పెద్దవాగు వద్ద పరిశీలిస్తున్న పోలీసులు శిల్ప (ఫైల్)
ఖిల్లాఘనపురం (వనపర్తి): వాగులో స్నానానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని మల్కిమియాన్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన శిల్ప (28) (సిరాతిబేగం, కల్పన) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం తోడికోడళ్లు, పల్లవి, బావ వెంకట్‌రెడ్డి, కుటుంబ సభ్యులు మమత, తేజస్విని, ఆంజనేయులు, యాదమ్మతో కలిసి పొలం దగ్గరకు వెళ్లింది. అయితే పొలానికి సమీపంలో పెద్ద వాగు పారుతుండగా అందరూ కలిసి అక్కడే స్నానం చేశారు. ఈ సమయంలో శిల్ప ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి గుంతలోకి జారిపోయింది.
గమనించిన పల్లవి, మమత ఆమెను రక్షించే ప్రయత్నంలో అందరూ వాగులో పడిపోయారు. సమీపంలో ఉన్న శ్రీనివాసరెడ్డి, వెంకట్‌రెడ్డి వచ్చి వాగులోకి దూకి కనిపించిన వారందరిని పైకి లాగారు. శిల్ప కనిపించకపోవడంతో నీటిగుంతలో వెతికారు. చివరికి ఆమె కాళ్లకు తగలడంతో మునిగి పైకి తీశారు. శ్వాస తీయడం ఇబ్బందిగా ఉండటంతో ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా శిల్పను గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిచంపి నీటి గుంటలో పడేశారని ఆమె మృతిపై తమకు అనుమానం ఉందని బంధువులు ఆరోపించారు. శిల్ప చిన్నమ్మ గోరెబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిల్ప కుటుంబ సభ్యులను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పరామర్శించారు. చిన్నారులు చదువుకోవడానికి తనవంతుగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment