velugu department
-
చీటీల పేరుతో మోసం
చిత్తూరు,తొట్టంబేడు : చీటీల పేరుతో వెలుగు కార్యాలయ సిబ్బంది రూ.10 లక్షలు ఎగనామం పెట్టారు. ఈ మేరకు బాధితులు సోమవారం వారిని నిలదీశారు. వారు చెప్పిన వివరాల మేరకు.. వెలుగు కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సరిత, మాజీ ఉద్యోగి వెంకటేష్ దీపావళి ధమాకా పేరుతో ఓ నెలసరి చిట్టీని ప్రారంభించారు. నెలకు ఒక్కొక్క మహిళ రూ.600 వంతున ఏడాదికి రూ.7,200 చెల్లించాలి. ఇలా చెల్లించిన మహిళలకు దీపావళి ధమాకా పేరుతో 22 క్యారెట్ల బంగారు 2 గ్రాములు, 30 గ్రాముల వెండి కామాక్షమ్మ దీపం, స్టీల్ తాంబూలం తట్ట, కిలో స్వీట్, టపాకాయల పెట్టె అందజేస్తామని ఆశ చూపారు. అంతేకాకుండా దీపావళికి నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పారు. తంగేళ్లపాలెం, తొట్టంబేడు, కొత్తకన్నలి, శివనాథపాలెం తదితర గ్రామాలకు చెందిన 100 మంది పేద మహిళలు డబ్బు కట్టారు. రెండేళ్లు డబ్బు కట్టినా ఎలాంటి ప్రతిఫలమూ ముట్టకపోవడంతో సరితను బాధిత మహి ళలు నిలదీశారు. తనకు సంబంధం లేదని, వెంకటేష్‌ను అడగాలని ఆమె కాలం వెళ్లదీస్తూ వచ్చింది. సోమవారం బాధితులందరూ ఏకమై వెలుగు కార్యాలయంలో సరితను నిలదీశారు. ఆమె సరిగా సమాధానం చెప్పకపోవడంతో బాధితులు ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమకు రావాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. ఈ విషయమై వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్ డాంగే యాదవ్‌ను వివరణ కోరగా అది వారి వ్యక్తిగతమని, తమకు ఎలాంటి సంబంధమూ లేదని సమాధానమిచ్చారు. -
రూ.37 లక్షలు మెక్కేశారు!
సాక్షి, బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలో ఉపాధి నిధులతో చేపట్టిన మొక్కల పెంపకం వ్యవహరంలో వెలుగు అధికారులు, సిబ్బంది రూ.36,72,910 స్వాహా చేశారని శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సామాజిక బహిరంగ సభ బట్టబయలు చేసింది. ఈ అవినీతి, అక్రమాలపై డ్వామా ఏపీడీ, సభ నిర్వహకులు శ్రీనివాస ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చొని ఉద్యో గం చేశారా అంటూ మండిపడ్డారు. సామాజిక తనిఖీ బృందం వెల్లడి చేసిన వివరాల మేరకు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2.90 కోట్ల పనులు, ఉపాధి నిధులతో పీఆర్ ద్వారా రూ.1.05 కోట్లతో సిమెంటు రోడ్ల పనులు, సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.5.23 లక్షలతో పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించారు. సెర్ఫ్ ద్వారా పండ్లతోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం పనుల కోసం రూ.1.44కోట్లు ఖర్చు చేశారు. అటవీ శాఖ ద్వారా మొక్కల పెంపకం కోసం రూ.49లక్షల ఖర్చు చేశారు. వాటర్‌షెడ్ పథకం ద్వారా ఫాంపాండ్లు, నీటి సంరక్షణ చర్యల కోసం రూ.57 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొత్తం రూ.6.70కోట్ల నిధులు వినియోగంపై లెక్క తేల్చేందుకు సామాజిక తనిఖీ బృందం వారం పాటు పనులను పరిశీలించింది. ఇందులో అన్ని శాఖలకంటే సెర్ఫ్ (వెలుగు) ద్వారా చేపట్టిన మొక్కల పెంపకం అక్రమాలతో నిండిపోయినట్టు అధికారులు తేల్చారు. ఈ శాఖ మొక్కల పెంపకం కోసం రూ.1.44 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క చూపగా అందులో రూ.33,32,820 నిధులు స్వాహా అయ్యాయని లెక్కించారు. ఊహించని అక్రమాలు ప్రధానంగా బీరంగి, బి.కొత్తకోట, గుమ్మసముద్రం, బయ్యప్పగారిపల్లెలో ఊహించని స్థాయిలో అక్రమాలు లెక్కించారు. భూమిలేకపోయినా మొక్కల పెంపకం జరిగిందని బిల్లులు ఇచ్చారు. ఒకే భూమిలో ఐదుగురు మొక్కలు పెంచారని ఐదు బిల్లులు చెల్లించారు. లేని మొక్కలు ఉన్నట్టు చూపించారు. ఇష్టానుసారంగా బిల్లులు ఇవ్వగా కొందరు రైతు బిల్లుల విషయమే తమకు తెలియదంటూ సభలో వాపోయారు. బి.కొత్తకోటకు చెందిన వెంకటరమణ అర ఎకరంలో మొక్కలు పెంపకం చేపట్టితే 2 ఎకరాల్లో పెంచారని బిల్లులు చెల్లించుకున్నారు. అయితే అర ఎకరం పెంపకానికి బిల్లులు మాత్రమే ఇవ్వలేదు. కోటావూరు పంచాయతీలో రైతు శివన్న 210 మామిడి మొక్కలు పెంచుకుంటున్నాడు. తనిఖీల్లో 190 మొక్కలు బతికే ఉన్నాయని తేల్చారు. మొక్కలను బతికించుకునేందుకు శివన్న రోజూ సైకిల్‌పై నీటి బిందెలను తీసుకెళ్లి నీరు పోస్తున్నాడు. ఇతనికి 2019 మార్చి నుంచి నిర్వహణ బిల్లులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రైతు ఎం.రెడ్డెప్పదీ ఇదే పరిస్థితి. తనిఖీల్లో ఒక ఎకరం పొలంలో 60 కొబ్బరి మొక్కలు పెంచగా రూ.9వేలు చెల్లించారు. తనిఖీల్లో 58 మొక్కలు బతికే ఉన్నాయని గుర్తించి బిల్లులు చెల్లించలేని తేలింది. మొక్కల పెంపకం పేరుతో బీరంగి పంచాయతీలో రూ.10,24,663, బి.కొత్తకోట పంచాయతీలో 15,10,887, బయ్యప్పగారిపల్లె పంచాయతీలో రూ.2,29,263, గుమ్మసముద్రం పంచాయతీలో 9,18,727, గట్టు పంచాయతీలో రూ.1,11,852, కోటావూరు పంచాయతీలో రూ.75,795 అవినీతి జరిగిందని నిర్దారించారు. ఈ సొమ్మును రికవరీకి ఏపీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశాలిచ్చారు. నాలుగు పనులకు ఒకే ఫొటో బడికాయలపల్లె పంచాయతీలో మొక్కల పెంపకానికి సంబంధించి సంఘమిత్ర భారతి ఫొటోలను ఏపీడీకి చూపించారు. ఆయన వాటిని చూసి ఇక్కడైనా సవ్యంగా జరిగిందని అనుకుం టుండగానే ఫొటోలను పరిశీలించగా అన్ని పనులకు ఒకే ఫొటో పెట్టినట్టు గుర్తించి అవాక్కయ్యారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు. మిగతా శాఖల్లో.. ఉపాధి నిధులతో చేపట్టిన పనుల్లో ఇతర శాఖల్లోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఉపాధి హామీ పథకంలో రూ.60,249, పశుసంవర్దకశాఖలో రూ.32,963, పట్టు పరిశ్రమశాఖలో రూ.2,18,806, గృహ నిర్మాణశాఖలో 27,072, అటవీ శాఖలో రూ.1,000 అక్రమాలు జరిగి నట్టు తేల్చారు. వీటి రికవరీకి నోటీసులు జారీచేశారు. మండలంలో మొత్తం రూ.36,72,910 నిధులు దుర్వినియోగం అయినట్టు తేల్చారు. గాలిలో మేడలు కట్టారు వెలుగు సిబ్బంది గాలిలో మేడలు కట్టారని ఏపీడీ శ్రీనివాసప్రసాద్ ఈ అక్రమాలపై వ్యా ఖ్యానించారు. ‘‘అసలు వీరు పనులను చూడకనే బిల్లులు చేశారు. ఏపీఎం సహా సీసీలు, సంఘమిత్రలు నిధులను దుర్వినియోగం చేశా రు. వీరంతా విశ్రాంతి తీసుకోవాల్సిదే’’నంటూ సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీఎం సహా 22 మందిపై చర్యలు గత బి.కొత్తకోట వెలుగు ఏపీఎం ఈ.హరి నా«థ్, సీసీలు హనుమంతు, రామాంజులు, అరుణమ్మ, హంషీరాబేగం, చంద్రశేఖర్, బడికాయలపల్లె ఉపాధి క్షేత్ర సహాయకుడు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. తొలగించిన సంఘమిత్రల్లో బి.కొత్తకోటకు చెందిన అంబికా, రమణమ్మ, షమీమ్, దీల్షాద్, గోళ్లపల్లెకు చెందిన సుజాత, గుమ్మసముద్రంకు చెందిన లీలావతి, బీరంగికి చెందిన బి.శంకరమ్మ, కవిత, కే.శంకరమ్మ, గట్టుకు చెందిన నరసమ్మ, శివమ్మ, బయ్యప్పగారిపల్లెకు చెందిన పద్మావతి, బడికాయలపల్లెకు చెందిన భారతి, నరసింహులు, కోటావూరుకు చెందిన పద్మజ ఉన్నారు. -
అక్రమాల వెలుగు!
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండాల్సిన వెలుగు శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు వెలికితీస్తే రూ.కోట్లలో కుంభకోణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. గతంలో న్యూట్రీషియన్, బాలబడుల కేంద్రాల్లో రూ.కోటి పైనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇతర జిల్లాలకు బదిలీతో సరిపెట్టేశారు. అప్పట్లో విచారణ పేరుతో కాలం గడిపేశారు తప్ప ఫలితం లేదు. తాజాగా ఒక మండల మహిళా సమాఖ్యకు చెందిన సీసీయే రూ.31లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారంటే పర్యవేక్షణ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. రెండు, మూడేళ్లుగా ఈ అక్రమాలు గుట్టుగా చేస్తుంటే ఎందుకు పట్టించుకోకుండా సంబంధిత అధికారులు వదిలేశారనేది ప్రశ్నగా మారింది. దీనిలో పనిచేస్తున్న వారెవ్వరూ పర్మినెంట్ ఉద్యోగులు కాదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పరిధిలో పనిచేస్తున్న 80 శాతం మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులే. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఏ పథకాలు అమలు చేస్తున్నారు, అసలు నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా? లేదా అనేది వెలుగు ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. కేవలం ఐటీడీఏ స్థాయిలో ఉన్నతాధికారులు పెట్టిన సమావేశాలకు హాజరు కావడం, వారికి కాకి లెక్కలు చూపించేసి మమ అనిపించేయడం పరిపాటిగా మారిపోయింది. కొద్ది రోజులకే పరిమితమైన పుట్టగొడుగుల పెంపకం.. ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస మండలాల్లో 2015–16లో పుట్టగొడుగుల పెంపకం అని చెప్పి హడావుడి చేసిన అధికారులు కొద్దిరోజులకే మంగళం పాడేశారు. 171 పంచాయతీల్లో 107 మహిళా సంఘాలతో 107 గ్రామాల్లో 228 మంది మహిళా సభ్యులతో పుట్టగొడుగులు పెంపకం అనిచెప్పి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు జరిగిన దాఖలాలు లేవు. బంతి మొక్కలు పెంపకం చేపట్టడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇస్తామని తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ పథకం కూడా మూతపడింది. ఇందుకు సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించినట్టు చూపి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణే లేదు. తాజాగా స్త్రీనిధి రుణాలు, పసుపుకుంకుమ, గ్రామైఖ్య సంఘం నిధులు రూ.31 లక్షలు వివిధ ఖాతాలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు. గత అక్రమాలు పరిశీలిస్తే... గతంలో సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో 2014వ సంవత్సరంలో 110 బాలబడులను ఏర్పాటు చేశారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య ఉన్న చిన్నారులను బాలబడుల్లో చేర్పించి వారికి ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది లక్ష్యం. ఎంపిక చేసిన పీవీటీజీ (ప్రిలిమినరీ వలనర్బుల్ ట్రైబుల్ గ్రూప్) గ్రామాల్లో ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో చాలా గ్రామాల్లో సరిగా పనిచేయ లేదు. దీంతో పాఠశాలలను పూర్తిగా ఎత్తివేశారు. ఈ బాలబడులకు ఆటవస్తువులు, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.50 లక్షల వరకు వెచ్చించినట్టు రికార్డుల్లో చూపించి, ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకుండా రూ.50 లక్షల వరకు కైంకర్యం చేశారు. ఆరోగ్యం, పోషణ కేంద్రాల ఏర్పాటులో.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి పీవీటీజీ గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. కొత్తూరు, సీతంపేట మండలాల్లో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మధ్యాహ్నం భోజనం, ఉదయం పాలు, కోడి గుడ్లు అందించాలి. చాలా గ్రామాల్లో ఈ పథకం అంటే ఎవరికీ తెలియని పరిస్థితి. వీటికి సంబంధించిన వంట పాత్రలు, ఇతర సామగ్రితో పాటు రూ.30 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కుంభకోణాలు నాకు తెలి యదు. లబ్ధిదారుడు తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే తప్ప..నేనేమి చేయలేను. ప్రస్తుతం తాము రుణాల రికవరీకి గ్రామాలకు వెళితే ఈ తరహా కుంభకోణం బయటపడింది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. – డైజీ, వెలుగు ఏపీడీ, సీతంపేట అక్రమార్కులపై చర్యలు తప్పవు అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవు. వెలుగు అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలపై ముఖ్యమంత్రి కృష్టికి తీసుకువెళ్లి ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వంలో అక్రమార్కులకు కొంతమంది అధికారులు కొమ్ముకాసారు. ఎవరికి దొరికింది వారు దోచుకున్నారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తాం. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
వెలుగు వీఓఏఆత్మహత్య
మందస (శ్రీకాకుళం): స్థానిక వెలుగు శాఖ విలేజ్ ఆర్గనైజేషన్ అకౌంటెంట్(వీవోఏ) కొల్లి విజయకుమారి(49) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని మహేంద్ర సినిమా హాల్ సమీపంలోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయకుమారి చాలా ఏళ్లుగా వెలుగుశాఖలో సీఎఫ్‌గా పని చేశారు. ఇటీవల వీఓఏగా హోదా మార్చారు. ఆమె మందస పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు అందరితో మాట్లాడిన విజయకుమారి గురువారం ఉదయం ఎంత సేపయినా తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపుల ఖాళీ నుంచి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. లోపల నుంచి తలుపులు వేసుకుని ఉండడంతో మందస ఎస్ఐ యర్ర రవికిరణ్ ఆధ్వర్యంలో తలుపులను కట్ చేయించారు. భర్త రవికుమార్‌కు పదేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. పెద్ద కుమార్తె సృజన హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమార్తె మృదుల విశాఖపట్నంలో చదువుతోంది. విజయకుమారి తండ్రి కొల్లి సత్యనారాయణ సీపీఎం నాయకుడు. ఆయన అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. తల్లి మృతి వార్త విన్న కుమార్తెలు హైదరాబాదు, విశాఖపట్నం నుంచి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త రవికుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయకుమారి తండ్రి సీపీఎం నాయకుడు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీపీఎం, సీఐటీయూ నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మందస ఎస్ఐ యర్ర రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘వెలుగు’లో గుబులు!
– ‘బదిలీలల’కు చెక్‌పెట్టిన కలెక్టర్ వీరపాండియన్ – కౌన్సెలింగ్‌కు జేసీ–2ను పంపిన వైనం – సిబ్బంది వ్యవహారంపై డీఆర్డీఏ పీడీ ఆగ్రహం – తనకు ‘అవమానం’ జరిగిందంటూ నిర్వేదం! (సాక్షి ఎఫెక్ట్) అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)–వెలుగులో బది‘లీలల’కు చెక్ పడింది. యూనియన్ల ముసుగులో కొందరు ఓ వైపు రాజకీయ సిఫార్సులు, మరోవైపు తమకు అనుకూలంగా ఉన్న వారిని అనుకున్న స్థానాలకు పోస్టింగ్‌లు ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా మరికొన్ని బదిలీల్లో కూడా చక్రం తిప్పుదామనుకున్నా అది నెరవేరలేదు. కలెక్టర్ వీరపాండియన్ రంగంలోకి దిగడంతో అడ్డుకట్టపడింది. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సీసీల బదిలీల్లో కొందరు ఉద్యోగులు అన్నీ తామై ‘లీలలు’ ప్రదర్శించారు. ఈ క్రమంలో ‘వెలుగులో బదిలీలలు’, వెలుగులో చీకటికోణం.. అనే శీర్షికలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై కలెక్టర్ ఆరా తీశారు. ఆదివారం డీఆర్డీఏ కార్యాలయంలో డీపీఎంలు, ఏపీఎంలు, కొందరు సీసీలకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ఉదయం 10 గంటలకు ఐదారుగురు సీసీలకు కౌన్సెలింగ్ చేసి, బదిలీ ఆర్డర్లు కూడా సిద్ధం చేశారు. ఈ సమయంలో కలెక్టర్ వీరపాండియన్ నుంచి డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. కౌన్సెలింగ్‌కు జేసీ–2 ఖాజామొహిద్దీన్ వస్తారని, ఆయన ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ చేపట్టాలని సూచించారు. దీంతో అప్పటికే కౌన్సెలింగ్ ముగించి సిద్ధం చేసిన ఆర్డర్లను బుట్టదాఖలా చేశారు. 12 గంటల సమయంలో జేసీ–2 వచ్చి మొదటి నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఎనిమిది మంది డీపీఎంలు, ముగ్గురు ఏపీఎంలు, 30 మంది వరకు సీసీలకు కౌన్సెలింగ్ చేశారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు, స్పౌస్ కేసులు, అనారోగ్యంతో ఉన్న వారు, పనితీరు బాగాలేని వారికి ప్రాధాన్యత క్రమంలో సాయంత్రం 3 గంటల వరకు బదిలీలు నిర్వహించారు. ఉద్యోగుల తీరుపై పీడీ ఆగ్రహం : బదిలీల్లో కొందరు ఉద్యోగుల తీరు వల్ల వ్యక్తిగతంగా తన ప్రతిష్ట దిగజారడంతో పీడీ వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. తాను ఉండగానే జేసీ–2ను కౌన్సెలింగ్‌కు పంపడం పట్ల ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే బదిలీల్లో చక్రం తిప్పిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కౌన్సెలింగ్‌కు జేసీ–2 వచ్చే వరకు తన చాంబర్లోనే ఉన్న ఓ ఏపీఎంను ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ బయటకు పంపించేసినట్లు సమాచారం. మరో ఏపీఎంపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా సదరు అధికారి కంటతడి పెట్టినట్టు తెలిసింది. ‘బిల్లుల’ రాజాకు చెక్ : డీఆర్డీఏలో కీలకంగా ఉన్న ఫైనాన్స్ విభాగానికొచ్చి చక్రం తిప్పాలనుకున్న ఓ అధికారి ఆశలపై జేసీ–2 నీళ్లు చల్లారు. కౌన్సెలింగ్‌ను ప్రాధాన్యత క్రమంలో చేపట్టడంతో ఈ విభాగానికి డీపీఎంగా రాధారాణికి ఆర్డర్స్ ఇచ్చారు. సదరు ‘బిల్లుల’ రాజా మరో విభాగానికి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా జరిగిన బదిలీల్లో ధర్మవరం ఏరియా కో ఆర్డినేటర్ (ఏసీ)గా ఈశ్వరయ్య, బుక్కరాయసముద్రం ఏసీగా సత్యనారాయణ, ఉరవకొండకు రవీంద్ర, హిందూపురానికి ప్రసాద్, మడకశిరకు శ్రీదేవి నియమితులయ్యారు. ఓ డీపీఎం తనకు బుక్కరాయసముద్రం క్లస్టరే కావాలని పట్టుబడడంతో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం కదిరి, తాడిపత్రి, ఓడీ చెరువు, రాయదుర్గం క్లస్టర్ల ఏసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని బదిలీలు ఇంకా జరగాల్సి ఉంది. -
వెలుగులో బది‘లీలలు’
– చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు – కీలకంగా వ్యవహరించిన ఓ మంత్రి – సీసీల బదిలీపై ‘పనితీరు’ ప్రభావం – పెర్ఫార్మెన్స్ లేకున్నా ఏపీఎంలు అక్కడే – కొన్ని ఖాళీలు ‘బ్లాక్’ చేశారన్న ఆరోపణ అనంతపురం టౌన్ : అయినవాళ్లకు అందలం ఎక్కించారు. కాని వాళ్లకు ‘మండలం’ దాటించారు. ‘పనితీరు’ పేరుతో మాయాజాలం ప్రదర్శించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకూ తలొగ్గారు. ఓ మంత్రి చక్రం తిప్పడంతో ఖాళీలను ‘బ్లాక్’ చేసి సరికొత్త బది‘లీలలు’ ప్రదర్శించారు. ఇదీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)–వెలుగులో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ తీరు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన ఆరుగురు డీపీఎంలు, 20 మంది ఏపీఎంలు, 111 మంది సీసీలను బదిలీ చేసేందుకు చేపట్టిన ఈ కౌన్సెలింగ్ ‘రాజకీయ రంగు’ పులుముకుంది. ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కౌన్సెలింగ్ చేపట్టారు. కొన్ని చోట్ల అనర్హులకు అందలం ఎక్కించారు. సీసీ కేడర్‌లో గతంలో చేపట్టిన బదిలీల్లో సొంత మండలాలకు పంపారు. అయితే.. ఈసారి ఆ అవకాశం లేదని చెప్పడంతో కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉరవకొండకు చెందిన ఓ సీసీ.. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో చివరకు ఆయనకు అక్కడే పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కీలక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల నేపథ్యంలో అనంతపురం రూరల్, గోరంట్లతో పాటు ధర్మవరం, ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పోస్టులను బ్లాక్ చేశారన్న ఆరోణలున్నాయి. తమకు కావాల్సిన వారికి ఆయా స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పించడం కోసం ఇప్పటికే సిఫారసు లేఖలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈసారి బదిలీలను 2015–16 సంవత్సరంలో ఉద్యోగుల పనితీరు ఆధారంగా చేపట్టాలని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో అధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు.. నచ్చని వారికి తక్కువ మార్కులు వేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ‘మార్కుల’ మాయాజాలంతో నష్టపోయిన సీసీలు ఇదేమని అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఉద్యోగం ఉంటే చాలని, ఎదురుతిరిగితే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని కొందరు సీసీలు ‘సాక్షి’తో అన్నారు. సీసీలకు మార్కులు తక్కువగా వేశారని, అయితే వారిపైనున్న ఏపీఎంలకు మాత్రం ఎక్కువగా ఎలా వేస్తారని అంటున్నారు. పనితీరు సరిగా లేదని 10 మంది ఏపీఎంలను బదిలీల కోసం పిలిపించారు. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వాళ్లను బదిలీ చేయకుండా ప్రస్తుత స్థానాల్లోనే ఉంచేశారు. ఇది కూడా వివాదానికి తెరతీస్తోంది. సీసీల విషయంలోనూ ఇలాగే వ్యవహరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కొంత మంది సీసీలు, ఏపీఎంలు, డీపీఎంల బదిలీల ప్రక్రియ మిగిలివుంది. వీరికి శనివారం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. కోర్టుకు వెళ్తాం : అశ్వర్థరెడ్డి, వెలుగు ఎల్1,ఎల్2 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీసీల విషయంలో అన్యాయం జరిగింది. పనితీరని చెప్పి పీడీ అన్యాయం చేశారు. కావాల్సిన వాళ్లకు కావాల్సిన మండలాలు ఇచ్చారు. ఇదేం పద్ధతి? ఈ విషయమై కోర్టుకు వెళ్తాం.