మహిళా పోలీస్‌ను ఫొటోలు తీసిన ఎల్లో మీడియా ప్రతినిధి
తుళ్లూరురూల్ (తాడికొండ): అమరావతి ప్రాంతంలో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరించి అక్కడి నుంచి పంపించేందుకు కొందరు ఆందోళనకారులు.. పచ్చ మీడియా సాయంతో వికృత చేష్టలకు తెరతీశారు. దుస్తులు మార్చుకుంటున్న ఓ ట్రైనీ కానిస్టేబుల్‌ను కెమెరాలతో చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మందడంలోని జెడ్పీ హైస్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. అసెంబ్లీ బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు ఒంగోలు పీటీసీ నుంచి సుమారు 370 మంది వరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు విధులకు వచ్చారు. వారికి మందడంలోని జెడ్పీ హైస్కూల్‌లోని ఖాళీ తరగతి గదుల్లో వసతి కల్పించారు.
ఈ క్రమంలో వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేందుకు కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. పచ్చ మీడియాను వెంటబెట్టుకుని వసతి గదుల వద్దకు చేరుకుని అక్కడ గదిలో దుస్తులు మార్చుకుంటున్న ఓ మహిళా ట్రైనీ కానిస్టేబుల్‌ను వీడియో తీశారు. ఆ మహిళా కానిస్టేబుల్.. భయంతో విద్యార్థులు కూర్చునే బెంచీల చాటున తలదాచుకున్నారు. వసతి ఇన్‌చార్జి అధికారి వారిని నిలదీశారు. దీంతో వారు పాత్రికేయులమంటూ.. బాధితురాలికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే బాధిత మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసులు కేసులు నమోదుచేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సమాజాన్ని చైతన్య పరచాల్సినవారు.. మహిళలతో అనుచితంగా వ్యవహరించడం బాధాకరమని సీఐడీ అడిషనల్ ఎస్పీ సరిత, విశాఖ డీఎస్పీ ప్రేమ్‌కాజల్, తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి అన్నారు. ఈ ఘటనపై వారు మీడియాతో మాట్లాడుతూ నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment