మృతదేహం వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు
మందస (శ్రీకాకుళం): స్థానిక వెలుగు శాఖ విలేజ్ ఆర్గనైజేషన్ అకౌంటెంట్(వీవోఏ) కొల్లి విజయకుమారి(49) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని మహేంద్ర సినిమా హాల్ సమీపంలోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయకుమారి చాలా ఏళ్లుగా వెలుగుశాఖలో సీఎఫ్‌గా పని చేశారు. ఇటీవల వీఓఏగా హోదా మార్చారు. ఆమె మందస పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో నివసిస్తున్నారు.
బుధవారం రాత్రి వరకు అందరితో మాట్లాడిన విజయకుమారి గురువారం ఉదయం ఎంత సేపయినా తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపుల ఖాళీ నుంచి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. లోపల నుంచి తలుపులు వేసుకుని ఉండడంతో మందస ఎస్‌ఐ యర్ర రవికిరణ్ ఆధ్వర్యంలో తలుపులను కట్ చేయించారు. భర్త రవికుమార్‌కు పదేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. పెద్ద కుమార్తె సృజన హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమార్తె మృదుల విశాఖపట్నంలో చదువుతోంది.
విజయకుమారి తండ్రి కొల్లి సత్యనారాయణ సీపీఎం నాయకుడు. ఆయన అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. తల్లి మృతి వార్త విన్న కుమార్తెలు హైదరాబాదు, విశాఖపట్నం నుంచి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త రవికుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
విజయకుమారి తండ్రి సీపీఎం నాయకుడు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీపీఎం, సీఐటీయూ నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మందస ఎస్‌ఐ యర్ర రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment