
బుచ్చెయ్యపేట (చోడవరం): మండలంలోని చిట్టియ్యపాలెం గ్రామానికి చెందిన అర్రెపు నాగేష్(40) భార్య చేతిలోనే హత్యకు గురయ్యాడు. తాగొచ్చి తనపై గునపాంతో దాడి చేయగా, తప్పించుకుని అదే గునపంతో తలపై కొట్టడంతో చనిపోయాడంటూ భార్య పారపల్లి మాణిక్యం పోలీసులు ఎదుట ఒప్పుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిట్టియ్యపాలేనికి చెందిన నాగేష్‌తో రాజాం గ్రామానికి చెందిన పారపల్లి మాణిక్యంకు పదిహేనేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచీ రోజూ భర్త తాగొచ్చి వేధించడమే కాక అక్రమ సంబంధాలు అట్టకట్టేవాడని, కష్టపడి సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చుపెట్టగా ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేసేవాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ నేపథ్యంలో కూలి పనుల కోసం మద్రాసు వెళ్లిన నాగేష్ దీపావళి, చవితి పండగ కోసం ఇటీవలే చిట్టియ్యపాలెం వచ్చాడు. శనివారం రాత్రి వరకు అత్తారిల్లు రాజాంలో ఉన్నాడు. ఆ రాత్రి తాగొచ్చిన నాగేష్‌ను కూలి డబ్బులు ఇవ్వాలని భార్య మాణిక్యం అడగడంతో గొడవకు దిగాడు. తీరా ఆదివారం ఉదయానికి చిట్టియ్యపాలెంలో తన ఇంటి ముందు శవమై కనిపించాడు.
స్థానికుల ఫిర్యాదుతో...
నాగేష్ మృతదేహానికి ఉదయమే భార్య దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమవ్వగా స్థానికులు నాగేష్ ఒంటిపై గాయాలుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అనకాపల్లి డీఎస్పీ కె.వి. రమణ, చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు, బుచ్చెయ్యపేట ఎస్‌ఐ బి, కృష్ణారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి మాణిక్యాన్ని నిలదీశారు. దీంతో జరిగిన సంఘటనను వివరించింది. శనివారం రాత్రి కూలి డబ్బులు ఇవ్వాలని తన భర్త నాగేష్‌ను అడగగా తాగొచ్చి గొడవకు దిగడమే కాక గునపంతో తనపై దాడి చేస్తుండగా తప్పించుకుని, కోపంలో అదే గునపంతో తన భర్త తలపై కొట్టగా మృతి చెందాడని చెప్పింది.
తర్వాత అర్ధరాత్రి వేళ భర్త శవాన్ని చిట్టియ్యపాలెం తరలించినట్లు, తన తల్లి పారపల్లి ముసలమ్మ సహకరించినట్లు చెప్పింది. కాగా, మాణిక్యం, నాగేష్ దంపతులకు 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల కుమార్తె ఉంది. మృతుడు నాగేష్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో అతని చిన్నాన్న సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహానికి శవ పం చనామా జరిపించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మాణిక్యంతోపాటు, ఆమె తల్లి ముసలమ్మలను అదుపులోకి తీసికొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment