Santosh Mane
-
కిరాతక బస్సు డ్రైవర్‌కి ఉరి ఖరారు
పింప్రి, న్యూస్‌లైన్: అడ్డదిడ్డంగా బస్సు నడిపి తొమ్మిది మందిని బలి తీసుకున్న ఎమ్మెస్సార్టీసీ బస్సు డ్రైవర్ సంతోష్ మానే పెట్టుకున్న పిటిషన్‌ను మంగళవారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. సెషన్స్ కోర్టు గతంలో విధించిన ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా పుణేలో 2012 జనవరి 25న బస్టాండులో నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సును బయటికి తీసుకొచ్చిన మానే నగర వీధుల్లో అడ్డగోలుగా నడపడంతో తొమ్మిది మంది చనిపోగా, 37 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై 2013లో విచారణ జరిపిన సెషన్స్ కోర్టు మానేకి ఉరి శిక్ష విధించింది. తాను మానసిక రోగినని పేర్కొంటూ మానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ సమయంలో తన వాదనను సెషన్స్ కోర్టు వినిపించుకోలేదని ఆరోపించాడు. దీనిపై పునర్విచారణ జరిపిన హైకోర్టు మానసిక రోగినంటూ మానే గతంలో పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా ఉరి శిఖను ఖరారుచేసింది. మానేపై హత్య, హత్యాయత్నం, దాడికి పాల్పడడం, బస్సు చోరీ, ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చడం తదితర నేరాల కింద సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.కె.శెవాలే అప్పట్లో ఉరిశిక్ష విధించిన సంగతి విదితమే. -
పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్ష
ముంబై:రెండేళ్ల క్రితం తొమ్మిది మంది మృతికి కారణమైన పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది. 2012, జనవరి 25 వ తేదీన నైట్ డ్యూటీ నుంచి డే డ్యూటీకి వచ్చిన అతను ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 9 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అధికశాతం మందికి తీవ్ర గాయాలవ్వగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసమైయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా అతనికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. -
మానేకు మరణ శిక్షే!
పింప్రి, న్యూస్‌లైన్: పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి 9 మంది మృతికి, 35 మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ మానేకు పుణే కోర్టు బుధవారం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకెళ్తే... గత సంవత్సరం జనవరి 25న షోలాపూర్ జిల్లా, కారాలేకు చెందిన సంతోష్ మానే... పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో ఉన్మాదిలా మారి పుణేలోని స్వార్గేట్ బస్ డీపోనుంచి బస్సును బయటకు తీసి రోడ్డుకు వ్యతిరేక దిశలో నడిపాడు. ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొడుతూ దూసుకుపోయాడు. ఈ ఘటనలో 9 మంది మరణించగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మానేను వెంబడించిన పోలీసులు చివరికి అతణ్ని పట్టుకొని, కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. కేసును విచారించిన పుణే న్యాయస్థానం మానేకు ఉరిశిక్ష విధించింది. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ మానే బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మానే తరఫు న్యాయవాది జయదీప్ మానే... సంతోష్ మానేకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టును కోరారు. కాగా బాంబే హైకోర్టు శిక్షను రద్దు చేసి, ఈ కేసును పునఃపరిశీలించాలని, అతని మానసిక స్థితిని కూడా పరిశీలించాలని పుణే కోర్టుకు సూచించింది. దీంతో యెర్వాడ మానసిక ఆస్పత్రిలో నలుగురు డాక్టర్ల బృందం సంతోష్ మానేకు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక అనంతరం ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన వాదోపవాదాలు జరిగాయి. వాదనలు పూర్తి కావడంతో పుణే కోర్టు 11వ తేదీన తుది తీర్పునిచ్చింది. పునర్విచారణ తర్వాత కూడా మానేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు పుణే న్యాయమూర్తి వీకే శవలే తీర్పునిచ్చారు. -
మానే మరణశిక్షను తోసిపుచ్చిన హైకోర్టు
ముంబై: పుణే బస్ డ్రైవర్ మరణ శిక్షను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అధికారుల మీద కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి తొమ్మిది మంది మృతికి, 37 మంది గాయాలపాలు కావడానికి కారకుడైన సంతోష్ మానేకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8న మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన శిక్షపై మానే వాదనను ట్రయల్ కోర్టు వినలేదన్న కారణంతో మానేకు విధించిన మరణ శిక్షను హైకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి పీవీ హర్దాస్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మానే వాదనను కూడా వినాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తించాలని పేర్కొంది. కేసును మళ్లీ ట్రయల్ కోర్టుకే పంపుతున్నట్లు తెలిపింది. మానే తరఫు వాదనను కూడా వినాలని ట్రయల్ కోర్టుకు సూచిందింది. మానేను అక్టోబర్ 15న ట్రయల్ కోర్టులో హాజరుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయన తరఫు వాదన కూడా విన్న తర్వాత న్యాయమూర్తి శిక్షను విధించాలని పేర్కొంది. అంతకుముందు జరిగిన వాదనల సమయంలో మానే తరఫు న్యాయవాది జేడీ మానే మాట్లాడుతూ... నిందితుడు మానే తరఫు వాదనలను ట్రయల్ కోర్టు వినలేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది మాధవీ మాత్రే స్పందిస్తూ... ట్రయల్ కోర్టులో మానే తన వాదన వినిపించినా తీర్పు విషయంలో ఎటువంటి తేడా వచ్చే అవకాశం లేదన్నారు. ఎందుకంటే మానే కేసు ‘అరుదైన వాటిలోకెళ్ల అరుదైన కేసు’గా ఆమె అభివర్ణించారు. ‘అధికారులు తనకు విశ్రాంతినివ్వకుండా పదేపదే విధులను అప్పగిస్తుండడంతో కోపంతో డిపోలోనుంచి బస్సును తీసుకెళ్లి ప్రయాణికులకు వ్యతిరేక దిశలో దూసుకుపోనిచ్చాడు. ఈ సమయంలో మానే పూర్తిగా స్పృహలోనే ఉన్నాడు. భవనాలనుగానీ, డివైడర్లనుగానీ ఢీకొట్టకుండా ప్రజలనే లక్ష్యంగా చేసుకొని మారణకాండను కొనసాగించాడు. ప్రయాణికులను నేరుగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా 37 మంది క్షతగాత్రులుగా మారారు. వారిలో ఇప్పటికీ ఎంతోమంది వికలాంగులుగా జీవనం సాగిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇంతటి హేయమైన నేరానికి కోర్టు సరైన శిక్షే విధించింది. ఆయన వాదన విన్నా తీర్పులో ఎటువ ంటి తేడా ఉండే అవకాశం లేదు’అని మాధవి చెప్పారు. అయినప్పటికీ న్యాయస్థానాలు విధించిన శిక్షపై నిందితుడు అభిప్రాయాలను కూడా వినాల్సిన బాధ్యత ఉందని, అందువల్లే కేసును ట్రయల్ కోర్టు పంపుతున్నామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.