గోడకు, యంత్రానికి మధ్య ఇరుక్కుపోయిన యల్లప్ప (ఇన్‌సెట్లో ) ఛాతీలోకి దిగిన ఇనుప రాడ్
జిల్లాలోని వేర్వేరు చోట్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. బనగానపల్లె మండలం పలుకూరులో విద్యుదాఘాతంతో ఒకరు, ఆదోని మండలం బైచిగేరి సమీపంలోని రాజానగర్ వద్ద లారీ ఢీకొని మరొకరు, పాములపాడు మండలం బానకచెర్ల వద్ద బైక్ అదుపు తప్పి ఇంకొకరు మృతి చెందారు. అలాగే జూపాడుబంగ్లాలో నీటిలో పడిన గొర్రెను రక్షించేందుకు వెళ్లి ఓ యువకుడు, కర్నూలు నగర శివారులో భారీయంత్రం మధ్య ఇరుక్కుని ఓ యువకుడు దుర్మరణం చెందారు.
కల్లూరు : నగర శివారు భారత్ గ్యాస్‌కు ఎదురుగా ఉన్న జితేష్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఉలిందకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు వివరాల మేరకు..లక్ష్మీపురం గ్రామానికి చెందిన సీతన్న, సోమేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు బోయ మండ్ల యల్లప్ప (22) ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం బాటిల్స్ మూతలు తయారుచేసే యంత్రం చెడిపోయింది. ఆ యంత్రానికి మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా యంత్రాన్ని బయటకు తరలిస్తుండగా ఎల్లప్ప ఉన్న వైపు యంత్రం ఒరిగిపోయి ముందుకు కదలింది. ఈక్రమంలో ఎల్లప్ప గోడకు యంత్రానికి మధ్య ఇరుక్కుపోయాడు. యంత్రానికి ఉన్న పొడవైన ఇనుప రాడ్ అతడి ఛాతిలోకి దిగింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందాడు. తోటి కార్మికులు వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, ఉలిందకొండ పోలీసులకు సమాచారం అందించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో..
ఆదోని టౌన్: ఆదోని మండలం బైచిగేరి సమీపంలోని రాజానగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ గోపీకృష్ణ(42) దుర్మరణం పాలయ్యాడు. తాలూకా ఎస్‌ఐ సునీల్‌కుమార్ వివరాల మేరకు.. పట్టణంలోని ఎల్‌ఐజీలో నివాసముంటున్న హెడీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ పని నిమిత్తం ఎమ్మిగనూరుకు బైక్‌పై బయలుదేరాడు. రాజానగర్ క్యాంప్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య అంజనా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గోపికృష్ణ భార్య, తల్లి, బంధువులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో..
బనగానపల్లెరూరల్ : పలుకూరులో విద్యుదాఘాతంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. అవుకు గ్రామానికి చెందిన ఎం.పాండురంగ(44)కు పలుకూరుకు చెందిన దస్తగిరమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దస్తగిరిమ్మ తమ్ముడికి ఈనెల 23, 24 తేదీల్లో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పాండురంగ భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో నీటి కోసం వినియోగించే విద్యుత్ మోటర్ ప్లగ్ తీసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. బావమరిది పెళ్లి చేసేందుకు వచ్చిన పాండురంగ ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.నందివర్గం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య దస్తగిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గొర్రెను కాపాడేందుకు వెళ్లి..
జూపాడుబంగ్లా: నీటిగుంతలో పడిన గొర్రెను కాపాడేందుకు వెళ్లిన ఓ యవకుడు నీటిగుంతలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం జూపాడుబంగ్లాలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రహంతుల్లా, మైమున్ని దంపతులకు నలుగురు సంతానం. వారిలో రెండోవాడు షేక్ బషీర్ అహమ్మద్ (22) తండ్రితోపాటు గొర్రెలను మోపేందుకు వెళ్లేవాడు. ఉదయం జైన్‌ఇరిగేషన్ కంపెనీ పరిసరాల ప్రాంతాల్లోని బీడుపొలాల్లో మేతకోసం గొర్రెలను తీసుకెళ్లారు. దాహంతో ఓ గొర్రె కుంటలోని నీటిని తాగేందుకు వెళ్లి అందులో పడింది. గమనించిన బషీర్ అహమ్మద్ గొర్రెను కాపాడేందుకు కుంటలోకి దిగి నీటిలో మునిగి మృతి చెందాడు. గమనించిన తండ్రి రహంతుల్లా గ్రామస్తులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుడికి ఆరు మాసాల క్రితం వివాహం కాగా భార్య మూడు నెలలు గర్భంతో ఉన్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న బషీర్ అకాల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
బైక్ అదుపు తప్పి..
పాములపాడు: మండలంలోని బానకచెర్ల– వేంపెంట మధ్య బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం, చాపలమడుగు గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్వర్లు(28) బావకు పక్షవాతం రావడంతో పొలం పనుల్లో సాయం చేసేందుకు రెండు నెలల క్రితం బానకచెర్ల వచ్చాడు. ఇటీవల పంట తొలగించి బానకచెర్ల– వేంపెంట మధ్య వీబీఆర్ కాలువపై మొక్కజొన్న ధాన్యం ఆరబోశారు. ధాన్యం వద్ద కాపాలా ఉండేందుకు వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి సమీప బంధువైన శ్రీనువాస్ బైక్‌ను తీసుకుని బయలుదేరాడు. కాలువ ర్యాంపు వద్ద మలుపులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సుధాకరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి అనే రమణమ్మ అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment