ఉగ్రవాది యాసీన్ భత్కల్
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ ఇండియన్ ముజాహిదీన్ కో–ఫౌండర్ యాసిన్ భత్కల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పుణేలో నమోదైన కేసులో తనకు బెయిల్‌ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ళ కేసులో ఇతడికి ఉరిశిక్ష పడిన విషయం విదితమే. ఇదిలా ఉండగానే పుణేలో నమోదైన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ గత వారం తన న్యాయవాది ద్వారా అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. తనను న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో పోలీసులు విఫలమయ్యారని, ఈ కారణంగానే తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, బెంగళూరులతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, విధ్వంసాలకు సూత్రధారిగా ఉన్న గజ ఉగ్రవాది యాసీన్ భత్కల్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. ఇతడిపై ఉన్న కేసుల్లో 2010 ఫిబ్రవరి 13 నాటి పుణే జర్మన్ బేకరీలో పేలుడు కేసు ఒకటి. ఈ ఘాతుకంగా 17 మంది చనిపోగా... మరో 56 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ కేసులు పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేయగా విచారణ జరగాల్సి ఉంది. యాసీన్ సహా అతడి అనుచరులను 2015 నుంచి రాష్ట్రంలోనే ఉంచేశారు. ఇక్కడి కేసుల విచారణ పూర్తయ్యే వరకు మరో చోటికి తరలించకుండా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013 ఫిబ్రవరి నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ళ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ ఉగ్రవాదుల్ని మరో ప్రాంతానికి తరలించడానికి కుదరలేదు. ఈ కేసుల విచారణ గత ఏడాది ముగిసి ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడింది. ఆపై వీరిని ఢిల్లీకి తరలించిన అధికారులు అక్కడి తీహార్ జైలులో ఉంచారు.
క్కడ నుంచే వివిధ రాష్ట్రాల్లో ఉన్న కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2013 నుంచి ఇప్పటి వరకు యాసీన్‌ను పుణే కోర్టులో 71 సార్లు హాజరుపరచాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు. ఇన్ని పర్యాయాలు వారి వాయిదాలు కోరడంతో ఆ కేసులో అభియోగపత్రాలు దాఖలైనప్పటికీ విచారణ ప్రారంభంకాలేదు. ట్రయల్ నిర్వహించాలంటే కచ్చితంగా నిందుతులు కోర్టులో హాజరుకావాల్సి ఉండటంతో ఇలా జరిగింది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన యాసీన్ గత వారం తన న్యాయవాది జహీర్ పఠాన్ ద్వారా బెయిల్ పిటిషన్ వేయించారు. తనను కోర్టు ముందు హాజరుపచడంలో పుణే పోలీసులు విఫలమవుతున్నారని, ఈ నేపథ్యంలోనే తనకు ఆ కేసులో బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు.
ఈ పిటిషన్‌ను విచారించిన అక్కడి ప్రత్యేక న్యాయస్థానం పూర్వాపరాలు పరిశీలించింది. నిందితుడిని హాజరు పరచలేకపోవడం వెనుక పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం లేదని తేలింది. ఫలితంగా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ పేలుళ్ళలో ఉరి శిక్షపడిన, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న యాసీన్‌కు పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసినా బయటకు రావడం సాధ్యంకాదు. అయినప్పటికీ ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక మర్మం ఏమిటన్నది నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కేవలం ప్రజల దృష్టి తన వైపు తిప్పుకోవడానికేనా? లేక మరోదైనా కారణం ఉందా? అనే అంశాలను కూపీలాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment