ఆ ఇంట్లో శబ్దాలెందుకు వస్తున్నాయి? | Why are the sounds in the house? | Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో శబ్దాలెందుకు వస్తున్నాయి?

Published Fri, May 18 2018 11:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Why are the sounds in the house? - Sakshi

వివరాలు సేకరిస్తున్న సంతకవిటి ఎస్‌ఐ

రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలం తాలాడ వద్ద ట్రేడ్‌ కార్యాలయం పెట్టి  వందలాది మంది వద్ద పెట్టుబడుల రూపంలో నగదు సేకరించి ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన ట్రేడ్‌ బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌ కేసులో కదలిక ప్రారంభమైంది. ట్రేడ్‌ బ్రోకర్‌ ఇంటి వద్ద ఏం జరుగుతోందనే విషయంపై సీఐడీ పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. స్థానిక పోలీసులు తాము సీజ్‌ చేసిన  ట్రేడ్‌ బ్రోకర్‌ కొత్త ఇంటిని, పాత గృహాలను గురువారం పరిశీలించారు.

సంతకవిటి ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవితో పాటు సిబ్బంది మందరాడ గ్రామానికి చేరుకుని ట్రేడ్‌ బ్రోకర్‌ ఇంటి పరిసర ప్రాంతాలపై ఆరా తీశారు. ఇటీవల సాక్షిలో వచ్చిన కథనంతో పాటు తమకు అందిన సమాచారం మేరకు ఇంటిని పరిశీలించడంతో పాటు ట్రేడ్‌ బ్రోకర్‌ ఆస్తులపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఇంట్లోకి ఎవరో చొరబడుతున్నట్లు తెలుస్తోందని, ఏ కారణంగా వీళ్లు వస్తున్నారనే అంశంపై ఆరా తీస్తున్నామన్నారు. ఇంటికి సంబంధించి కిటికీ తలుపులు పగలగొట్టడంతో పాటు పోలీసులు వేసిన సీజ్‌ కాగితాలు చిరిగిపోవడంపై అనుమానంగా ఉందన్నారు. ఇంట్లోకి చొరబడిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.  

సీఐడీ పోలీసుల రంగప్రవేశం

నిన్నమొన్నటి వరకూ గుంభనంగా ఉన్న ట్రేడ్‌ బ్రోకర్‌ కేసుకు సంబంధించి విశాఖ సీఐడీ పోలీసులు గురువారం సంతకవిటి, రాజాం మండలాల్లో పర్యటించారు. బ్రోకర్‌ వద్ద పనిచేసిన ఒకరిద్దరు యువకులతో పలుచోట్లకు వెళ్లారు. పలు అంశాలపై ఆరాతీసి దర్యాప్తు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సంతకవిటి ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ ట్రేడ్‌ బ్రోకర్‌ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వాటి పరిరక్షణ నిమిత్తం పరిశీలన చేశామన్నారు. సీఐడీ డీఎస్పీ భూషణనాయుడు మాట్లాడుతూ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, ఈ మేరకు పరిశీలనలు జరుగుతున్నాయని అన్నారు. 

రాజాం చుట్టుపక్కలే

ట్రేడ్‌ బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌ రాజాం చుట్టు పక్కలే ఉండి చక్కర్లు కొడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. బెయిల్‌పై ఉన్న ఆయన రాజాం పోలీస్‌ సర్కిల్‌కార్యాలయానికి కండీషన్‌ ప్రకారం రావాల్సి ఉంటుంది. దీంతో విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలతో పాటు రాజాం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడనే అనుమానాలు ఉన్నాయి. అతడి కదలికలను, పోలీస్‌స్టేషన్‌కు హాజరవుతున్న వివరాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. 

మాకు న్యాయం జరుగుతుందా..

మందరాడ వచ్చిన సంతకవిటి ఎస్‌ఐ వద్ద మందరాడతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ట్రేడ్‌బ్రోకర్‌ బాధితులు మొరపెట్టుకున్నారు. పోలీసులే న్యాయం చేయాలని వేడుకున్నారు. తామంతా నిరుపేద కుటుంబాలుకు చెందినవారమని, పెట్టుబడులు పెట్టి మోసపోయామని వివరించారు. శ్రీరామ్‌తో పాటు అతని బంధువులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళనగా ఉందని వాపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement