యలహంక: ఏడాది వయస్సున్న పిల్లాడి కిడ్నాప్ కేసును కొత్తునూరు పోలీసులు చేధించారు. వివరాలు.. భారతినగరలో నివాసముంటున్న శహనాజ్ ఖానమ్ భర్త చనిపోవడంతో గౌరిపాళ్యకు చెందిన ఫైరోజ్‌ఖాన్‌ను రెండేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే సాగిన వీరి సంసారంలో ఒడదొడుకులు ఎదురయ్యాయి. భర్త సరిగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో భర్త నుంచి డబ్బు రాబట్టడం కోసం శహనాజ్ ఖానమ్ కొత్త ఎత్తుగడ వేసింది. దీని ప్రకారం ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసుకురావాలని తనకు తెలిసిన మహమద్ నూరుల్లా, ఇసాక్ ఖాన్, అబ్దుల్ వాహీద్‌లను పురమాయించింది. ఆ పిల్లాడు తమకే జన్మించాడని చెప్తే భర్త ఫైరోజ్‌నాన్ మనసు మారి ఇంటికి సక్రమంగా వస్తాడు.. లేదా తనతో పాటు పిల్లాడి పోషణకు ఎక్కువ డబ్బు ఇప్పించుకోవచ్చనేది శహనాజ్ ఖానమ్ పథకం. దీని ప్రకారం మహమద్ నూరుల్లా, ఇసాక్ ఖాన్, అబ్దుల్ వాహీద్‌లు ఈనెల 5న కొత్తునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెగడేనగర ఎక్స్ సర్వీస్ లేఔట్‌లో గుడిసెలో నివాసముంటున్న దొడ్డభీమయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు ఏడాది వయస్సున్న అభిరామ్‌ను ఎత్తుకొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.
దీనిపై బాధిత తల్లిదండ్రులు కొత్తునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు పిల్లాడిని ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీల ఆధారంగా శహనాజ్ ఖనామ్, ఇసాక్ ఖాన్, అబ్దుల్ వహీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరో నిందితుడైన నూరుల్లా శుక్రవారం వేకువజామున మిట్టెగెనహళ్లి సమీపంలోని ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి వెళ్లగా నూరుల్లా తన దగ్గర ఉన్న చాకుతో ఇన్‌స్పెక్టర్ హరియప్పను గాయపరిచారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నూరుల్లా కాలుపై కాల్పులు జరిపారు. గాయపడిన ఎస్సై హరియప్ప, నిందితుడు నూరుల్లాను స్థానిక అంబేడ్కర్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్ గురైన చిన్నారి అభిరామ్‌ను పోలీసులు తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు.
కిడ్నాప్ కథ సుఖాంతం
Published Sat, Oct 14 2017 2:09 AM | Last Updated on Sat, Oct 14 2017 3:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment