మణిదీప్ మృతదేహాం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు
నకరికల్లు: పండగంటూ ఇంటికొచ్చిన బిడ్డ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన నకిరికల్లు సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ వద్ద చోటు చేసుకుంది. దీంతో దీపావళి వెలుగులు నిండాల్సిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి మణిదీప్(22) గురువారం సాయంత్రం నకరికల్లులోని చెరువు కట్టపైకి చేరుకున్నారు. అక్కడే భోజనం చేసి మంచినీళ్ల కోసం చెరువులోకి దిగుతూ జారి పడిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయి గల్లంతయ్యాడు.
రంగంలోకి దిగిన పోలీసులు..
విద్యార్థి చెరువులో జారిపడి గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ సిబ్బందితో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించారు.అప్పటికే చీకటిగా ఉండడంతో తిరిగి శుక్రవారం ఉదయం నుంచి వెతుకులాట ప్రారంభించారు. మృతదేహం నీటిపై తేలియాడడంతో అతికష్టం మీద వెలికితీశారు. నరసరావుపేట ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మున్సిపల్ డీఈ జె.శివరామకృష్ణ, ఏఈ షేక్. మహమ్మద్‌రఫీలు గురువారం రాత్రి ఘటనాస్థలిని పరిశీలించారు.
మిన్నంటిన రోదనలు..
పండుగ ఘనంగా జరుపుకుందామని ఉల్లాసంగా వచ్చిన ఒక్కగానొక్క బిడ్డ ఇంటికి వచ్చిన 24గంటల్లోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుమారుడి ఆచూకి కోసం రాత్రంతా కునుకు లేకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులు మృతదేహాన్ని వెలికి తీయడంతో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. విద్యార్థి మృతదేహాన్ని చూసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. మృతుడి తండ్రి నకరికల్లు వాసులకు సుపరిచితుడు కావడంతో ఇనిమెట్ల, నకరికల్లు రెండు గ్రామాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి.
రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలి
చెరువులో ఇప్పటికే ప్రమాదవశాత్తు పడి ఆరుగురికి పైగా మృతిచెందారు. జిల్లాలోనే పెద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావడంతో ఈ ప్రదేశానికి సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు స్పందించి రక్షణకు కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment