ఎంఆర్‌పీఎస్ నాయకులు, బంధువులతో కలిసి భర్త ఇంటిముందు నిరసన తెలుపుతున్న రాధమ్మ
కాశీబుగ్గ: తనకు న్యాయం చేయాలని భర్త ఇంటిముందు ఓ భార్య దీక్ష చేసింది. పెళ్లైన పదేళ్ల తర్వాత తనను దూరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టింది. బాబు పుట్టి చనిపోయిన తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. దళితురాలివని, అదనపు కట్నం తేవాలని ఇంటి నుంచి నెట్టేయడంతో పెద్దమనుషులతో కలిసి పోరు బాట సాగిస్తోంది. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ పట్టణంలో సంచలనమయింది. దీనికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. కాశీబుగ్గలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వెనుక భాగంలో ఉంటున్న కింతలి యోగేశ్వరరావు(శ్రీను)కు రాధమ్మకు వివాహం(రిజిష్టర్ మ్యారేజ్) జరిగింది. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
పదేళ్లు కాపురం అనంతరం యోగేశ్వరరావు తనను పట్టించుకోవడంలేదని భార్య కింతల రాధమ్మ భర్త ఇంటి ముందు దీక్ష చేసింది. తల్లిదండ్రులు, బంధువులు, పెద్దమనుషులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిసింది. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ కులాలకు అతీతంగా ప్రేమించానని, రిజిష్టర్ మ్యారేజ్ ద్వారా ఒక్కటైయ్యామన్నారు. తల్లి, అన్నయ్య మాటలు విని భర్త యోగేశ్వరరావు నన్ను ఇంటినుంచి బయటకు గెంటివేశాడని వాపోయింది. అద్దె ఇల్లు తీయించి, అద్దెలు కాని భత్యం కాని వేయడంలేదని కంటతడి పెట్టింది. మా ఇద్దరి కాపురంలో బాబు పుట్టి చనిపోయాడని, అప్పటినుంచి నన్ను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది.
అదనపు కట్నం తీసుకురావాలని ఇంటినుంచి నెట్టేశారని వాపోయింది. నన్ను విడిచి వేరే మహిళతో యోగేశ్వరరావు ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు, పెద్ద మనుషులతో కలిసి ఇంటికి వస్తే, దళితురాలివని పేరు పెట్టి నన్ను వెళ్లగొట్టారని, దీంతో చేసేది లేక తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తన భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతున్నట్టు వాపోయింది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాశీబుగ్గ ఎస్‌ఐ ప్రసాదరావు సంఘటన స్థలానికి వచ్చి బాధితురాలిని సముదాయించి, న్యాయం చేస్తామని తెలిపారు. రాధమ్మకు సంఘీభావంగా ఎంఆర్‌పీఎస్ జిల్లా, రాష్ట్ర నాయకులు రానా శ్రీనివాస్‌మాదిగ, దాసరి తిరుమల మాదిగ, సంబాన రామారావు, పొట్నూరు భాస్కరరావు మాదిగ, మీల జోగారావు మాదిగ, ఉర్నాన అప్పలరాజు, కుమరాన భారతి మాదిగ, చెరుకుపల్లి నరసింహాలు తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment