![Who are the two accused? - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/25/PRANAY-12.jpg.webp?itok=ZwCiZq4K)
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఇంకా కొన్ని శేష ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ సంఘటనపై ఇంకా నివృత్తి చేసుకోవాల్సిన అనుమానాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అసలు పోలీసుల విచారణ సక్రమంగానే సాగిందా? ఈ కేసులో వదిలేసిన అంశాల సంగతేమిటన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఆ ఇద్దరు ఎక్కడ?
ప్రణయ్ హత్యకు జరిగిన ప్రణాళికను పోలీసులు వివరంగా బయట పెట్టారు. ఇంతకు ముందే ఒకటికి రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగినా, అది సఫలం కాలేదని చెప్పుకొచ్చారు. పక్కా ప్రణాళికతో ప్రణయ్, అమృతల కదలికలపై కన్నేసిన నిందితులు బ్యూటీ పార్లర్‌కు వచ్చిన అమృతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని పథకం వేసుకున్నారని, ఆమె వెంట ప్రణయ్ వస్తాడు కాబట్టి అతనిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు చెప్పిన విషయం విదితమే. బ్యూటీ పార్లర్‌కు అమృత వెంట ప్రణయ్‌తోపాటు ఆతని సోదరుడు కూడా రావడం.., ఇద్దరిలో ప్రణయ్ ఎవరో తేల్చుకోలేక నిందితులు వెనక్కి తగ్గారని, అలా ఆ రోజు ఆపరేషన్ విఫలమైందని పోలీసులు ప్రకటించారు. అయితే, అసలు బ్యూటీ పార్లర్ దగ్గర అమృతను కిడ్నాప్ చేసే పనిని మాత్రమే తనకు అప్ప జెప్పారని, హత్య కోసం వేరే ఇద్దరు యువకులను తీసుకువచ్చారని పోలీసుల విచారణలో హత్యకు పాల్పడిన బిహారీ కిల్లర్ సుభాష్ శర్మ బయట పెట్టాడని చెబుతున్నారు.
హైదరాబాద్‌నుంచి తీసుకువచ్చిన ఆ యువకులు మద్యం సేవించడంతో, వారు అనుకున్న రీతిలో పనిచేయలేరని వారిని అస్గర్ అలీ ఈ పనినుంచి తప్పించాడని పోలీసులే ప్రకటించారు. మరి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఆ యువకులు ఏమయ్యారు? వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు, బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, అస్గర్ అలీ, మహ్మద్ అబ్దుల్ బారీ, ఎండీ కరీం, తిరునగరు శ్రవణ్, సముద్రాల శివ .. ఇలా ఏడుగురిని అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం విచారణ జరిపేందుకు నిందితులను పోలీసు కస్టడీకి కోరారు. అయితే హైదరాబాద్ నుంచి ఈ ఆపరేషన్ కోసం తీసుకువచ్చిన యువకుల సంగతి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment