నిందితులతో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు
ప్రొద్దుటూరు క్రైం: దీపాల కోసం వెళ్లిన కిలాడి లేడి కళ్లు బీరువాపై పడ్డాయి.. ఆలస్యం చేయకుండా పట్టపగలే బీరువాలోని నగలను లూటీ చేసి పరారైంది.. నిఘా కెమెరాలకు దొరకకుండా ఉండేందుకు మున్సిపల్ వర్కర్‌లా చొక్కా వేసుకుంది.. అయినా ఆమె ఆటలను పోలీసులు ఎన్నో గంటలు సాగనీయలేదు. పట్టపగలే ఓ ఇంట్లోకి వెళ్లి నగలను దొంగలించిన మహిళతో పాటు మరో వ్యక్తిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు త్రీ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో బొల్లవరం శంకరమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. ఈ నెల 7న ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని మహిళ వచ్చి బీరువాలో ఉన్న 10.5 తులాల బంగారు నగలను దోచుకొని పారిపోయింది. ఆమె బయటికి వచ్చి చూసే లోపే దారిన వెళ్లే ఒక వ్యక్తి స్కూటీలో ఎక్కి ఉడాయించింది. బా«ధితురాలి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు.
సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు
ఇటీవల పోలీసులు పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. చోరీకి పాల్పడిన కిలాడి లేడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటికి సంబంధించిన ఫోటోలను పోలీసులు పత్రికలకు విడుదల చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో త్రీ టౌన్ సీఐ జయానాయక్, ఎస్‌ఐలు కృష్ణంరాజునాయక్, నరసయ్య తమ సిబ్బందితో కలిసి మంగళవారం జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులోని పొట్టిపాడుకు వెళ్లే దారిలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వెంకటేశ్వరస్వామి ఆలయం వైపు నుంచి పట్టణంలోకి వస్తున్న కడపలోని ఇందిరానగర్‌కు చెందిన తమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ అలియాస్ చిలకల ప్యారీ, అదే వీధికి చెందిన షేక్ ఖాదర్‌హుస్సేన్ బైక్‌లో వెళ్తూ పోలీసులను చూసి ఒక్కసారిగా ఆగారు. బైక్‌ను వెనక్కి తిప్పుకొని పారిపోతుండగా పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. గతంలో ప్రొద్దుటూరులో చోరీకి పాల్పడినట్టు వారు పోలీసుల వద్ద అంగీకరించారు.
మున్సిపల్ వర్కర్‌లా చొక్కా వేసుకొని..
వైఎంఆర్‌కాలనీలో నగలు దొంగలించిన వెంకటసుబ్బమ్మ అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని దారిన వెళ్లే ఒక వ్యక్తి స్కూటీలో ఎక్కి టీబీరోడ్డులోని కోర్టు బయట దిగింది. వెంటనే కోర్టు కాంపౌండ్‌లోకి వెళ్లిన ఆమె ఖాదర్‌హుస్సేన్ ఇచ్చిన మున్సిపల్ వర్కర్‌లు ధరించే బ్లూ చొక్కా వేసుకుంది. అక్కడి నుంచి వాళ్లిద్దరూ బైక్‌లో పరారయ్యారు. మరుసటి రోజు వారి ఫోటోలు పేపర్‌లో రావడంతో బయటి తిరిగితే గుర్తు పడతారని భావించి ముఖానికి గుడ్డ కట్టుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బైక్‌లో వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 2018 డిసెంబర్‌లో ఆటోలో వెళ్తున్న మహిళకు మాయ మాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను దొంగలించుకొని వెళ్లారు. నిందితురాలు వెంకటసుబ్బమ్మ భర్త చాన్‌బాషా తరపు నుంచి ఆమెకు ఖాదర్‌హుస్సేన్ తమ్ముడి వరుస అవుతాడు. అతను పాలిష్ బండల చప్పట వేయడానికి వెళ్తుంటాడు. కష్ట పడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమెతో కలసి అతను చోరీలకు అలవాటు పడ్డాడు. వారి వద్ద నుంచి రూ. 4లక్షల 60 వేలు విలువ చేసే 130 గ్రాముల బంగారు నగలు, బైక్, చొక్కా, సెల్‌ఫోన్, స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగానే వారిని గుర్తించి పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. దొంగలు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంత త్వరగా చోరీ కేసును ఛేదించిన త్రీ టౌన్ పోలీసులను డీఎస్పీ అభినందించారు.
దీపాల కోసం వెళ్లి..
ఇళ్లలో దీపారాధన కోసం వినియోగించే దీపాలను ఆమె దొంగలించేది. దీపాలను శుభ్రం చేసి బయట ఆరబెట్టగా వాటిని దొంగిలించుకొని వెళ్లేది. శంకరమ్మ ఇంట్లో కూడా దీపాలను దొంగిలించడానికే ఆమె వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లిన ఆమె నేరుగా దేవుని గూడు వద్దకు Ðð వెళ్లగా అక్కడ దీపాలు కనిపించలేదు. దీంతో పక్కనే ఉన్న బీరువాపై ఆమె కన్ను పడింది. తాళం వేయకపోవడంతో సులభంగా బీరువాను తెరచి, అందులో ఉన్న బంగారు నగలను దోచుకొని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment