అ‘కాట’కట
అ‘కాట’కట
Published Sat, Sep 24 2016 8:42 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
* రేషన్ డీలర్ల కాటాల ధ్రువీకరణకు నగదు వసూలు చేస్తున్న అధికారులు
* ఆవేదన వ్యక్తం చేస్తున్న డీలర్లు
తాడేపల్లి రూరల్: రేషన్ షాపు యజమానుల జేబులు ఖాళీ చేసేందుకు అధికారులు, రాజకీయ నాయకులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.16 లక్షలు తమ జేబుల్లో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏటా రేషన్‌షాపు యజమానులు ప్రభుత్వం కాటాలను తనిఖీలు చేసి ముద్రలు వేస్తారు. దీని నిమిత్తం ప్రభుత్వం కూడా లీగల్ మెట్రాలజీ డిపార్టుమెంటు నుంచి జీవో నంబర్ 767 విడుదల చేసి, ఒక్కో రేషన్ డీలర్ నుంచి రూ. 300 లు వసూలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలకు పంపించింది. గుంటూరు జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా ఒక్కో రేషన్ డీలర్ వద్ద రూ. 900 వసూలు చేస్తున్నారు. ఎవరైనా జీవో గురించి ప్రశ్నిస్టే కాటాలు పరిశీలించినట్టు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక రేషన్ డీలర్లు అధికారులు అడిగిన సొమ్ము చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. దీనిపై ముద్ర వేసేందుకు వచ్చి మెట్రాలజీ అధికారులను ప్రశ్నిస్తే, మాకు తెలియదు జిల్లా కేంద్రంలో వసూలు చేయమన్నారని చెబుతున్నారు. రేషన్ డీలర్లు మాత్రం రూ. 300 మెట్రాలజీ డిపార్టుమెంటుకు, మరో రూ. 300 ముద్రలు వేసిన సిబ్బందికి వెళుతుందని, మిగిలిన రూ. 300 ఎవరు తీసుకుంటున్నారో తెలియదని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తే రేషన్ డీలర్లు తమపై దౌర్జన్యం చేస్తూ షాపులు మూయిస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే ఎంఎల్‌సీ పాయిట్ల నుంచి వచ్చే సరుకు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా ఈ దోపిడీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ–పాస్ యంత్రాలకు ప్రభుత్వమిచ్చిన యంత్రాలు పని చేయకపోవడంతో, తమ సొంత సిమ్‌లు వేస్తున్నామని, దీంతో రెండు వందల బిల్లు అవుతుందని వాపోతున్నారు.
Advertisement
Advertisement