అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి? | Wife And Husband Suicide At Martur Prakasam District | Sakshi
Sakshi News home page

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

Published Sun, Sep 1 2019 8:56 AM | Last Updated on Sun, Sep 1 2019 9:08 AM

Wife And Husband Suicide At Martur Prakasam District - Sakshi

వారిద్దరూ ఒకే గ్రామస్తులు. ఒకే వీధిలో నివాసం ఉండేవారు.. బాల్యం నుంచి ఇరుగుపొరుగు ఇళ్లలో కలసి మెలసి పెరిగారు. ఇద్దరూ చదువులో చురుకైన వారు.. విద్యాధికులు.. ఆ పరిణతితోనే ఒకరినొకరు ఇష్టపడినప్పటికీ పెద్దల అంగీ కారంతోనే పెళ్లి చేసుకున్నారు. నవదంపతులిద్దరూ విదేశాల్లో ఉన్నత ఉద్యాగాల్లో స్థిరపడ్డారు. చీకూచింతా లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న జీవితంలో వారిని మరో శుభవార్త పలకరించింది. భార్య గర్భం దాల్చింది. పురుడు కోసం స్వదేశంలోని పుట్టింటికి వచ్చింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చూస్తూ చూస్తూనే పది నెలలు గడచి  పోయాయి. బోసినవ్వుల పసిపాపను చూసి వెళ్దామని విదేశాల్లో ఉన్న తండ్రి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. భార్యాబిడ్డలతో కొద్దిరోజులు గడిపి మొన్ననే విదేశాలకు తిరుగు పయనమయ్యాడు. ఇంతలో ఏమైందో భర్త వెళ్లిన మర్నాడే భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. లోకం తెలియని పసిబిడ్డను వదలి పరలోకాలకు పయనమైంది. ఈ వార్త తెలిసిన భర్త గుండెలు బాదుకుంటూ వెంటనే విదేశాల నుంచి తిరుగుపయనమయ్యాడు. వస్తూ వస్తూ ఏమనుకున్నాడో ఇంటికి చేరేలోపే రైలు కిందపడి ప్రాణాలొదిలాడు. రెండు రోజల వ్యవధిలోనే ఏడాది నిండని ఆడపిల్లను అనా«థను చేసి తల్లిదండ్రులిద్దరూ వెళ్లిపోయారు. కన్న తండ్రి మరణం గురించి తెలియకపోయినా స్తన్యమిచ్చే తల్లి కూడా లేక ఆకలితో అలమటిస్తూ ఆ పసికందు వెక్కివెక్కి ఏడుస్తున్న తీరు చూపరులకు కలచివేస్తోంది.. అమాయకంగా చూస్తున్న బిడ్డ కళ్లు అమ్మా.. నాన్నా.. నేను చేసిన నేరమేంటి అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి. ఈ వరుస ఘటనలు  మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో పెను విషాదం నింపాయి.


ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న దంతులు స్వల్ప వివాదాలతో ఆత్మహత్యకు పాల్పడటంతో వారి పది నెలల బిడ్డ అనాధగా మారింది. ఈ ఘటన మండలంలోని జొన్నతాళి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. బాధిత కుటుంబాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జొన్నతాళి గ్రామానికి చెందిన మెట్టల గంగయ్య(32) అదే గ్రామానికి చెందిన రమాదేవి(27) బాల్యం నుంచి ఒకే వీధిలో నివాసం ఉండేవారు. ఇద్దరూ ఎమ్మెస్సీ పూర్తి చేశారు.. యూనివర్సిటిలో ఎమ్మెస్సీ చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల ఇష్టాలతో మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సౌదీలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సంవత్సరం కిందట రమాదేవి గర్భవతి కావటంతో పురుడు కోసం స్వగ్రామం జొన్నతాళి వచ్చింది. ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆపాపకు జానకి అని పేరు నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ పాప వయసు పది నెలలు. ఈ క్రమంలో గంగయ్యకు లండన్‌లో ఉన్నత ఉద్యోగం రావడంతో సౌదీ నుంచి లండన్‌కు మారాడు.

లండన్‌లో పీహెచ్‌డీ పట్టా ఉంటే ఉపాధి అవకాశాలు మేరుగ్గా ఉంటాయని, పీహెచ్‌డీ చేయాల్సిందిగా గంగయ్య తరచూ ఫోనులో భార్యకు చెబుతూ ఉండేవాడు. వచ్చే సంవత్సరం చేస్తానని ఆమె భర్తతో చెప్పినట్లు బంధువుల సమాచారం. ఈ నెలలో స్వగ్రామం వచ్చిన గంగయ్యకు భార్యతో ఇదే విషయమై స్వల్ప వివాదం జరిగింది. గత బుధవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన గంగయ్య హైదారాబాద్‌లో గురువారం రాత్రి విమానం ఎక్కి లండన్‌ విమానం ఎక్కాడు. ఇంతలో ఏం జరిగిందో ఆ తర్వాత కొద్దిసేపటికే ఇక్కడ రమాదేవి స్వగృహంలో ఉరివేసుకొని మరణించింది. ఈ విషయాన్ని లండన్‌ వెళ్తున్న గంగయ్యకు సమాచారం ఇచ్చారు. రమాదేవి తల్లి కోటిరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి శనివారం మధ్యాహ్నం మార్టూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

అప్పటికే శోకసంద్రంలో ముగినిపోయిన ఆ కుటుంబానికి మరో గుండెలు పగిలే వార్త తెలిసింది. లండన్‌ నుంచి తిరిగి వచ్చే క్రమంలో గంగయ్య శనివారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ ఘటనతో గ్రామంలో మరింత విషాదం అలుముకుంది. అన్నెం పుణ్యం ఎరుగని వయసులో తల్లిదండ్రులను దూరం చేసుకున్న జానకిని చూసిన వారికి నోటమాట రావటం లేదు. ఈ బిడ్డ భవిష్యత్‌ ఏమిటిరా భగవంతుడా అంటూ జానకి అమ్మమ్మ కోటిరత్నం హృదయవిదారకంగా రోదించటం చూపరులను కంటతడి పెట్టిచింది. గంగయ్య మృతదేహం తీసుకురావటం కోసం బంధువులు శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ వెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement