వివరాలు సేకరిస్తున్న పోలీసులు లక్ష్మి (ఫైల్)
పరిగి: సంతానం కోసం ఆమె ఆర్‌ఎంపీ ఇచ్చిన మందులు వినియోగించింది. అనంతరం పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో ప్రాణమే పోయింది. ఈ ఘటన పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సమ్మ కూతురు లక్ష్మి(24)ను అదే గ్రామానికి చెందిన రాంచంద్రయ్యకు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. దంపతులకు సంతానం కలగలేదు. దీంతో 15 రోజుల క్రితం వీరు పరిగిలోని ఓ ఆర్‌ఎంపీని ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన మందులు వాడారు. మందులు వికటించడంతో లక్ష్మికి వాంతులు, విరేచనాలు అయ్యాయి.
వారం రోజుల క్రితం ఆమెను కుటుంబీకులు పరిగిలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రిలో చూపించారు. పరిస్థితి విషమించడంతో మూడు రోజులు క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున లక్ష్మి మృతి చెందింది. రాంచంద్రయ్య సంతానం కోసం ఏవేవో మందులు వినియోగించడంతోనే తన కూతురు మృతిచెందిందని మృతురాలి తల్లి నర్సమ్మ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిగికి చెందిన ఆర్‌ఎంపీ ఇచ్చిన మందులు వినియోగించిన తర్వాత పరిస్థితి విషమించి తన భార్య చనిపోయిందని రాంచంద్రయ్య తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment