ప్రియుడితో కలిసి.. భర్తను కడతేర్చి | Wife Killed Her Husband For Extra Marrital Affair In Kothakota | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి.. భర్తను కడతేర్చి

Published Thu, Mar 14 2019 2:49 PM | Last Updated on Thu, Mar 14 2019 2:52 PM

Wife Killed Her Husband For Extra Marrital Affair In Kothakota - Sakshi

కూతురు రోజాతో ఆంజనేయులు, సుహాసిని (ఫైల్‌)

సాక్షి, మదనాపురం (కొత్తకోట): వారిద్దరు ప్రేమించుకొని.. పెద్దలను ఎదిరించి.. ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లపాటు సంసార జీవితం సాఫీగా సాగింది.. వీరి అన్యోన్య జీవితానికి ప్రతిరూపంగా ఇద్దరు కుమారులు, ఓ కూతురు జన్మించారు.. అయితే వీరి సంతోషం ఎంతో కాలంగా నిలవలేదు.. వివాహేతర సంబంధం వారి పచ్చని సంసారాన్ని ఛిద్రం చేసింది. నూరేళ్లు నీతో ఉంటానని చేసిన బాసలు చెదిరిపోయాయి.. భర్తకు ప్రేమతో అన్నం పెట్టిన చేతులతోనే.. ప్రియుడితో కలిసి గొంతుకు ఉరితాడు బిగించిన సంఘటన మండలంలోని గోపన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన ఆంజనేయులు(31) టిప్పర్‌ డ్రైవర్‌. జీవనోపాధి నిమిత్తం 2009లో  హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడే కూలీ పనుల కోసం వచ్చిన మక్తల్‌ మండలం భగవాన్‌పల్లికి చెందిన సుహాసిని పరిచయమైంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వీరికి శివ, అఖిల్, రోజా అనే పిల్లలు ఉన్నారు. 

టిప్పర్‌ యజమానితో.. 
భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఆంజనేయులు హైదరాబాద్‌లోని చందనగర్‌లో రమేష్‌ అనే టిప్పర్‌ యజమానితో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుహాసిని టిప్పర్‌ యజమాని రమేష్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దీనిని గమనించి భర్త మద్యం తాగి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఎలాగైనా భర్తను తుదముట్టించాలన్న ఆలోచనతో సుహాసిని ప్రియుడు రమేష్‌తో కలిసి పథకం రచించింది. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఇద్దరూ కలిసి ఆంజనేయులు గొంతుకు టవల్‌తో ఉరివేసి చంపేశారు. ఈ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. మంగళవారం సాయంత్రం ప్రియుడి సహకారంతో ఓ కారులో శవాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి కల్లు తాగి కిందపడి చనిపోయాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే ఆంజనేయులు మెడ చుట్టూ గాయాలు ఉండటం.. ఆమె మాటలు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వీరికి దిక్కెవరు? 


తండ్రి చనిపోవడం.. తల్లి కటకటాల పాలు కావడంతో ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు అనాథలుగా మిగిలారు. వారి అమాయకపు చూపులు.. ప్రతిఒక్కరి చేత కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

అరగంటలోపే ఛేదించిన పోలీసులు ..
ఫిర్యాదు అందిన వెంటనే ఆత్మకూర్‌ సీఐ శంకర్, మదనాపురం ఎస్‌ఐ సైదయ్య ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చి శవాన్ని పరిశీలించారు. భార్య సుహాసిని అదుపులోకి తీసుకొని విచారించారు. భర్త రోజూ మద్యం తాగి వేధించేవాడని దీనిని తట్టుకోలేక ప్రియుడితో కలిసి చంపినట్లు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. సీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు సుహాసిని, ప్రియుడు రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement