
లక్నో : పెళ్లి వేడుకలో నృత్యం చేయడం ఆపివేసిందనే ఆగ్రహంతో దుండుగుడు ఓ యువతి ముఖంపై కాల్పులు జరపడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో డిసెంబర్ 1న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరో యువతితో కలిసి డాన్స్ చేస్తున్న యువతి నృత్యాన్ని నిలిపివేయడంతో అక్కడి ఉన్న వారిలో నుంచి ఓ వ్యక్తి నృత్యం ఆపితే కాల్చివేస్తానని హెచ్చరించడం కనిపించింది. మరో వ్యక్తి ఆమెపై కాల్పులు జరపాలని అన్నంతలోనే యువతి ముఖంపైకి బుల్లెట్ దూసుకువచ్చింది. బుల్లెట్ ఆమె దవడలోకి దూసుకుపోయిందని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్ద సుధీర్ సింగ్ పటేల్ కుమార్తె పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన సమయంలో వేదికపై ఉన్న పెళ్లి కూతురు మామలు మిథిలేష్, అఖిలేష్‌లకు కూడా గాయాలయ్యాయి. గ్రామ పెద్ద కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. పెళ్లి కూతురు బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment