్మినాయుడిని వివరణ కోరగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా న్యూసెన్సు చేస్తున్నారనే సమాచారంతో తాము దాడి చేశామన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపివేశామన్నారు. సంఘటన స్థలంలో ఎటువంటి గంజాయి స్వాధీనం చేసుకోలేదని ఆయన తెలిపారు. తన ప్లాట్‌లో ఎనిమిది మంది విద్యార్థులతో పాటు సుమారు 15 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని ఇంటి ఓనర్ జ్యోత్స ్న తెలిపారు. ఈ విషయమై 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చామన్నారు.
Advertisement
Advertisement