
గోపి (ఫైల్)
నల్లగొండ , చింతలపాలెం (హుజూర్‌నగర్) : తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిన ఓ యువకుడు చెరువులో శవమై కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఈ విషాధ సంఘటన మండలంలోని నక్కగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జెవిశెట్టి నాగేశ్వరరావు, కుమారి దంపతులకు కుమారుడు అనంత గోపి, కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. గోపి కోదాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులు కావడంతో కుమారుడు ఇంటి వద్ద తరుచూ టీవీ చూస్తుండేవాడు. మూడురోజుల క్రితం తల్లి గోపిని మందలించింది.
దీంతో అతను ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం తల్లిదండ్రులు విజయవాడ, పిడుగురాళ్ల, కోదాడ తదితర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి ఇళ్ల వద్ద వెతుకుతున్నారు. కాగా బుధవారం స్థానిక చెరువు వద్ద పశువుల కాపరులకు అనూహ్యంగా గోపి (18) శవమై కనిపించాడు. అప్పటికే శరీరభాగాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. బట్టలను చూసి గోపిగా గుర్తించారు. చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపి కుటుంబాన్ని ఎంపీపీ భూక్యా ఝమా చోక్లానాయక్, సర్పంచ్ బాదె ధనమ్మకాశయ్య, ఎంపీటీసీ తోట శ్యామలమ్మ అంజయ్య పరామర్శించి ఓదార్చారు. ఈ విషయమై ఎస్‌ఐ పరమేష్‌ను సంప్రదించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.