భార్యపై అనుమానంతో...! | Wife Brutally Murdered By Husband In Visakhapatnam | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానంతో...!

Published Sat, Jul 13 2019 6:31 AM | Last Updated on Mon, Jul 15 2019 1:09 PM

Wife Brutally Murdered By Husband In Visakhapatnam - Sakshi

సాక్షి, పీఎంపాలెం/మధురవాడ(భీమిలి): పచ్చని కుటుంబంలో అనుమానం కల్లోలాన్నే సృష్టించింది. కాయకష్టంతో జీవనం సాగించే అన్యోన్యమైన సంసారంలో నిప్పులు పోసింది. చివరకు భార్య హత్యకు దారి తీసింది. ఈ ఘటనతో మధురవాడ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భార్యపై అనుమానంతో ఆమె మెడపై కాలితో తొక్కి ఓ వ్యక్తి అతికిరాతకంగా హతమార్చిన ఘటన మధురవాడ జీవీఎంసీ శివశక్తినగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ పి.సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

శివశక్తినగర్‌లో నివసిస్తున్న ఇంటి సింహాచలంతో భీమిలి మండలం తాటితూరుకు చెందిన పద్మ(29)తో సుమారు 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ధర్మతేజ(9), సంజన(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింహాచలం ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు చేదోడువాదోడుగా ఉంటుందని పద్మ మారికవలస కూడలిలో టీకొట్టు నడుపుతోంది. సాయంత్రం వేళ న్యూడిల్స్‌ షాపు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో మద్యం రక్కసి ప్రవేశించింది.

మద్యానికి బానిసైన సింహాచలం.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో అనుమానం పెనుభూతమైంది. పద్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిందన్న అనుమానం అతనికి నిద్ర పట్టనివ్వలేదు. దీంతో భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింహాచలం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. పద్మ మెడ మీద కాలు వేసి తొక్కి కిరాతకంగా చంపేశాడు. ఆమె మరణించదని నిర్ధారించుకుని తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ తెలిపారు.
 
తల్లి పరలోకానికి.. తండ్రి జైలుకు..
ఎంతో అన్యోన్యంగా జీవించిన ఆ కుటుంబంలోకి అనుమానం చొరబడి జీవితాంతం అండగా ఉంటానని మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్న భర్తే యముడై కడతేర్చాడు. దీంతో అభం శుభం ఎరుగని ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తల్లి కాటికి, తండ్రి జైలుకి వెళ్లడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement