పద్మజ, నాగేశ్వర్‌రావు
ముషీరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొని రెండేళ్ల తర్వాత తనను దూరం పెట్టడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని రాంనగర్‌కు చెందిన చందా పద్మజ ఆరోపించారు. గురువారం రాంనగర్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... రాంనగర్‌కు చెందిన తాను ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశానన్నారు. హబ్సిగూడ ఐఐసీటీలో కెమిస్ట్రీలో రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్న చందా నాగేశ్వర్‌రావు ప్రేమిస్తున్నానని తన వెంటపడ్డాడని, చివరకు తాను అంగీకరించడంతో 2017 మార్చి 15న కులాంతర వివాహం చేసుకుని రాంనగర్‌లో కాపురం పెట్టాడన్నారు. ఆరు నెలల నుంచి ఇంటికి రాకుండా తనను దూరం పెట్టాడని, ఇదేంటని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో... అని బెదిరిస్తున్నాడన్నారు.
తన భర్త స్వగ్రామైన సూ ర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్ మండలం, తంగెళ్లగూడెం గ్రామానికి వెళ్తే అత్త, మామలతో పాటు బంధువులు సైతం చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాగే దళిత వర్గానికి చెందిన తనను కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు.ఫిర్యాదు చేయడానికి పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు సైతం తనతో అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. దీంతో తాను నివసించే ప్రాంతంలోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అక్కడి ఎస్సై తన భర్తతో ఎన్నిసార్లు మాట్లాడినా లెక్కచేయలేదని తెలిపారు. వారి సూచన మేరకు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు కౌన్సిలింగ్‌కు రమ్మన్నా రాలేదన్నారు. చివరకు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైందన్నారు. దాంతోపాటు ఎస్‌సీ కమిషన్‌లో కూడా కులం పేరుతో దూషించినందుకు అత్తమామలు, భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆమె పోలీస్ అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment