గంజాయి కేరాఫ్ ఏవోబీ
గంజాయి కేరాఫ్ ఏవోబీ
Published Mon, Nov 21 2016 10:37 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
సరిహద్దుల్లో ఏటా రెండు పంటలు
సాగు నుంచి రవాణా వరకూ గిరిజనులే
రూ. కోట్లు గడిస్తున్న స్మగ్లర్లు
చింతూరు: గంజాయి సాగు, రవాణాకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు చిరునామాగా మారాయి. ఆంధ్రా సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో గంజాయిని విరివిగా పండిస్తున్నారు. అమాయక ఆదివాసీలను బుట్టలో వేసుకుంటున్న స్మగ్లర్లు వారిచేత అక్రమ పంట పండిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. గంజాయిని ప్రధాన మార్గాలకు తరలించే వరకు ఆదివాసీలను వినియోగించుకుంటున్నారు. ఆ క్రమంలో పోలీసులు దాడులు నిర్వహిస్తే ఆదివాసీలే సమిధలవుతున్నారు. ప్రధాన స్మగ్లర్లు దర్జాగా తప్పించుకుంటున్నారు.కొద్దిపాటి పైకానికి ఆశపడి ఈ ఉచ్చులో చిక్కుకుంటున్న ఆదివాసీలు పోలీసులకు పట్టుబడ్డాక జైళ్ల నుంచి బయట పడలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
గంజాయి సాగు ఇలా..
తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలో గంజాయి విరివిగా పండిస్తున్నారు.ఇక్కడి కుర్మనూరు, నిమ్మనూరు, రాశిబేడ, గిల్లమడుగు, సన్యాసిగూడ, అల్లూరుకోట, గుర్రలూరు, దంతుగూడ, పప్పులూరు ప్రాంతాల్లో ఏటా రెండు విడతలుగా గంజాయి పండిస్తున్నారు. జూన్ నుంచి అక్టోబరు వరకు మొదటి పంట, డిసెంబరు నుంచి మే వరకు రెండో పంట పండిస్తారు. ఆంధ్రాతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఈ ప్రాంత గిరిజనులకు ప్రలోభపెట్టి, ముందుగా పెట్టుబడులు పెట్టి గంజాయి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పడు శీలావతి రకం మాత్రమే..
గతంలో ఈ ప్రాంతంలో శీలావతి, కాడ, కల్లి అనే మూడు రకాల గంజాయిని పండించేవారు. కాలక్రమంలో కాడ, కల్లి రకాలకు ధర లేకపోవడంతో ప్రస్తుతం శీలావతి రకం గంజాయిని మాత్రమే పండిస్తున్నారు. పండిన గంజాయిని మిషన్ల ద్వారా 2, 5,10 కేజీల చొప్పున ప్యాకెట్లు, బస్తాలలో నింపి ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న సీలేరు నది మధ్యలో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ వద్దకు చేరుస్తారు. అక్కడి నుంచి ఆర్డర్‌పై విశాఖ జిల్లా సీలేరు, తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిల మధ్య గల రోడ్డు వద్దకు తరలిస్తారు. అక్కడి నుంచి గంజాయిని గిరిజనుల సహాయంతో కావళ్ల ద్వారా కాలినడకన చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి, లక్కవరం జంక‌్షన్ల వద్దకు తరలిస్తారు. అనంతరం గంజాయిని వాహనాల ద్వారా చింతూరు, భద్రాచలం మీదుగా విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తరలిస్తుంటారు. క్షేత్రస్థాయిలో కిలో గంజాయిని రూ. 200 నుంచి రూ. 500 వరకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు దానిని స్మగ్లింగ్ మార్కెట్‌ను తరలించే సరికి కిలో రూ 5 వేల నుంచి రూ.10 వేల రేటుకు విక్రయిస్తారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉండగా ఏజెన్సీలో ఎక్కడా ఆశాఖ అధికారులు గంజాయిని పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో గంజాయిని పట్టుకోవడంలో పోలీసు శాఖ ప్రధానపాత్ర పోషిస్తోంది. గంజాయి రవాణాపై గట్టినిఘా పెట్టిన పోలీసులు తమ కొరియర్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ గుట్టు లాగి నిందితులను పట్టుకుంటున్నారు.
చిక్కని స్మగ్లర్లు
గంజాయిని పండిస్తున్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధి అంతా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం. దీంతో ఆ ప్రాంతంలో పోలీసుల, అధికారుల నిఘా తక్కువగా ఉండడంతో గంజాయి సాగు విరివిగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న స్మగ్లర్లు ఈప్రాంత గిరిజనులకు డబ్బు ఆశచూపి గంజాయి సాగు చేయిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లు రవాణా నిమిత్తం వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. వాహనాల్లో పలు మార్పులు చేసి పట్టుబడకుండా తప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తవుడు, ధాన్యం, కలప అడుగున గంజాయి ప్యాకెట్లు అమర్చి రవాణాకు పాల్పడడం పాత పద్ధతి. వాహనాల అడుగు భాగంలో అరలుగా తయారుచేసి అందులో గంజాయిని అమర్చడం, చిన్నపాటి వాహనాల్లో సీలింగ్‌కు అటుకులా తయారు చేసి దానిలో గంజాయి పేర్చి రవాణా చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. మరోవైపు ఇటీవల చిన్నపాటి స్మగ్లర్లు గంజాయిని చిన్న, చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి తమ నడుముకు కట్టుకుని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.
Advertisement
Advertisement