విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్
వైఎస్‌ఆర్ జిల్లా ,వైవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లే ఆర్ట్స్ కళాశాల మీదుగా అంగడివీధిలోని ఇంటికి వెళుతోంది. అయితే కళాశాల ప్రధాన ద్వారం వద్ద కాచుకొని ఉన్న ఆకతాయి.. ఆ విద్యార్థినిని.. ఏయ్ పిల్లా... వస్తావా.. అనడంతో.. మూతి పళ్లు రాలుతాయి.. అని సమాధానం ఇవ్వడంతో ఏమన్నావే.. అంటూ ఆ విద్యార్థిని వద్దకు వచ్చి విచక్షణా రహితంగా కొట్టాడు.
బాలికను ఇష్టానుసారంగా చేతులు, కాళ్లతో తన్నాడు. ఇంతలోనే ఆ విద్యార్థిని చదివే కళాశాలకు చెందిన విద్యార్థులు అటుగా రావడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో విద్యార్థిని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారంతా కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్యకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగప్రవేశం చేశారు. ఒన్‌టౌన్ సీఐ టి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కళాశాలలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. అయితే పుటేజీల్లో ప్రధాన ద్వారం వరకు కెమెరాలు లేకపోవడంతో వారికి ఎటువంటి ఆధారం లభించలేదు.
తప్పని వేధింపులు..
ఆ విద్యార్థినితో పాటు అటుగా వెళ్లే మహిళలను కొందరు ఆకతాయిలు ప్రతిరోజూ ఏదో ఒక వంకతో కామెంట్ చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకతాయిలను గుర్తుపట్టేందుకు కళాశాలలోని విద్యార్థుల ఫొటోలను చూపించగా.. తరచూ కామెంట్ చేసే ఇద్దరిని వారు గుర్తించారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ వారిని పిలిపించి విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడి వివరాలు తెలిస్తే చెప్పాలని కోరారు.
అమ్మాయిలపై కామెంట్ చేయడం సిగ్గుగా లేదా అంటూ చీవాట్లు పెట్టారు. అనంతరం వారిని వారి కుటుంబసభ్యుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. కాగా పట్టపగలే ఇలా విద్యార్థినిపై దాడి చేయడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాడి చేసిన ఆకతాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment