గన్నవరం : రేషన్ డీలర్ల అవినీతిని ప్రజలు భూతద్దంలో పెట్టి చూడనవసరం లేదని డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అవినీతితో పోల్చితే డీలర్లు చేస్తున్నది పెద్ద తప్పేమీ కాదని పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ సి.ఎల్.రాయుడు రోటరీ ఆడిటోరియంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది.
ముఖ్య అతిథి వంశీమోహన్ మాట్లాడుతూ డీలర్లు అతితక్కువ కమీషన్ తీసుకుంటూ అందులోనే అధికారులకు లంచాలు, నిర్వహణ ఖర్చులు భరిస్తూ ప్రజలకు సరకులు అందజేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవస్థ ఉంటేనే పేదలకు నిత్యావసర సరకులు అందుతాయని చెప్పారు. రేషన్ డీలర్లకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. త్వరలో డీలర్లందరికీ కమీషన్ బదులు ప్రతినెలా వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.
డీలర్లు చెల్లించిన డిపాజిట్‌పై వచ్చే వడ్డీలో గ్రూప్ ఇన్సూరెన్స్‌తో పాటు హెల్త్‌కార్డులు మంజూరుకు చర్యలు తీసుకుంటోందన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు మాట్లాడుతూ రేషన్ డీలర్లను ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు నెలకు రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన డీలర్లకు సంబంధించి కారుణ్య నియామకాల్లో భాగంగా వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
డీలర్లు చనిపోతే వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పాటుపడే ప్రభుత్వానికి డీలర్లు అండగా నిలుస్తారని తెలిపారు. ఈ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు మరీదు లక్ష్మీదుర్గ, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాదర్తి విజయగణేష్, మానుకొండ శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు మల్లెల భాస్కరరావు, కోశాధికారి కస్తూరి అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాగిత కొండ, పలువురు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
డీలర్ల అవినీతిని భూతద్దంలో చూడొద్దు : వంశీ
Published Tue, Sep 23 2014 2:08 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement