Pune court
-
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న హాజరుకావాలని కోరుతూ రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. సత్య సావర్కర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 500 ప్రకారం రాహుల్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.ఇదీ చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
పుణె: అంధవిశ్వాసాలను రూపుమాపేందుకు మహారాష్ట్రలో సామాజిక ఉద్యమం చేసిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరు నిందితులకు పుణె ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దభోల్కర్ హత్య జరిగిన 11 సంవత్సరాలకు తీర్పు వెలువడటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ హత్యలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీరేంద్రసిన్హా తావ్డేకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. షూటర్లు సచిన్ అంధూరే, శరద్ కలాస్కర్లకు జీవితఖైదుతోపాటు చెరో రూ.5 లక్షల జరిమాన విధించారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా తావ్డే, సంజీవ్, విక్రమ్‌ను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 67 ఏళ్ల దభోల్కర్ 2013 ఆగస్ట్ 20న పుణెలో ఉదయపు నడకకు వెళ్లినపుడు బైక్‌పై వచి్చన ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలైన దభోల్కర్ ఆస్పత్రిలో చనిపోయారు. -
ఉరి సరే.. బెయిల్ ఇవ్వండి
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ ఇండియన్ ముజాహిదీన్ కో–ఫౌండర్ యాసిన్ భత్కల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పుణేలో నమోదైన కేసులో తనకు బెయిల్ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళ కేసులో ఇతడికి ఉరిశిక్ష పడిన విషయం విదితమే. ఇదిలా ఉండగానే పుణేలో నమోదైన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ గత వారం తన న్యాయవాది ద్వారా అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. తనను న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో పోలీసులు విఫలమయ్యారని, ఈ కారణంగానే తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్, బెంగళూరులతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, విధ్వంసాలకు సూత్రధారిగా ఉన్న గజ ఉగ్రవాది యాసీన్ భత్కల్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. ఇతడిపై ఉన్న కేసుల్లో 2010 ఫిబ్రవరి 13 నాటి పుణే జర్మన్ బేకరీలో పేలుడు కేసు ఒకటి. ఈ ఘాతుకంగా 17 మంది చనిపోగా... మరో 56 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ కేసులు పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేయగా విచారణ జరగాల్సి ఉంది. యాసీన్ సహా అతడి అనుచరులను 2015 నుంచి రాష్ట్రంలోనే ఉంచేశారు. ఇక్కడి కేసుల విచారణ పూర్తయ్యే వరకు మరో చోటికి తరలించకుండా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013 ఫిబ్రవరి నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ ఉగ్రవాదుల్ని మరో ప్రాంతానికి తరలించడానికి కుదరలేదు. ఈ కేసుల విచారణ గత ఏడాది ముగిసి ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడింది. ఆపై వీరిని ఢిల్లీకి తరలించిన అధికారులు అక్కడి తీహార్ జైలులో ఉంచారు. క్కడ నుంచే వివిధ రాష్ట్రాల్లో ఉన్న కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2013 నుంచి ఇప్పటి వరకు యాసీన్‌ను పుణే కోర్టులో 71 సార్లు హాజరుపరచాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు. ఇన్ని పర్యాయాలు వారి వాయిదాలు కోరడంతో ఆ కేసులో అభియోగపత్రాలు దాఖలైనప్పటికీ విచారణ ప్రారంభంకాలేదు. ట్రయల్ నిర్వహించాలంటే కచ్చితంగా నిందుతులు కోర్టులో హాజరుకావాల్సి ఉండటంతో ఇలా జరిగింది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన యాసీన్ గత వారం తన న్యాయవాది జహీర్ పఠాన్ ద్వారా బెయిల్ పిటిషన్ వేయించారు. తనను కోర్టు ముందు హాజరుపచడంలో పుణే పోలీసులు విఫలమవుతున్నారని, ఈ నేపథ్యంలోనే తనకు ఆ కేసులో బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన అక్కడి ప్రత్యేక న్యాయస్థానం పూర్వాపరాలు పరిశీలించింది. నిందితుడిని హాజరు పరచలేకపోవడం వెనుక పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం లేదని తేలింది. ఫలితంగా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ పేలుళ్ళలో ఉరి శిక్షపడిన, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న యాసీన్‌కు పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసినా బయటకు రావడం సాధ్యంకాదు. అయినప్పటికీ ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక మర్మం ఏమిటన్నది నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కేవలం ప్రజల దృష్టి తన వైపు తిప్పుకోవడానికేనా? లేక మరోదైనా కారణం ఉందా? అనే అంశాలను కూపీలాగుతున్నాయి. -
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన కుమ్మరి సత్యం అలియాస్ చిన్న సత్యంకు ఓ హత్య కేసులో పూనె కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఈ క్రమంలో అతను బాత్రూంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గత నెల 29న కూడా ఇతనికి ఇక్కడ చికిత్స చేయించారు. కాగా, గత ఏడాది మార్చి 9న మహారాష్ట్ర కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. -
సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై వచ్చిన కేసును విచారించేందుకు పుణెలోని బారామతిలో గల ఓ కోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలోని ధన్‌గార్ (పశువుల కాపర్లు) వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఇస్తామంటూ ఆయన ఎన్నికల సమయంలో తప్పుడు హామీ ఇచ్చారని హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఈ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం మోసగించినది ఏమీ లేదంటూ జడ్జి.. ఈ కేసు విచారణకు నిరాకరించారు. -
మానేకు మరణ శిక్షే!
పింప్రి, న్యూస్‌లైన్: పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి 9 మంది మృతికి, 35 మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ మానేకు పుణే కోర్టు బుధవారం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకెళ్తే... గత సంవత్సరం జనవరి 25న షోలాపూర్ జిల్లా, కారాలేకు చెందిన సంతోష్ మానే... పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో ఉన్మాదిలా మారి పుణేలోని స్వార్గేట్ బస్ డీపోనుంచి బస్సును బయటకు తీసి రోడ్డుకు వ్యతిరేక దిశలో నడిపాడు. ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొడుతూ దూసుకుపోయాడు. ఈ ఘటనలో 9 మంది మరణించగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మానేను వెంబడించిన పోలీసులు చివరికి అతణ్ని పట్టుకొని, కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. కేసును విచారించిన పుణే న్యాయస్థానం మానేకు ఉరిశిక్ష విధించింది. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ మానే బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మానే తరఫు న్యాయవాది జయదీప్ మానే... సంతోష్ మానేకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టును కోరారు. కాగా బాంబే హైకోర్టు శిక్షను రద్దు చేసి, ఈ కేసును పునఃపరిశీలించాలని, అతని మానసిక స్థితిని కూడా పరిశీలించాలని పుణే కోర్టుకు సూచించింది. దీంతో యెర్వాడ మానసిక ఆస్పత్రిలో నలుగురు డాక్టర్ల బృందం సంతోష్ మానేకు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక అనంతరం ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన వాదోపవాదాలు జరిగాయి. వాదనలు పూర్తి కావడంతో పుణే కోర్టు 11వ తేదీన తుది తీర్పునిచ్చింది. పునర్విచారణ తర్వాత కూడా మానేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు పుణే న్యాయమూర్తి వీకే శవలే తీర్పునిచ్చారు.