నెల రోజుల్లోనే కి‘లేడీ’ చేతివాటం | Women Employee Money Draw With Forgery Signatures SPSR Nellore | Sakshi
Sakshi News home page

చిరుద్యోగి కి‘లేడీ’ చేతివాటం

Published Mon, Jun 15 2020 10:37 AM | Last Updated on Mon, Jun 15 2020 11:29 AM

Women Employee Money Draw With Forgery Signatures SPSR Nellore - Sakshi

అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ సంతకాలతో దాదాపు రూ.42 లక్షలు స్వాహా చేసిన కి‘లేడి’ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ వైద్యశాలలో 2017 జూన్‌ నెలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నీలిమ అనే మహిళ చేరింది. విధుల్లో చేరిన నెల నుంచే తన చేతివాటాన్ని ప్రదర్శించింది. ఇక్కడికి రాక ముందు నెల్లూరులోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీకి బదిలీ చేశారు. అనంతరం అక్కడి లోపాలను తెలుసుకున్న ఆమె తనకు తిరుగులేదని గ్రహించి ప్రభుత్వ నిధులపై కన్నేసింది. నిధుల దోపిడీకి పాల్పడింది.   ('బాధ్యులెవరో త్వరలోనే తేలుతుంది')

విడవలూరు (బుచ్చిడ్డిపాళెం): నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి మూడు ఖాతాల నుంచి ప్రభుత్వ నిధులు జమవుతుంటాయి. అందులో బుచ్చిరెడ్డిపాళెంలోని ఆంధ్రాబ్యాంకులో డీడీఓ ఖాతా ఉంది. ఈ ఖాతాలోకి వైద్యులు, ఇతర ఉద్యోగుల జీతభత్యాలు, జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ తదితర నిధులు వస్తుంటాయి. అలాగే బుచ్చిరెడ్డిపాళెంలోని సిండికేట్‌ బ్యాంకులో హెచ్‌డీఎస్‌ ఖాతా ఉంది. ఈ ఖాతాలో వైద్యశాలకు చెందిన పరికరాలు, పారిశుద్ధ్యం, మందులు, అత్యవసర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటాయి. అలాగే అదే బ్యాంకులో ఉన్న ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎస్‌ ఖాతాలకు కాన్పులు చేయించుకున్న మహిళలకు, ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయించుకున్న వారికి, ఆశా కార్యకర్తలకు ఇచ్చే పారితోషకం కింద నిధులు వస్తుంటాయి. ఈ మూడు ఖాతాల నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ నీలిమ దాదాపు రూ.42 లక్షలు మింగేసింది. ముఖ్యంగా డీడీఏ ఖాతా నుంచి రూ.30 లక్షలు, హెచ్‌డీఎస్‌ ఖాతా నుంచి రూ.9.6 లక్షలు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎస్‌ ఖాతా నుంచి రూ.2.4 లక్షలను స్వాహా చేసినట్లు విచారణలో బయటపడింది. 

తీగ లాగితే కదిలిన డొంక   
ఏడాదిగా వైద్యశాలలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఆడిట్‌ కోసం పలు రికార్డులను పరిశీలించాలని, వాటిని తీసుకురావాలని వైద్యశాల సూపరింటెండెంట్‌ ఖాదర్‌బాషా నీలిమను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అడుగుతున్నాడు. అయితే అప్పటికే దాదాపు లక్షల రూపాయలు స్వాహా చేసిన నీలిమ పలుమార్లు రికార్డులు తన వద్ద లేవని, డీహెచ్‌ఎంఎస్‌ కార్యాలయంలోని ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వద్ద ఉన్నాయని తెలిపింది. కొన్నిసార్లు రికార్డుల్లో కొన్ని జమ చేయలేదని, వాటిని జమ చేసి త్వరలోనే ఇస్తానని కాలయాపన చేసింది. అయితే మార్చి నెలలో వైద్యశాలలో జరిగిన సాధారణ సమావేశంలో నీలిమపై ఉద్యోగులంతా పలు అంశాలపై ఫిర్యాదు చేయడంతో ఆమెకు మెమో కూడా ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆ మెమోకి సమాధానం ఇవ్వలేదు. మార్చి అనంతరం కరోనా నివారణ చర్యల్లో అధికారులంతా నిమగ్నమై ఉండడంతో తనను ఇక అడగరని భావించిన నీలిమ నకిలీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లను సృష్టించింది.

అంతేకాకుండా వాటిని ప్రభుత్వానికి చెందిన ఈ–మెయిల్‌లో భద్రపరచాల్సి ఉండగా, తన వ్యక్తిగత ఈ–మెయిల్‌లో భద్రపరచుకుని అధికారులకు చూపింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఖాదర్‌బాషా ఆమె వ్యవహార శైలిపై నిఘా ఉంచారు. తమ జీతాలకు సంబంధించిన డీడీఓ ఖాతాను పరిశీలించగా అక్కడ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా తమ జీతాల నుంచి ఆదాయపన్ను, జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌కు నిధులు పంపాల్సిన బాధ్యత నీలిమపై ఉంది. అయితే ఇక్కడ నకిలీ చలానాలను సృష్టించి ఆదాయపన్నుతోపాటు ఇతర పన్నులు కూడా చెల్లించానని నమ్మబలికేది. అయితే పన్ను చెల్లిస్తే తమ మొబైల్‌కు మెసేజ్‌ వస్తుందని పలుమార్లు ఉద్యోగులు నీలిమను అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకునేది. దీంతో వైద్యులు ఈ నెలలో నెల్లూరులోని బారకాస్‌ వద్ద ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించగా తమ బ్యాంకు నుంచి వైద్యశాలలోని ఉద్యోగుల పేరు మీద ఎలాంటి చలానాలు పంపలేదని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు బుచ్చిరెడ్డిపాళెంలోని సిండికేట్‌ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌ ఖాతాలపై కూడా విచారణ చేశారు. 

రూ.లక్షల్లో నిధులు డ్రా  
నీలిమ ఎప్పుడు పడితే అప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్లి రూ.లక్షల్లో నిధులు డ్రా చేసేది. ముఖ్యంగా బ్యాంక్‌ చెక్కులను తీసుకుని నిధులు డ్రా చేసేది. బ్యాంక్‌ అధికారులు అంత మొత్తాన్ని చెల్లించే సమయంలో చెక్కుపై ఉన్న సంతకాన్ని కూడా చూడకుండా ఎలా చెల్లించారనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కేవలం వారం వ్యవధిలోనే రెండుసార్లు రూ.లక్షల్లో డ్రా చేస్తున్నా బ్యాంక్‌ అధికారులు వైద్యశాల సూపరింటెండెంట్‌ను ఎందుకు సంప్రదించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా సిండికేట్‌ బ్యాంక్‌లో ఉన్న ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎస్‌ ఖాతా నుంచి రూ.3.6 లక్షలు డ్రా చేసిన నీలిమ ఇటీవల కాలంలో తిరిగి రూ.1.9 లక్షలు తిరిగి జమ చేసింది. అయితే ఈ ఖాతాలో కేవలం ప్రభుత్వం నుంచి మాత్రమే నిధులు జమవుతాయి. వ్యక్తిగతంగా ఇందులో జమ చేసేందుకు వీలులేదు. కానీ నీలిమ ఈ ఖాతాలో నగదు ఎలా జమ చేసిందో బ్యాంక్‌ అధికారులకే తెలియాలి. 

ఫోర్జరీతో నిధులు స్వాహా
నీలిమ అవినీతికి అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా వైద్యశాలకు చెందిన చెక్‌బుక్‌ అయిపోయిందని చెప్పి ముందుగానే బ్యాంక్‌లో తెలిపేది. వారు చెక్‌బుక్‌ పోస్టు ద్వారా వైద్యశాలకు పంపేవారు. అయితే ఈ చెక్‌బుక్‌ సూపరింటెండెంట్‌కు చేరకుండానే మధ్యలోనే ఆమె దానిని తీసుకుని వైద్యులకు మాత్రం ఇంకా చెక్‌బుక్‌ రాలేదని చెప్పేది. అనంతరం ఆ చెక్‌లపై వైద్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.లక్షలు స్వాహా చేయడంతో వైద్యులంతా విస్తుపోతున్నారు.  

పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి  
మూడు ఖాతాల నుంచి దాదాపు రూ.42 లక్షలు స్వాహా చేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ నీలిమ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. అంతేకాకుండా ఫోర్జరీ సంతకాలతో ఇంత మొత్తం నగదును డ్రా చేసినందుకు ఆమెకు సహకరించిన వారిని కూడా ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నీలిమ అవినీతిపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  
– ఖాదర్‌బాషా, సూపరింటెండెంట్,బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement