
నాగలక్ష్మి (ఫైల్)
కృష్ణలంక(విజయవాడ తూర్పు): అనుమానాస్పదంగా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణలంక బాలాజీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీసీఎస్ కానిస్టేబుల్‌గా గల్లా నాగమణి(28) పనిచేస్తోంది. భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు వర్షిత్(5), దీపేష్(2)లతో పాటు ఆమె తల్లిదండ్రులతో కలసి కృష్ణలంక బాలాజీనగర్‌లోని మొదటిలైన్‌లో నివాసముంటోంది. ఆదివారం రాత్రి డ్యూటికి వెళ్లిన నాగమణిని మరుసటిరోజు ఉదయం భర్త నాగరాజు ఆమెను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం వారి పెద్ద కొడుకును స్కూల్‌లో దించి వచ్చేందుకు వెళ్లాడు. ఇటీవల ఆమె తల్లిదండ్రులు కూడా కొన్ని పనుల నిమిత్తం వారి సొంత ఊరు అవనిగడ్డకు చిన్నకొడుకును తీసుకుని వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరు.
ఆ సమయంలో సుమారు 8.30 గంటలకు ఆమె బెడ్‌రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ చంద్రశేఖరరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు ఆరా తీశారు. అయితే భర్త నాగరాజు ఇటీవల లారీలు కొనుగోలు చేయడంతో వ్యాపారంలో నష్టం వాటిల్లిందని, దీనిపై భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవలు జరుగుతున్నాయని, సున్నిత మనస్తత్వంగల నాగమణి దీని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేన్నారు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment