
అహ్మదాబాద్ : అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్నారనే అభియోగంపై ఓ మహిళా ఎస్‌ఐను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు కాకుండా చేసేందుకు లంచం డిమాండ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ పని చేసే ఇద్దరు మహిళలు తమపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు.
కేసు విచారణ ప్రారంభించిన శ్వేత.. నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్‌ను హెచ్చరించారు. భావేష్ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరో 15లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ నుంచి ఒత్తిడి రావడంతో సిటీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు రాగా, విచారణ చేసి శుక్రవారం శ్వేతను అరెస్ట్ చేశారు. రూ.20లక్షల లంచం తీసుకుని, మరో 15లక్షలు డిమాండ్ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. శనివారం ఆమెను సెషన్స్ కోర్టు హాజరు పర్చగా, కోర్టు 3 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ మొత్తం కేసు దర్యాప్తును స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏసీపీ బీసీ సోలంకికి అప్పగించినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment