మానేకు మరణ శిక్షే!
పింప్రి, న్యూస్‌లైన్: పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి 9 మంది మృతికి, 35 మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ మానేకు పుణే కోర్టు బుధవారం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకెళ్తే... గత సంవత్సరం జనవరి 25న షోలాపూర్ జిల్లా, కారాలేకు చెందిన సంతోష్ మానే... పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో ఉన్మాదిలా మారి పుణేలోని స్వార్‌గేట్ బస్ డీపోనుంచి బస్సును బయటకు తీసి రోడ్డుకు వ్యతిరేక దిశలో నడిపాడు. ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొడుతూ దూసుకుపోయాడు. ఈ ఘటనలో 9 మంది మరణించగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మానేను వెంబడించిన పోలీసులు చివరికి అతణ్ని పట్టుకొని, కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు.
కేసును విచారించిన పుణే న్యాయస్థానం మానేకు ఉరిశిక్ష విధించింది. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ మానే బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మానే తరఫు న్యాయవాది జయదీప్ మానే... సంతోష్ మానేకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టును కోరారు. కాగా బాంబే హైకోర్టు శిక్షను రద్దు చేసి, ఈ కేసును పునఃపరిశీలించాలని, అతని మానసిక స్థితిని కూడా పరిశీలించాలని పుణే కోర్టుకు సూచించింది. దీంతో యెర్వాడ మానసిక ఆస్పత్రిలో నలుగురు డాక్టర్ల బృందం సంతోష్ మానేకు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక అనంతరం ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన వాదోపవాదాలు జరిగాయి. వాదనలు పూర్తి కావడంతో పుణే కోర్టు 11వ తేదీన తుది తీర్పునిచ్చింది. పునర్విచారణ తర్వాత కూడా మానేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు పుణే న్యాయమూర్తి వీకే శవలే తీర్పునిచ్చారు.