భార్య చేతిలో మృతి చెందిన బంగారురాజు
నిత్యం భర్త పెడుతున్న వేధింపులను పంటి బిగువున భరించింది. తాగొచ్చి అనుమానంతో సతాయించినా సహించింది. చేతికి అందిన వస్తువులతో ఇష్టమొచ్చినట్టు కొట్టినా కన్నీటితో సరిపెట్టుకుంది. ఎప్పటికైనా మారకపోతాడా అని ఆశపడింది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఏళ్లు నెట్టుకొచ్చింది. అతను మారలేదు సరికదా వేధింపులు తీవ్రం చేశాడు.. గురువారం రాత్రి కూడా తాగొచ్చి కొట్టాడు... క్షణికావేశానికి లోనైన ఆమె చేతికందిన రాయితో తలపై మోదడంతో భర్త అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. ఈ ఘటన గురువారం రాత్రి గుంటూరు వెంకటరమణ కాలనీలో జరిగింది.
లక్ష్మీపురం (గుంటూరు) : భర్త వేధింపులు భరించలేక భార్య సిమెంటు రాయితో అతడి తలపై మోది హత్య చేసిన ఘటన గురువారం రాత్రి వెంకటరమణ కాలనీలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి బంగారురాజు (50), విజయలక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. బంగారురాజు గుంటూరు నగరంలోని వెంకటరమణ కాలనీ 2వ లైనులో నూతనంగా నిర్మిస్తున్న అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు.
ఇటీవల ఓ కుమార్తెకు వివాహం చేశాడు. కొడుకు మాచర్లలో బేల్దారు పనులకు వెళుతూ వారంలో ఒకరోజు వచ్చి వెళుతుంటాడు. భార్య విజయలక్ష్మి స్థానికంగా ఉన్న ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త బంగారురాజు నిత్యం మద్యం తాగి ఆమెను అనుమానిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి భార్యను తీవ్రంగా కొట్టి దుర్భాషలాడాడు. భర్త వేధింపులు భరించలేక విజయలక్ష్మి సిమెంటు రాయితో అతడి తలపై కొట్టింది. దీంతో బంగారురాజు అక్కడిక్కడే మృతి చెందాడు. విజయలక్ష్మి కుమారుడు నాగరాజుకు సమాచారం ఇచ్చింది. అతడు ఇంటికి చేరుకుని నగరంపాలెం పోలీసులకు సమాచారం తెలిపాడు. సీఐ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. బంగారురాజు మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment